Share News

‘మూసి’వేస్తూ..

ABN , Publish Date - Jul 10 , 2024 | 03:44 PM

మూసీ నది వెంట ఆక్రమణల దందాకు బ్రేక్‌ పడడం లేదు.

‘మూసి’వేస్తూ..

  • దర్జాగా మూసీ పరీవాహక స్థలాల కబ్జా

  • రాత్రిళ్లు మట్టి, నిర్మాణ వ్యర్థాలు పోసి చదును

  • ఆ తర్వాత షెడ్లు, గోదాముల నిర్మాణం

  • షెడ్లలో పార్కింగ్‌ దందా, వ్యాపారాలు

  • గతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు మాయం

  • తెలిసినా పట్టింపులేని ఎంఆర్‌డీసీ అధికారులు

  • నది వెంట దాదాపు 12 వేల అక్రమ నిర్మాణాలు

హైదరాబాద్‌ సిటీ, జూలె 10(ఆంధ్రజ్యోతి): మూసీ నది వెంట ఆక్రమణల దందాకు బ్రేక్‌ పడడం లేదు. ప్రభుత్వం మారినా పరిస్థితిలో మార్పు రావడంలేదు. నది వెంట నగర పరిధిలో ఇరువైపులా విస్తారంగా ఖాళీ స్థలంపై కబ్జాదారులు గద్దల్లా వాలిపోయారు. అందినపకాడికి ఆక్రమించుకుని యథేచ్ఛగా వ్యాపారం చేసుకుంటూ రెండు చే తులా సంపాదించుకుంటున్నారు. ఇప్పటివరకు దీన్ని అడ్డుకున్న నాథుడే లేడు. ఇటీవల రెవెన్యూ, హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, వాటర్‌ బోర్డు, పోలీసు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం అధికారులు సంయుక్తంగా వివిధ ప్రాంతాల్లో సర్వే చేపట్టగా 12వేలకు పైగా అక్రమ నిర్మాణాలు వెలిసినట్లు గుర్తించారు. ఇందులో కొందరు నిరుపేదలు నివాసాలను ఏర్పాటు చేసుకోగా మరికొందరైతే ఏకంగా దందానే చేస్తున్నారు. మూసీని పూడ్చేసి పార్కింగ్‌ ఏరియాగా మార్చుకుని మరికొందరు పెద్దఎత్తున ఆదాయం ఆర్జిస్తున్నారు. ఇంకొందరైతే వివిధ రకాల షెడ్లు, గోదాములను ఏర్పాటు చేసి భారీగా వ్యాపారమే చేస్తున్నారు. మూసీ నదిలో రాత్రివేళ పెద్దఎత్తున నిర్మాణ వ్యర్థాలు పోస్తున్నా చర్యలు తీసుకున్నదే లేదు. నదిలో ఆక్రమణలను పసిగట్టేందుకు గతంలో మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎంఆర్‌డీసీఎల్‌) ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలన్నీ మాయమైన్నట్లు సమాచారం. అయినా ఆ అధికారుల్లో చలనం లేదు.

  • మూసీ నదికి ఎఫ్‌టీఎల్‌ హద్దులు లేవు. బఫర్‌ జోన్‌ ఎంతవరకు వస్తుందనే రాళ్లు ఏర్పాటు చేయలేదు. దాంతో ఔటర్‌ రింగ్‌ రోడ్డు నార్సింగ్‌ నుంచి నగరంలోకి ప్రవేశించిన మూసీ నది నాగోల్‌ బ్రిడ్జి వరకు దాదాపు 25 కిలోమీటర్ల మేర పూర్తిగా కబ్జాకు గురైంది. మూసీ నది వెంట నార్సింగ్‌, గండిపేట, మంచిరేవుల, పీరం చెరువు బఫర్‌ జోన్‌లో అనేక నిర్మాణాలు యథేచ్చగా చేపడుతున్నారు. కార్వాన్‌ గిర్కాపల్లి, రాంసింగ్‌పురా, మొగల్‌కా నాలా, కార్వాన్‌ పరిసర ప్రాంతాల్లో మూసీ పరీవాహక ప్రాంతాన్ని కొంతమంది కబ్జాదారులు కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారు. రాంసింగ్‌పురా ప్రాంతంలో పరివాహక ప్రాంతంలో కబ్జాచేసి కొంతమంది మండపాలు నిర్మించారు. జియగూడ, మొగల్‌కానాలా, కేసరి హనుమాన్‌, గిరకపల్లి తదితర ప్రాంతాలలో కొందరు స్థానికులు మూసీ నది స్థలాన్ని కబ్జా చేసుకుని చిన్నపాటి దుకాణాలను ఏర్పాటు చేసుకున్నారు. చాదర్‌ఘాట్‌ కాజ్‌ వే బ్రిడ్జి కింద నుంచి నీరు ప్రవహించేందుకు 18 ఖానాలను నిర్మించారు. వీటిలో ఎనిమిది మాత్రమే కనిపిస్తున్నాయి. చాదర్‌ఘాట్‌ మూసానగర్‌లో మూసీని ఆక్రమించి ఇళ్లను నిర్మించారు. ఇక అంబర్‌పేట, రామంతాపూర్‌, మూసారంబాగ్‌, నాగోల్‌ తదితర ప్రాంతాల్లో పెద్దఎత్తున మూసీని పూడుస్తూ షెడ్లు నిర్మిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే మూసీ బఫర్‌ జోన్‌లోకి చొచ్చుకొచ్చి లేఅవుట్లను వేశారు.

