Share News

TG Elections: ఎన్నికల ముందు ఏంటిది రాజా.. బీజేపీలో అయోమయం!?

ABN , Publish Date - Apr 13 , 2024 | 03:39 PM

ఎన్నికలు సమీపిస్తుండటంతో అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారంలో వేగాన్ని పెంచాయి. బీజేపీ గ్రేటర్‌ పరిధిలోని మూడు లోక్‌సభ స్థానాలకు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. హైదరాబాద్‌ స్థానం నుంచి కొంపెల్ల మాధవీలతను బరిలోకి దింపింది. మొదటి జాబితాలోనే ఆమె పేరును ప్రకటించడంతో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తోంది. కానీ..

TG Elections: ఎన్నికల ముందు ఏంటిది రాజా.. బీజేపీలో అయోమయం!?

  • నారాజ్‌లో గోషామహల్‌ ఎమ్మెల్యే

  • పార్టీ కార్యక్రమాలకు దూరం దూరం

  • ‘హైదరాబాద్‌’ ప్రచారంలోనూ కానరాని నేత

  • పార్టీపై అసంతృప్తే కారణమా?

  • అయోమయంలో బీజేపీ శ్రేణులు

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): ఎన్నికలు సమీపిస్తుండటంతో అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారంలో వేగాన్ని పెంచాయి. బీజేపీ గ్రేటర్‌ పరిధిలోని మూడు లోక్‌సభ స్థానాలకు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. హైదరాబాద్‌ స్థానం నుంచి కొంపెల్ల మాధవీలతను బరిలోకి దింపింది. మొదటి జాబితాలోనే ఆమె పేరును ప్రకటించడంతో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తోంది. కానీ, ఈ స్థానానికి ఇన్‌చార్జిగా వ్యవహారిస్తున్న గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ మాత్రం పత్తా లేరు. కార్యకర్తలు, నాయకుల సమావేశాలకు సైతం దూరంగా ఉంటున్నారు. ఇటీవల నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో జరిగిన బూత్‌ స్థాయి కార్యకర్తల సమావేశానికి కూడా హాజరు కాలేదు. బీజేపీ శాసన సభాపక్ష నేతగా తనను ప్రకటించకపోవడం, హైదరాబాద్‌ అభ్యర్థి ఎంపికలోనూ పార్టీ సంప్రదించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ శ్రేణుల్లో అయోమయం నెలకొంది.

అగ్రనాయకులతో సయోధ్య లేకనే..

రాజాసింగ్‌ ఎప్పుడూ బీజేపీలో వివాదాస్పదమే. ఒకసారి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసి పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురయ్యాడు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో సస్పెన్స్‌ ఎత్తివేసి పార్టీ తిరిగి గోషామహల్‌ టికెట్‌ కేటాయించడంతో ఆయన గెలిచారు. గతంలో కిషన్‌రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న సమయంలో ఆయన అగ్రనాయకులతో సయోధ్య లేక రాష్ట్ర కార్యాలయానికి దూరంగా ఉన్నారు. బండి సంజయ్‌ అధ్యక్షుడుగా బాధ్యతలు చెప్పట్టిన తర్వాత ఆయన తిరిగి పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొన్నాడు. బీజేపీ శాసన సభా పక్షనేత పదవీని తనకు ఇవ్వాలని పట్టుబట్టారు. ఆయనకు కాకుండా పార్టీ అధిష్ఠానం ఏలేటి మహేశ్వర్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించింది. దీంతో అప్పటి నుంచి ఆయన నారాజ్‌గా ఉన్నారు. తర్వాత ఆయన జహీరాబాద్‌, హైదరాబాద్‌ లోక్‌సభ స్థానాల నుంచి ఎక్కడో ఒక చోట పోటీ చేయాలని టికెట్‌ ఆశించారు. అక్కడ కూడ ఆయనకు ఆశాభంగం కలిగింది. ఈ నేపథ్యంలో కొంత కాలంగా ఆయన మళ్లీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.

గోషామహల్‌ నియోజకవర్గంలోనూ..

హైదరాబాద్‌ స్థానానికి మాదవీలత పేరును ప్రకటించినపుడు ఆయన మరింత అసంతృప్తికి లోనయ్యాడు. ఆమెకు టికెట్‌ కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు గతంలో ప్రచారం కూడా జరిగింది. ఇంతవరకు అటు అభ్యర్థి, ఇటు రాజాసింగ్‌ కనీసం మార్యదపూర్వకంగా కలుసుకున్న దాఖాలు కూడా లేవు. గోషామహల్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా మాధవీలత రాజాసింగ్‌ ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో ఆయన భార్య కలిసిందని, తనకు మద్దతుగా ప్రచారం చేయడానికి వస్తానని చెప్పినట్లు మాధవీలత చెబుతోంది. తన అసెంబ్లీ నియోజకవర్గంలో అభ్యర్థి పర్యటనలో కూడా బీజేపీ ఎమ్మెల్యేగా ఆయన పాల్గొనలేదు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ఆయన ప్రచారంలో పాల్గొంటారా? లేదా అనే చర్చ పార్టీలో సాగుతోంది. మార్చి 23న జరిగిన రాష్ట్ర పదాధికారుల సమావేశంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్‌ కన్వీనర్లు, ప్రభారీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎన్నికల అభ్యర్థులు, ఇన్‌చార్జీల పాల్గొన్న సమావేశానికి సైతం రాజాసింగ్‌ హాజరుకాలేదు. డిసెంబర్‌ నుంచి ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.

ఎన్నికల షెడ్యూల్‌కు ముందే..

పార్లమెంట్‌ ఎన్నికలను ఈ సారి దీటుగా ఎదుర్కొవడానికి జనవరిలోనే ఎమ్మెల్యే రాజాసింగ్‌కు హైదరాబాద్‌ లోకసభ సెగ్మెంట్‌కు ఇన్‌చార్జిగా పార్టీ నియమించింది. ఎన్నికల షెడ్యూల్‌ రాకముందే ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించింది. హైదరాబాద్‌లో పార్టీ బలాన్ని పెంచడానికి, ఓటు బ్యాంక్‌ను కూడగట్టుకోవడానికి రాజాసింగ్‌కు ఈ బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. ఆయన గెలిచిన అసెంబ్లీ నియోజకవర్గం కూడా హైదరాబాద్‌ లోక్‌సభ పరిధిలో ఉండడం గమనార్హం. పార్టీ ఎక్కడెక్కడ బలహీనంగా ఉంది? నాయకులు, కార్యకర్తలు పనితీరు ఎలా ఉంది? పాత నాయకులు ఏం చేస్తున్నారు. డివిజన్‌, బూత్‌ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడం, కార్యకర్తలు, నాయకులను చేర్చుకోవడం క్రీయశీలకగా ఉన్న వారికి బాధ్యతలు అప్పగించడం వంటి అంశాలపై ఇన్‌చార్జి దృష్టి పెట్టాల్సి ఉంది. కానీ ఈ దిశగా ఆయన దృష్టి పెట్టకపోవడంతో పార్టీ శ్రేణుల్లో అయోమయం నెలకొంది.

Updated Date - Apr 15 , 2024 | 05:14 PM