Share News

నిబంధనలా.. అవెక్కడ?

ABN , Publish Date - Mar 01 , 2024 | 03:38 PM

నిబంధనలు గాలికి వదిలి ఇష్టారీతిన ఆస్పత్రులు, క్లినిక్స్‌, ఫార్మసీలు, మందుల గోదాములు ఏర్పాటు చేస్తున్నారు.

నిబంధనలా.. అవెక్కడ?

  • పుట్టగొడుగుల్లా దవాఖానలు!

  • చిన్నచిన్న దుకాణాల్లో క్లినిక్‌లు, ఫార్మసీలు

  • ఇష్టారీతిన వెలుస్తున్న ఫార్మసీ గోదాములు

  • అనుమతులు లేకుండానే నిర్వహణ

  • ఒక్కసారే రిజిస్ట్రేషన్‌..రెన్యువల్‌ లేనేలేదు

  • మాముళ్ల మత్తుతో పట్టింపులేని యంత్రాంగం

హైదరాబాద్‌ సిటీ, మార్చి1(ఆంధ్రజ్యోతి): నిబంధనలు గాలికి వదిలి ఇష్టారీతిన ఆస్పత్రులు, క్లినిక్స్‌, ఫార్మసీలు, మందుల గోదాములు ఏర్పాటు చేస్తున్నారు. అది సెల్లార్‌, గ్రౌండ్‌ ఫ్లోర్‌, చిన్నచిన్న దుకాణాలు ఇలా ఎక్కడపడితే అక్కడ దవాఖానాలు వెలుస్తున్నాయి. పలుచోట్ల మొదటి సారి ఆస్పత్రి కోసం రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నా.. మళ్లీ రెన్యువల్‌ను పట్టించుకోకుండా ఏళ్లుగా నిర్వహిస్తున్నారు. ఇటీవల ఔషధ నియంత్రణ సంస్థ నిర్వహిస్తున్న దాడుల్లో ఇలాంటి ఫార్మసీ కేంద్రాలు వెలుగులోకి వచ్చాయి. తనిఖీ సమయంలో అధికారుల చేయి తడిపితే చాలు ‘గుడ్‌’ అనే సర్టిఫికెట్‌ వస్తుంది. అవసరమైతే ఏకంగా ఆస్పత్రి పేరును మార్చి అనుకూలంగా నిబంధనలు రూపొందించుకోవచ్చు. ఇది గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఆరోగ్య కేంద్రాల దుస్థితి. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం.

జీహెచ్‌ఎంసీ పరిధిలో ఆరువేల ఆస్పత్రులు

ఎక్కువ శాతం ఆస్పత్రులు, క్లినిక్‌లు, నర్సింగ్‌హోములు, ఫార్మసీ కేంద్రాలు అనుమతి లేకుండా పనిచేస్తున్నాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో పది నుంచి 250 పడకల ఆస్పత్రులు ఆరువేల వరకు ఉన్నాయి. అందులో సగం ఆస్పత్రులకు కూడా అనుమతులు లేవంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించుకోవచ్చు. ఆస్పత్రి వర్గాలు రిజిస్ట్రేషన్‌ విషయంలో ఎంత నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నారో స్పష్టమవుతోంది. చాలావరకు తాత్కాలిక అనుమతి తీసుకోని వాటతోనే నెట్టుకొస్తున్నాయి. మరికొన్ని చోట్ల అయిదేళ్ల వరకు అనుమతి తీసుకుని తర్వాత చేతులు ఎత్తేస్తున్నారు. నగరం, శివారు ప్రాంతాల్లో రెండున్నర వేలకు పైగా నర్సింగ్‌హోమలు ఉంటాయి. ఇందులో కేవలం 500 లోపు ఆస్పత్రులే అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నాయి. చిన్న గదులు, వరండాలు, వాహనాల రణగణ ధ్వనుల మధ్య చాలా క్లినిక్స్‌ వెలిశాయి. ఆస్పత్రుల్లో ఎక్కడ నిబంధనలకు అనుగుణంగా ఫర్నిచర్‌, పరికరాలు, స్టాఫ్‌ ఉండరు. ఇందులో కనీసం నిపుణులైన వైద్యులూ ఉండరు, అనుమతి లేని ఎందరో వైద్యులు ఇక్కడ చికిత్స అందిస్తూ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు.

డీఎంహెచ్‌ఓ తనిఖీ తర్వాతే..

