Share News

సిరా చూపితేనే సెలవు!

ABN , Publish Date - Apr 29 , 2024 | 03:23 PM

ఎన్నికల సంగ్రామం మొదలైంది.

సిరా చూపితేనే సెలవు!

  • లేకుంటే పోలింగ్‌ రోజు ఆబ్సెంటే..

  • ఐటీ కంపెనీల వినూత్న ఆలోచన

  • నగరంలో ఓటింగ్‌ పెంచే ప్రయత్నం

  • ఎలక్షన్‌ డే జాలీ డే కానివ్వొద్దనే..

  • మొదటిసారి ఓటేసే వారికి ఎయిరిండియా ఆఫర్‌

  • ఓటేస్తే రాయితీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్న హోటళ్లు

  • ఓటెయ్యకపోతే వివిధ దేశాల్లో భారీ జరిమానాలు

  • మొన్నటి అసెంబ్లీ పోరులో బాగా తగ్గిన పోలింగ్‌ శాతం

హైదరాబాద్‌సిటీ, ఏప్రిల్‌ 29(ఆంధ్రజ్యోతి): ఎన్నికల సంగ్రామం మొదలైంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని నాలుగు లోక్‌సభ స్థానాలలో అభ్యర్థులు ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. కానీ, నగరవాసుల్లో మాత్రం ఎప్పటిలాగానే ఎలాంటి స్పందన కనిపించడం లేదు. తెలంగాణా అంతా ఓ తీరు అయితే, హైదరాబాద్‌ మాత్రం ప్రత్యేకం అన్నట్లుగా ఇక్కడి ఓటరు స్పందిస్తుంటాడు. ఏ ఎన్నికలు చూసినా ఓటింగ్‌ శాతం తగ్గడమే తప్ప పెరుగుతున్న దాఖలాలు ఎప్పుడో కాని కనిపించవు. ఓటింగ్‌ శాతం పెంచడానికి లెట్స్‌ ఓట్‌ లాంటి స్వచ్ఛంద సంస్థలు, వాకథాన్‌లు, రన్‌లతో అవగాహన కార్యక్రమాలు నిర్విహించినా, కార్పొరేట్‌ కంపెనీలు ఆఫర్‌లు అందించినా నగర ఓటరు మాత్రం తమకేమీ పట్టనట్లే వ్యవహరిస్తుంటాడు. గతానుభవాలు అందించిన గుణపాఠమో లేక ఓటంగ్‌ డే ను హాలీడేగా చూస్తోన్న నగరవాసుల పట్ల వ్యతిరేకతతో ఈసారి ఐటీ కంపెనీలు పంథా మార్చబోతున్నాయి. ఎన్నికల కమిషన్‌ ఓటింగ్‌ రోజున సెలవు ఇవ్వాల్సిందేననడం పరిపాటి, నగరవాసులు ఓటీటీలతో కాలక్షేపం చేయడం మామూలే ! కానీ, ఈసారి మాత్రం సెలవు ఇచ్చినా, సిరా చుక్క లేకపోతే సెలవు ఇచ్చేదే లేదనే తీర్మానం చేయాలనుకుంటున్నాయి పలు ఐటీ సంస్థలు. ఆ దిశగా హైసియా వద్ద ప్రతిపాదన పెట్టే ఆలోచన కూడా ఉందని చెబుతున్నాయి. ఇక పలు కార్పొరేట్‌ సంస్థలు ఎప్పటిలాగానే ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రత్యేక ఆఫర్లనూ ప్రకటిస్తూ, ఓటింగ్‌ శాతం పెంచేందుకు ప్రణాళిక చేస్తుంటే, వరుసగా రెండు రోజులు సెలవులు రాబోతున్నాయి, కాబట్టి అంటూ కొంతమంది ఓటర్లు హాలీడే్‌సకు ప్రణాళిక చేసుకుంటుండటం గమనార్హం.

