Share News

AC Electric Buses: ఏసీ ఎలక్ట్రిక్‌ బస్సులకు ఆదరణ ఏది..?

ABN , Publish Date - May 15 , 2024 | 03:55 PM

ఎయిర్‌పోర్టు రూట్లలో ఆర్టీసీ నడుపుతున్న ఏసీ ఎలక్ట్రిక్‌ బస్సులు ప్రయాణికులు లేక ఖాళీగా తిరుగుతున్నాయి.

AC Electric Buses: ఏసీ ఎలక్ట్రిక్‌ బస్సులకు ఆదరణ ఏది..?
AC electric buses

  • ఎయిర్‌పోర్టు బస్సుల్లో తగ్గిన ప్రయాణికులు

  • 55శాతానికి మించని ఆక్యుపెన్సీ రేషియో

  • ఆర్డినరీ, మెట్రో బస్సుల్లో 90 శాతం పైనే

  • ఎయిర్‌పోర్టుకెళ్లే ఐదు రూట్లకే పరిమితం

  • ఈ బస్సుల రూట్లు పెంచితే ప్రయోజనం

  • ఆ దిశగా ఆలోచించని ఆర్టీసీ యాజమాన్యం

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): ఎయిర్‌పోర్టు రూట్లలో ఆర్టీసీ నడుపుతున్న ఏసీ ఎలక్ట్రిక్‌ బస్సులు ప్రయాణికులు లేక ఖాళీగా తిరుగుతున్నాయి. గ్రేటర్‌ పరిధిలోని 5 ప్రాంతాల నుంచి నడుపుతున్న 49 బస్సులో ఆక్యుపెన్సీ రేషియో 55 శాతానికి మించడం లేదు. గ్రేటర్‌ పరిధిలో తిరుగుతున్న 2,800 ఆర్టీసీ బస్సుల్లో రోజు 20 లక్షల మంది ప్రయాణాలు సాగిస్తుండగా, 49 ఏసీ బస్సులు కేవలం 5 వేల మంది సేవలకే పరిమితమవుతున్నాయి. కాగా సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో 90 శాతం ఆక్యుపెన్సీ నమోదవుతోంది. ఏసీ బస్సులన్నీ ఎయిర్‌పోర్ట్‌ రూట్లకే పరిమితం చేయడం, చార్జీలు అధికంగా ఉండటంతో అనుకున్న స్థాయిలో ఆదరణ పెరగడం లేదు.


ఆదరణ లేకున్నా రూట్లు పెంచకుండా అవే రూట్లలో ఖాళీగా తిప్పుతున్నారనే తప్పా ఎలాంటా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడం లేదు. సాధారణంగా గ్రేటర్‌జోన్‌లో ఆర్టీసీ ఏ రూట్లో బస్సుల్లో ఆక్యుపెన్సీ తగ్గినా వాటిని ఇతర రూట్లకు మళ్లించి ఆదాయం, ఆక్యుపెన్సీ పెంచే దిశగా చర్యలు తీసుకుంటుంది. కానీ ఈ ఏసీ బస్సుల విషయంలో ఆదరణ లేకున్నా రూట్లు పెంచకుండా అవే రూట్లలో ఖాళీగా తిప్పుతున్నారనే తప్పా ఎలాంటా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడం లేదు. గ్రేటర్‌జోన్‌ రద్దీ రూట్లలో చార్జీలు తగ్గించి ఎలక్ర్టిక్‌ ఏసీ బస్సులు నడిపితే ప్రయోజనం ఉంటుందని రవాణారంగ నిపుణులు సూచిస్తున్నారు.


మిగతా ఏ రూట్లలో..

గ్రేటర్‌లో 700కు పైగా బస్‌ రూట్లు ఉన్నాయి. అయినా ఆర్టీసీ కేవలం ఐదు రూట్లకే ఎలక్ర్టిక్‌ ఏసీ బస్సులను పరిమితం చేసింది. మూడేళ్లుగా ఏసీ బస్సులన్నీ కేవలం ఎయిర్‌పోర్ట్‌ రూట్లకే పరిమితం చేశారు. దీంతో ఇతర ఏ రూట్లలో ఏసీ బస్సులు కన్పించడం లేదు. గతంలో అన్ని రూట్లలో ఏసీ బస్సులు తిప్పుతామని ఆర్టీసీ అధికారులు చెప్పినా ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. ఏసీ బస్సులను గ్రేటర్‌ వ్యాప్తంగా నడపాలని ప్రయాణికులు డిమాండ్‌ చేస్తున్నా ఆ దిశగా ఆర్టీసీ యాజమాన్యం చర్యలు తీసుకోవడం లేదు.


మియాపూర్‌ ఎక్స్‌రోడ్‌ నుంచి వయా మియాపూర్‌ మెట్రోస్టేషన్‌, జేఎన్‌టీయూ మీదుగా రాజీవ్‌గాంధీ ఎయిర్‌ పోర్ట్‌కు 16 బస్సులు, జేబీఎస్‌ నుంచి వయా తార్నాక, ఎల్‌బీనగర్‌ మీదుగా ఎయిర్‌పోర్ట్‌కు 15 బస్సులు, సికింద్రాబాద్‌ నుంచి వయా రాణిగంజ్‌, మాసబ్‌ట్యాంక్‌ మీదుగా ఎయిర్‌పోర్ట్‌కు 6 బస్సులు, జేబీఎస్‌ నుంచి బేగంపేట, కేర్‌ ఆస్పత్రి మీదుగా ఎయిర్‌పోర్ట్‌కు 8 బస్సులు, ఏజీ రూట్‌ నంబర్‌లో 4 ఎలక్ర్టిక్‌ బస్సులను గచ్చిబౌలి నుంచి వయా ఓఆర్‌ఆర్‌ మీదుగా ఎయిర్‌పోర్ట్‌ వరకు నడుపుతున్నారు. ఈ 49 ఏసీ ఎలక్ట్రిక్‌ బస్సులు రోజూ 600 ట్రిప్పులు తిరుగుతుండగా.. సుమారుగా ఐదు వేల మంది ప్రయాణిస్తున్నారు.

Updated Date - May 15 , 2024 | 04:11 PM