పట్టు బిగించాలి!
ABN , Publish Date - Mar 06 , 2024 | 03:47 PM
లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ప్రతిష్ఠాత్మకంగా మారింది.

లష్కర్‌లో విజయానికి పార్టీల కసరత్తు
ప్రచారం ప్రారంభించిన ఆశావహులు
ఇక్కడ కాంగ్రెస్ 12, బీజేపీ 5సార్లు విజయం
సిట్టింగ్ ఎంపీకే టికెట్ ఇచ్చిన బీజేపీ
కాంగ్రెస్ నుంచి బొంతుకు ఛాన్స్?
అభ్యర్థి ఎంపికపై బీఆర్‌ఎస్ కుస్తీ
హైదరాబాద్ సిటీ, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ప్రతిష్ఠాత్మకంగా మారింది. నోటిఫికేషన్ రాకముందే ఇక్కడ రాజకీయం వేడెక్కింది. లష్కర్‌పై పట్టు బిగించేందుకు ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ముమ్మరంగా కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ సిట్టింగ్ ఎంపీ, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి మరోసారి టికెట్‌ను కేటాయించింది. కాంగ్రెస్ నుంచి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పేరు ప్రచారంలో ఉండగా బీఆర్‌ఎస్ అభ్యర్థి ఎవరు అనేది స్పష్టత లేదు.
కాంగ్రె్‌సకు కంచుకోట
సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం మొదటి నుంచి కాంగ్రె్‌సకు కంచుకోటగానే ఉంది. నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి అత్యధికంగా 12 సార్లు హస్తం పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. 1957లో జరిగిన మొదటి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన అహ్మద్ మొహియుద్దీన్ విజయం సాధించారు. 1962లోనూ ఆయనదే గెలుపు. 1967లో బకర్‌అలీ మీర్జా, 1977లో ఎంఎం హ షీమ్. 1979, 1980లలో పి. శివశంకర్ విజయం సాధించారు. 1984 టి.అంజయ్య గెలుపొందగా ఆయన మరణంతో 1987లో జరిగిన ఉప ఎన్నికలో ఆయన భార్య మణెమ్మ విజయం సాధించారు. 1989లోనూ మళ్లీ ఆమే గెలిచారు. 1996లో పీవీ రాజేశ్వరరావు, 2004, 2009లలో అంజన్‌కుమార్ యాదవ్ విజయం సాధించారు. 2024 ఎన్నికల్లో పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ నాయకులు ముమ్మరంగా కృషి చేస్తున్నారు. కాగా, ఇటీవల పార్టీలో చేరిన మాజీ మేయర్ బొంతు రామ్మోహన్‌కు టికెట్ దక్కే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఐదు సార్లు కమలం హవా
1957-91 వరకు కొనసాగిన కాంగ్రెస్ హవాకు 1991లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అడ్డుకట్ట వేసింది. ఆ పారీన్టుంచి పోటీ చేసిన బండారు దత్తాత్రేయ ఎవరూ ఊహించని రీతిలో గెలిచారు. అయితే ఆయన 1996లో రెండోసారి పోటీచేసి ఓడిపోయారు. చేజారిన సీటును 1999లో గెలిచి దత్తాత్రేయ తన పట్టును నిలుపుకున్నారు. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో రెండుసార్లు కాంగ్రె్‌సను విజయం వరిస్తే 2014లో మళ్లీ బీజేపీ నుంచి దత్తాత్రేయ గెలిచారు. అనంతరం 2019లో బీజేపీ నుంచి అనూహ్యంగా జి.కిషన్‌రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. ప్రస్తుతం ఆయన కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు. దీంతో 2024 ఎన్నికల్లో ఆయనకే బీజేపీ అధిష్ఠానం మరోసారి టికెట్‌ను కట్టబెట్టింది.
ఒక్కసారి ఇండిపెండెంట్
1971లో జరిగిన నాలుగో లోక్‌సభ ఎన్నికల్లో ఎంఎం హషిమ్ స్వతంత్ర అభ్యర్థిగా తెలంగాణ ప్రజాసమితి పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ సమయంలో అక్కడ కాంగ్రెస్ ఓడిపోయింది.
ఈసారి పోటాపోటీ
కాగా, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్ పార్టీ ఒక్కసారి కూడా ఇక్కడ విజయం సాధించలేదు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన కారు పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో పట్టు నిలుపుకునేందుకు కసరత్తు చేస్తోంది. ఈ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల్గల్లో ఆరుచోట్ల బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. దీంతో ఈసారి ఎలాగైనా సికింద్రాబాద్‌లో విజయం సాధించాలని ఆ పార్టీ గట్టిగా ప్రయత్నిస్తోంది. అయితే బలమైన అభ్యర్థి కోసం ఆ పార్టీ అధిష్ఠానం ఇంకా అన్వేషణ సాగిస్తునే ఉంది. కాగా, ఇటీవల కుదిరిన బీఆర్‌ఎ్‌స-బీఎస్పీ పొత్తు ఏమైనా ఉపయోగపడుతుందా? అనేది వేచి చూడాల్సి ఉంది. ఇప్పటికే బీజేపీతోపాటు కాంగ్రెస్ అభ్యర్థి కూడా దాదాపు ఖరారైనట్లే. కాంగ్రెస్ పార్టీ రేపు అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశముంది.