Share News

కంచుకోటలో పాగాకు తహతహ

ABN , Publish Date - Mar 22 , 2024 | 03:51 PM

మూడు దశాబ్దాలుగా హైదరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో విజయదుందుభి మోగిస్తున్న మజ్లి్‌సను గెలుపును అడ్డుకునేందుకు ఈసారి బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది.

కంచుకోటలో పాగాకు తహతహ

  • హైదరాబాద్‌ లోక్‌సభ బరిలో మజ్లి్‌సను ఓడించేందుకు బీజేపీ, ఎంబీటీ తీవ్ర కసరత్తు

  • బీజేపీలో ఉద్ధండులను కాదని కొత్త ముఖం బరిలోకి

  • కార్పొరేట్‌ ఆస్పత్రి చైర్‌పర్సన్‌ రంగప్రవేశం

  • ఇప్పటికే విస్తృతంగా ప్రచారం చేస్తున్న మాధవీలత

  • ఎంఐఎంను ఢీకొట్టేందుకు రెడీ అవుతున్న ఎంబీటీ

  • ఇంకా ఖరారు కాని కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు

  • మూడు దశాబ్దాలుగా ఒవైసీకి తిరుగులేని ఆధిక్యం

చాంద్రాయణగుట్ట, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): మూడు దశాబ్దాలుగా హైదరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో విజయదుందుభి మోగిస్తున్న మజ్లి్‌సను గెలుపును అడ్డుకునేందుకు ఈసారి బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. గతంలో వెంకయ్యనాయుడు, బద్దం బాల్‌రెడ్డి, భగవంతరావులు బరిలో నిలిచి ఓటమి చవిచూశారు. ముస్లిం మైనార్టీ ఓట్లు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో ప్రతి ఎన్నికల్లో విజయం ఏకపక్షమే అవుతోంది. ఈసారి మజ్లి్‌సను కట్టడి చేయాలని కమలం పార్టీ ఓ కార్పొరేట్‌ ఆస్పత్రి చైర్‌పర్సన్‌ మాధవీలతను రంగంలోకి దింపింది. పాతబస్తీ నేపథ్యం ఉన్న ఆమె కొద్దిరోజులుగా క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.

నాడు సలావుద్దీన్‌.. నేడు అసదుద్దీన్‌

హైదరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో 1984 నుంచి వరుసగా తండ్రీకొడుకులు గెలుస్తూ వస్తుండగా ఇతర పార్టీలు ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోతున్నాయి. మజ్లిస్‌ పార్టీ 2వ అధ్యక్షుడు సుల్తాన్‌ సలాహుద్దీన్‌ ఒవైసీ 1984లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత 1989 నుంచి 1999 వరకు మజ్ల్లిస్‌ అభ్యర్థిగా రెండుసార్లు ఘన విజయం సాధించారు. 2004 నుంచి సలాహుద్దీన్‌ కుమారుడు, ప్రస్తుత మజ్లిస్‌ పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ వరుసగా నాలుగుసార్లు ఎంపీగా విజయబావుటా ఎగురేస్తున్నారు. దీంతో హైదరాబాద్‌ లోక్‌సభ మజ్ల్లి్‌సకు కంచుకోటగా మారింది.

బీజేపీకి ద్వితీయ స్థానమే

ఈ స్థానం నుంచి 1996లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, 1991, 1998, 1999లలో పోటీ చేసిన కార్వాన్‌ మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి, 2004లో పోటీ చేసిన మాజీ డిప్యూటీ మేయర్‌ సుభాష్‌ చందర్‌ జీ వంటి ప్రముఖులు తండ్రీకొడుకుల చేతిలో ఓటమి చెందారు. అయితే బీజేపీ నాటి నుంచి పట్టుబట్టిన విక్రమార్కుడిలా గట్టి పోటీనిస్తూ ద్వితీయ స్థానంలో నిలుస్తోంది. మేలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్‌ స్థానంపై జెండా ఎగురవేయాలనే గట్టి పట్టుదలతో ధార్మికవేత్త, కార్పొరేట్‌ ఆస్పత్రి చైర్‌పర్సన్‌ కంపెళ్ల మాధవీలతను బరిలో దించింది. మహా ఉద్ధండులే ఓటమి చవిచూడగా పార్టీతో సంబంధం లేనిమాధవీలతను ఈసారి ఎన్నికల్లో నిలపడం విశేషం.

కాంగ్రెస్‌, బీఆర్‌ఎ్‌సల అభ్యర్థులెవరో ?

ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైనప్పటికీ ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, బీఆర్‌ఎ్‌సలు ఇంకా తమ అభ్యర్థులను ప్రకటించలేదు. కాంగ్రెస్‌ మాత్రం ముస్లిం మైనారిటీలకు అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. బీఆర్‌ఎస్‌ తరఫున ఇటీవల పార్టీలో చేరిన ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ తన ప్రధాన అనుచరుడిని రంగంలోకి దించుతారన్న ప్రచారం సాగుతోంది. అయితే బీఆర్‌ఎస్‌ నుంచి పోటీకి పుస్తె శ్రీకాంత్‌, రాఘవేంద్ర రాజు, గడ్డం శ్రీనివా్‌సయాదవ్‌లు కూడా ఉత్సుకత చూపిస్తున్నారు. పార్లమెంట్‌ పరిధిలో ముదిరాజ్‌ ఓటర్లు అధికసంఖ్యలో ఉండడంతో ఆ వర్గానికి టికెట్‌ ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరుతున్నారు.

బరిలో ఎంబీటీ కూడా..

మజ్లిస్‌ చిరకాల ప్రత్యర్థి ఎంబీటీ కూడా లోక్‌సభకు పోటీ చేసేందుకు సన్నద్ధమవుతోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో యాకుత్‌పురా నుంచి ఎంబీటీ అభ్యర్థిగా పోటీ చేసిన అంజద్‌ ఉల్లాఖాన్‌ మజ్ల్లిస్‌ అభ్యర్థి జాఫర్‌ హుస్సేన్‌కు గట్టి పోటీ ఇచ్చి స్వల్ప ఓట్లతో ఓటమి పాలయ్యారు. తాజాగా హైదరాబాద్‌ లోక్‌సభ ఎంబీటీ అభ్యర్ధిగా అంజద్‌ ఉల్లాఖాన్‌ తిరిగి పోటీ చేయనున్నారు. దీంతో మజ్లి్‌సకు గట్టి పోటీ ఎదురుకానుంది.

2014లో పోలైన ఓట్లు

అసదుద్దీన్‌ ఒవైసీ (మజ్లిస్‌) - 5,13,868

భగవంత్‌రావు (బీజేపీ) - 3,11,414

ఎస్‌. కృష్ణారెడ్డి (కాంగ్రెస్‌ ) - 49,310

రషీద్‌ షరీఫ్‌ (బీఆర్‌ఎస్‌) - 37,195

2019లో పోలైన ఓట్లు

అసదుద్దీన్‌ ఒవైసీ (మజ్లిస్‌) - 5,17,471

భగవంత్‌రావు (బీజేపీ) - 2,35,285

ఫిరోజ్‌ఖాన్‌ (కాంగ్రెస్‌) - 49,944

పుస్తె శ్రీకాంత్‌ (బీఆర్‌ఎస్‌) - 63,239

Updated Date - Mar 22 , 2024 | 03:51 PM