సాధారణ క్లినిక్‌ ఏర్పాటు చేయాలంటే కూడా అనుమతి ఉండాల్సిందే. ఒక పడకతో ఏర్పడే నర్సింగ్‌హోము అయినా రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాల్సిందే. జీఓఎంఎస్‌ నంబర్‌ 135 ప్రకారం ప్రతీ హెల్త్‌ సెంబర్‌ నిబంధనలు పాటించాల్సిందే. ఆస్పత్రి ఏర్పడిన తర్వాత అన్ని వసతులు సమకూర్చుకుని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ (డీఎంహెచ్‌ఓ) కార్యాలయంలో అనుమతి పొందాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న ఆస్పత్రి, నర్సింగ్‌ హోములకు 90 రోజుల పాటు తాత్కాలికంగా అనుమతి ఇస్తారు. డీఎంహెచ్‌ఓ తనిఖీ తరువాత అన్ని బాగున్నాయని అనుకుంటే పూర్తి చేస్తాయిలో అనుమతి ఇస్తారు. కానీ ఈ నిబంధనల ప్రకారం అలా ఎక్కడా జరడం లేదు. ఆస్పత్రులు, నర్సింగ్‌హోములు, క్లినిక్‌ల రిజిస్ట్రేషన్‌ వైపు ఎవరూ కన్నెత్తి చూడడం లేదు.

ఇవి తప్పనిసరి..

ఒక క్లినిక్‌ నుంచి ఆస్పత్రి వరకు అనుమతి కావాలంటే ముందుగా ఆస్పత్రి భవనానికి అనుమతి? జీహెచ్‌ఎంసీ పర్మిషన్‌? అగ్నిమాపక దళం నుంచి అనుమతి? అద్దె భవనం అయితే లీజుకు సంబంధించిన పత్రాలు, కాలుష్య నియంత్రణ బోర్డు అనుమతి, బయోమెడికల్‌కు అనుమతి తదితర అంశాలను పరిశలించిన తర్వాత జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అనుమతి ఇస్తుంది. ఆస్పత్రుల్లో అర్హత గల వైద్యులు, నర్సులు, పరికరాలు, సదుపాయలు, ఆపరేషన్‌ థియేటర్లు ఇలా అన్ని రకాల పరిస్థితులను పరిశీలించి, నిబంధల ప్రకారం ఉంటేనే అనుమతి ఇస్తారు. అగ్నిమాపక సేఫ్టీ విషయంలో గతంలో జంటనగరాల్లో ఆరువందల ఆస్పత్రులకు అధికారులు నోటీసులు జారీ చేశారు. ఏదైనా ప్రమాదం ఏర్పడితే అగ్నిమాపక వాహనం తిరగడానికి చుట్టు స్థలం ఉండాలి. కానీ చాలా ఆస్పత్రులు, కనీసం సైకిల్‌ కూడా తిరిగే స్థలం లోని ప్రాంతంలో ఏర్పాటు చేశారు. గతంలో అగ్నిమాపక నిబంధనలు లేని ఓ ఆస్పత్రిలో ప్రమాదం ఏర్పడడంతో అప్పట్లో దానిని రద్దుచ ేశారు. ఆ తర్వాత పేరు మార్చుకుని ఆ ఆస్పత్రి మళ్లీ అనుమతులు తెచ్చుకున్నారు.

కరువైన పర్యవేక్షణ

గ్రేటర్‌లో మెజార్టీ ఆస్పత్రులు ఎవరి అనుమతులు లేకుండానే సాఫీగా సాగిపోతున్నాయి. వీటిని అజామాయిషీ చేసే అధికారం కూడా లేకపోవడంతో ఉన్నతాధికారులు ఏమీ చేయలేని పరిస్థితులు కొట్టుమిట్టాడుతున్నారు. ప్రతి ఏటా ఏదో నామికేవాస్తే నోటీసులు జారీ చేయడం ఆ తరువాత మిన్నకుండిపోవడం జరుగుతోంది. ఓ మూడు నాలుగు పడకల ఆస్పత్రి ఏర్పడుతుంటే చాలు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జీహెచ్‌ఎంసీ, అగ్నిమాపక వంటి శాఖల అనుమతి తప్పని సరి. ఈ శాఖల నుంచి అనమతి తెచ్చుకోవడానికి ముందు నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. అయితే నిబంధనలకు అనుగుణంగా చాలా ఆస్పత్రులు ఉండడం లేదు. కాబట్టి అనుమతులకు ఎవరూ ముందుకు పోవడం లేదు.

Updated Date - Mar 01 , 2024 | 03:38 PM