Share News

US Visa Fee Hike: వీసా ఫీజులు భారీగా పెంచేసిన అమెరికా!

ABN , Publish Date - Feb 01 , 2024 | 04:44 PM

హెచ్-1బీ లాంటి పలు నాన్ ఇమిగ్రెంట్ వీసా ఫీజులను అమెరికా భారీగా పెంచేసింది. కొత్త రేట్లు ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని తాజాగా వెల్లడించింది.

US Visa Fee Hike: వీసా ఫీజులు భారీగా పెంచేసిన అమెరికా!

ఎన్నారై డెస్క్: హెచ్-1బీ లాంటి పలు నాన్ ఇమిగ్రెంట్ వీసా ఫీజులను అమెరికా పెంచింది. (US raises fees for non-immigrant visas) . కొత్త రేట్లు ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని తాజాగా వెల్లడించింది. అమెరికా ప్రకటన ప్రకారం, హెచ్-1బీ వీసా ఫీజు 460 డాలర్ల నుంచి 780 డాలర్లకు పెరిగింది. రిజిస్ట్రేషన్ ఫీజును కూడా 10 డాలర్ల నుంచి 215 డాలర్లకు పెంచింది. ఈ ఫీజు వచ్చే ఏడాది నుంచీ అమల్లోకి రానుంది. ఎల్-1 వీసా ఫీజులోనూ భారీ మార్పు చేసింది. ప్రస్తుతం 460 డాలర్లుగా ఉన్న ఫీజును ఏకంగా 1,385 డాలర్లకు పెంచింది. ఈబీ-5 వీసా ఫీజులూ పెరిగాయి. గతంలో 3,675 డాలర్లుగా ఉన్న ఫీజు దాదాపు మూడు రెట్లు పెరిగి 11,160 డాలర్లకు చేరుకుంది.


అమెరికా కంపెనీలు విదేశీ వర్కర్లను నియమించుకునేందుకు హెచ్-1బీ వీసాపై ఆధారపడతాయన్న విషయం తెలిసిందే. ఆయా రంగాల్లో నిపుణులైన వారికి ఈ వీసాలు జారీ చేస్తారు. అమెరికాలోని టెక్ కంపెనీలు హెచ్-1బీ వీసా సాయంతో భారత్, చైనాలకు చెందిన వేల మందిని ఏటా నియమించుకుంటూ ఉంటాయి. వివిధ దేశాల్లోని బ్రాంచ్‌లున్న కంపెనీల్లో అంతర్గత ట్రాన్స్‌ఫర్లపై ఉద్యోగులను నియమించుకునేందుకు ఎల్-1 వీసా అవసరం. దీని సాయంతో అమెరికా కంపెనీలు విదేశీ బ్రాంచీల్లోని వర్కర్లను అమెరికాకు రప్పిస్తుంటాయి. ఇక పెట్టుబడిదారుల కోసం ఉద్దేశించిన ఈబీ-5 వీసాలు ఇన్వెస్టర్ వీసాలుగా ప్రాచుర్యం పొందాయి. అమెరికాలో కనీసం పది మందికి ఉపాధి కల్పించేలా 5 లక్షల డాలర్లు, అంతకుమించి పెట్టుబడి పెట్టే విదేశీ సంపన్నులు, వారి కుటుంబసభ్యులకు ఈబీ-5 వీసా ఇస్తారు. 1990లో అమెరికా ప్రభుత్వం ఈ వీసాను ప్రారంభించింది.


Updated Date - Feb 01 , 2024 | 04:54 PM