Share News

NRI: అమెరికాలో భారత సంతతి శాస్త్రవేత్తకు ప్రతిష్ఠాత్మక అవార్డు

ABN , Publish Date - Feb 26 , 2024 | 10:05 PM

ఇమేజింగ్ సాంకేతికతలో విప్లవాత్మక పరిశోధనలు చేసిన భారత సంతతి శాస్త్రవేత్త అశోక్ వీరరాఘవన్‌కు ఇంజినీరింగ్ విభాగంలో ఈడిత్ అండ్ పీటర్ ఓ డానల్ అవార్డు దక్కింది.

NRI: అమెరికాలో భారత సంతతి శాస్త్రవేత్తకు ప్రతిష్ఠాత్మక అవార్డు

ఎన్నారై డెస్క్: ఇమేజింగ్ సాంకేతికతలో విప్లవాత్మక పరిశోధనలు చేసిన భారత సంతతి అమెరికా (USA) శాస్త్రవేత్త అశోక్ వీరరాఘవన్‌కు (Ashok Veeraraghavan) ఇంజినీరింగ్ విభాగంలో ఈడిత్ అండ్ పీటర్ ఓ డానల్ అవార్డు దక్కింది. ఈ అవార్డును ది టెక్సాస్ అకాడమి ఆఫ్ మెడిసిన్, ఇంజినీరింగ్ , సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రకటించింది. ఈ అవార్డు టెక్సాస్ రాష్ట్ర అత్యున్నత అవార్డుల్లో ఒకటి. చెన్నైలో పుట్టి పెరిగిన రాఘవన్ ప్రస్తుతం రైస్ యూనివర్సిటీలోని (Rice University) జార్జ్ ఆర్ బ్రౌన్ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ విభాగంలో ప్రొఫెసర్‌గా ఉన్నారు.

NRI: దుబాయిలో తెలుగు ముఠాల బ్యాంకు మోసాలు


వీరరాఘవన్ బృందం ఇమేజింగ్ టెక్నాలజీలో (Imaging Technology) పలు విప్లవాత్మక పరిశోధనలు చేస్తోంది. ఇమేజింగ్‌కు సంబంధించి ఆప్టిక్స్, సెన్సార్ డిజైన్‌ వంటి అన్ని విభాగాలను మెషిన్ ఆల్గొరిథమ్ సాంకేతికతో అనుసంధానిస్తూ, విశ్లేషిస్తూ మరింత మెరుగైన చిత్రాలను అందుబాటులోకి తెచ్చేందుకు పలు పరిశోధనలు చేశారు. పలు విప్లవాత్మక మార్పులకు కారణమయ్యారు.


ఇమేజింగ్‌కు సంబంధించి అన్ని అంశాలపైనా సమీకృత విధానంలో పరిశోధన చేస్తున్నామని ప్రొ. వీరరాఘవన్ తెలిపారు. ప్రస్తుత సాంకేతికతతో చూడటం సాధ్యం కాని వాటిని కనిపించేలా చేయడమే తమ లక్ష్యమని వీరరాఘవన్ తెలిపారు. మనం చూసే వస్తువు నుంచి పరావర్తనం చెందే కాంతి మార్గమధ్యంలో ఉండే అడ్డంకులు స్కాటర్ చేస్తాయని చెప్పారు. ఫలితంగా చిత్రం సరిగా కనబడదని చెప్పారు. భూఉపరితలాల చిత్రాలను తీసే శాటిలైట్‌లకు మబ్బులు ఇలాగే అడ్డంకిగా మారుతాయని అన్నారు. ఈ అడ్డంకుల్ని అధిగమించి మరింత స్పష్టమైన చిత్రాలను అందించడమే లక్ష్యంగా వీరరాఘవన్ బృందం పరిశోధనలు చేస్తోంది.

మరిన్ని ఎన్నారై వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Feb 26 , 2024 | 10:08 PM