8,529 అక్రమణల నుంచి 12వేలకు

ఐదేళ్ల క్రితం మూసీ నది వెంట అక్రమణలను గుర్తించేందుకు హైదరాబాద్‌ రెవెన్యూ యంత్రాంగం సర్వే చేసింది. నది వెంట గల ఎనిమిది మండల రెవెన్యూ అధికారులు సర్వే చేసి దాదాపు 8,529 అక్రమణలు ఉన్నట్లుగా గుర్తించారు. తాజాగా రెవెన్యూ, హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, వాటర్‌ బోర్డు, పోలీసు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం అధికారులు సంయుక్తంగా మూసీ నది ఔటర్‌ రింగ్‌ రోడ్డులోకి ప్రవేశించే గండిపేట మండలం నుంచి తూర్పున ఔటర్‌ రింగ్‌ రోడ్డు ఘట్‌కేసర్‌ మండల పరిధి వరకు మొత్తం 14మండలాల పరిధిలో సర్వే చేశారు. 12,184 అక్రమణలు లెక్క తేలాయి. అయితే అత్యధికంగా బహదూర్‌పురా, నాంపల్లి, గోల్కొండ, ఉప్పల్‌, అంబర్‌పేట మండలాల పరిధిలోనే వేలాది అక్రమణ నిర్మాణాలు వచ్చాయి. ఇతర మండలాల్లో వందల్లో ఉన్నాయి. ఐదేళ్ల తర్వాత హైదరాబాద్‌ రెవెన్యూ పరిధిలో దాదాపు 150 నుంచి 300ల వరకు అక్రమ నిర్మాణాలు మూసీ నదిలో చేపట్టినట్లు తెలిసింది.

ఉస్మానియా ఆస్పత్రి వద్ద మూసీలో పార్కింగ్‌ దందా

నగరంలోని ఉస్మానియా ఆస్పత్రికి దక్షిణం వైపు గేటు ఎదురుగా ఉన్న మూసీ నదిని అప్జల్‌గంజ్‌ లైన్‌లో పెద్దఎత్తున అక్రమించారు. మూసీ అక్రమణకు గురవ్వకుండా ఏర్పాటు చేసిన ఫెన్సింగ్‌లోనే మట్టి పోసి వాహనాలకు పార్కింగ్‌ సదుపాయాన్ని కల్పిస్తున్నారు. లారీలు, కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు పార్కింగ్‌ చేస్తే ఫీజు వసూలు చేస్తున్నారు. 24గంటల పాటు పార్కింగ్‌ చేస్తే ఒక్కో వాహనానికి ఒక్కో రకమైన ఫీజు నిర్ణయించారు. దాంతోపాటు రశీదు సైతం ఇస్తున్నారు. లారీకి రూ.400లు కాగా, కారుకు రూ.100లు, ఆటోకు రూ.50లు, ద్విచక్ర వాహనానికి రూ.20లు వసూలు చేస్తున్నారు. అదేవిధంగా ఎంజీబీఎస్‌ మెట్రో స్టేషన్‌కు సమీపంలో విక్టోరియా ప్లే గ్రౌండ్‌కు ఎదురుగా నది వెంట కూడా ప్రైవేటు బస్సులకు పార్కింగ్‌ అడ్డాగా మారింది. ఒక్కో బస్సుకు రూ.500ల వరకు రూసుం వసూలు చేస్తున్నారు. అదేవిధంగా అంబర్‌పేట ఆలీ కేఫ్‌ దాటిన తర్వాత మూసీ నది బ్రిడ్జి వెంట రామంతాపూర్‌ వైపు నాలుగు లేన్ల రోడ్డును హెచ్‌ఆర్‌డీసీఎల్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. అయితే ఈ రోడ్డుకు -మూసీ నది మధ్యలో నిర్మాణ వ్యర్థాలను పోస్తున్నారు. షెడ్లను ఏర్పాటు చేస్తున్నారు.

సీసీ కెమెరాలన్నీ మాయం

మూసీ నదిలో నిర్మాణ వ్యర్థాలను పోయకుండా ఎంఆర్‌డీసీఎల్‌ ఆధ్వర్యంలో రెండేళ్ల క్రితం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. నది వెంట నిర్మాణ వ్యర్థాలను పోసే ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వాటిని ఎంఆర్‌డీసీఎల్‌ ఆధ్వర్యంలో పర్యవేక్షించడంతోపాటు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానం చేసినట్లు అప్పటి అధికారులు వెల్లడించారు. వివిధ ప్రాంతాల్లో మూసీ వెంట ఫెన్సింగ్‌ కూడా ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం ఈ సీసీ కెమెరాలు మాయమయ్యాయి. ఎవరు ఏమి చేశారో కూడా తెలియదు. మూసీ వెంట గల ఫెన్సింగ్‌ను కూడా తొలగించి కొందరు వ్యాపారం చేస్తుండడం గమనార్హం.

Updated Date - Jul 10 , 2024 | 03:55 PM