క్యూలైన్‌ ఫొటో తప్పనిసరి

ఇండియాలో మెట్రో నగరాల్లో ఓటింగ్‌ శాతం ఎప్పుడూ తక్కువే ఉంటుంది. హైదరాబాద్‌ అందుకు మినహాయింపేమీ కాదు. హైదరాబాద్‌ చుట్టుపక్కల 24 అసెంబ్లీ స్ధానాలుంటే వాటిలో కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే 50ు ఓటింగ్‌ దాటింది. సరాసరి మాత్రం 40ు మించి ఉండటం లేదు. దాదాపు 10 లక్షల మంది ఐటీ రంగ నిపుణులు ఇక్కడ ఉన్నారు. వారిలో సగానికి పైగానే ఇక్కడ ఓటు హక్కు ఉన్నా వినియోగించుకోవడం లేదు. దీనికి కారణం బద్ధకమే అనే సమాధానం వస్తోంది. దీనికి చెక్‌ పెట్టడానికి పలు ఐటీ కంపెనీలు కఠినమైన మార్గాన్నే అనుసరించాలనుకుంటున్నాయి. క్యూ లైన్‌లో ఓ సెల్ఫీ, ఓటు వేసిన తరువాత పోలింగ్‌ బూత్‌ బయట సిరా మార్క్‌తో ఓ సెల్ఫీ, ఉదయం ఆఫీసుకు వచ్చిన తర్వాత ఆ సిరా మార్క్‌ను చూపితేనే సెలవుగా పరిగణించడం లేదంటే ఆబ్సెంట్‌గా పరిగణించడం చేయాలనుకుంటున్నాయి. ఈ విషయాన్ని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ ఐటీ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ తెలిపారు. జీహెచ్‌ఎంసీ, అసెంబ్లీ, లోక్‌సభ.. ఎన్నిక ఏది అయినా నగరవాసులు మాత్రం ఓటు వేయడానికి బయటకు రారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలప్పుడు మరీ దారుణం. ఓ పక్క మీడియా గోలపెడుతున్నా జనం మాత్రం పోలింగ్‌ బూత్‌లకు రాలేదు. కానీ, సాయంత్రం మాల్స్‌, మల్టీప్లెక్స్‌లో మాత్రం జనం కిటకిట. లోపం ఎక్కడుంది ? ఓటు వేయడం, వేయకపోవడం వారిష్టమో కావొచ్చు. కానీ, ఓటు కోసం ఇచ్చిన సెలవును దుర్వినియోగం చేయడం మాత్రం క్షమించలేం. అందుకే ఈసారి ఈ కొత్త ప్రతిపాదన అనుసరించాలని అనుకుంటున్నాం. హైసియా ముంగిట ఈ ప్రతిపాదన మౌఖికంగా చేశాం. ఓటింగ్‌కు ఇంకా 10 రోజులు పైగానే ఉంది కాబట్టి సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నామన్నారు.

ఓటేసే వారికి ప్రత్యేక ఆఫర్లు

ఓటింగ్‌లో పాల్గొనక పోవడం మన దేశంలో మాత్రమే కాదు, మనవాళ్లు ఆదర్శంగా తీసుకునే అమెరికాలోనూ కనిపిస్తుంది. ఓటింగ్‌ శాతం పెంచడానికి అక్కడ పలు కంపెనీలు ఆఫర్‌లు ప్రకటిస్తుంటాయి. లక్కీ డ్రాలు నిర్వహిస్తుంటాయి. అలాంటి ఏర్పాట్లు ఇప్పుడు మన దగ్గర కూడా కనిపిస్తున్నాయి. ఓటింగ్‌ శాతం పెంచడానికి పలు కార్పొరేట్‌ కంపెనీలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే ఎయిర్‌ ఇండియా సంస్థ తొలిసారి ఓటు వేస్తున్న యువతకు అంటే ఓటు హక్కు ఇప్పుడే వచ్చిన వారికి బేస్‌ ఫేర్‌పై 19ు రాయితీ అందిస్తామంటుంది. అలాగే శ్రీ సిమెంట్‌కు చెందిన బంగూర్‌ సిమెంట్‌ ఓటు వేస్తామని తమ వెబ్‌సైట్‌లో కమిట్‌ అయితే చాలు, ఓ కేజీ సిమెంట్‌ను సామాజిక కారణం కోసం ఉచితంగా అందిస్తామంటుంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆఫర్లు ప్రకటించిన పలు అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌లు, క్విక్‌ సర్వీస్‌ రెస్టారెంట్లు ఈ లోక్‌సభ ఎన్నికల కోసం మళ్లీ ఆఫర్లను తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నామని, తమ నేషనల్‌ టీమ్స్‌ ఆఫర్లను తీర్చిదిద్దే ప్రయత్నంలో ఉన్నాయని చెబుతున్నారు. ఇటీవలనే బెంగళూరులో కొన్ని హోటల్స్‌ తో పాటుగా పలువురు ఔత్సాహికులు విభిన్నమైన ఆఫర్లను ప్రకటిస్తే, ఉత్తరాఖండ్‌ హోటల్స్‌ అండ్‌ రెస్టారెంట్‌ అసోసియేషన్‌ ఓటర్లకు 20ు రాయితీని ప్రకటించినట్లుగా నగరంలోని కొన్ని రెస్టారెంట్లు సైతం ఆఫర్‌లను తీసుకువస్తామంటుండటం విశేషం.

Updated Date - Apr 29 , 2024 | 03:23 PM