Share News

Navya : నాకు తెలిసిన ఎన్టీఆర్

ABN , Publish Date - May 26 , 2024 | 03:16 AM

ఈ మధ్య టీవీ చూస్తుంటే... ‘మహానాడు వాయిదా’ అని ఒక వార్త కనిపించింది. ‘మహానాడు’ గురించి... తెలుగుదేశాన్ని స్థాపించిన ఎన్టీఆర్‌ గురించి ఆ వార్తలో విశేషాలు చెప్పటం మొదలుపెట్టారు.

Navya : నాకు తెలిసిన ఎన్టీఆర్

అలనాటి కథ

ఈ మధ్య టీవీ చూస్తుంటే... ‘మహానాడు వాయిదా’ అని ఒక వార్త కనిపించింది. ‘మహానాడు’ గురించి... తెలుగుదేశాన్ని స్థాపించిన ఎన్టీఆర్‌ గురించి ఆ వార్తలో విశేషాలు చెప్పటం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో శేషేంద్ర (గుంటూరు శేషేంద్రశర్మ)కు ఎన్టీ రామారావుతో ఉన్న స్నేహం... జ్ఞాన్‌బాగ్‌లో చండశాసనుడు షూటింగ్‌ లాంటి అనేక జ్ఞాపకాలు నాకు గుర్తుకొచ్చాయి.

శేషేంద్ర, ఎన్టీఆర్‌, ముక్కామల... ముగ్గురూ గుంటూరు ఏసీ కాలేజీలో సహాధ్యాయులు. స్నేహితులు కూడా. శేషేంద్ర ద్వారా ఎన్టీఆర్‌ను నేను అనేక సందర్భాలలో కలిశాను. ఆయన ఆతిథ్యం తీసుకున్నాను. ఆయనకు మా ఆతిథ్యం ఇచ్చాను. ఎన్టీఆర్‌ పేరు వినగానే నాకు మొదట గుర్తుకొచ్చేది మా తొలి పరిచయం. శేషేంద్ర కర్నూలులో స్పెషల్‌ ఆఫీసర్‌గా ఉన్నప్పుడు ఒక సినిమా ఫంక్షన్‌ జరిగింది. దానికి మమ్మల్ని అతిథులుగా ఆహ్వానించారు. అప్పటిదాకా నాకు తెలుగు సినిమాలతో కానీ... సినిమా నటులతో కానీ పెద్దగా పరిచయం లేదు.

ఆ ఫంక్షన్‌లో ఎన్టీఆర్‌కి ఉన్న ప్రేక్షకుల ఆదరణ చూశాను. తిరిగి వచ్చిన తర్వాత శేషేంద్ర తనకు ఎన్టీఆర్‌తో ఉన్న అనుబంఽధం గురించి చెప్పాడు. ఒకసారి శేషేంద్ర మద్రాసు వెళ్లినప్పుడు ఎన్టీఆర్‌ను కలిశాడట. ఆ సమయంలో ఎన్టీఆర్‌ ఒక చిన్న ఇంట్లో ఉండేవారట. శేషేంద్ర వచ్చాడని... తన పరుపు ఇచ్చి, తాను పక్కనే నేల మీద పడుకున్నారట. శేషేంద్ర అంటే ఎన్టీఆర్‌కు అంత అభిమానం ఉండేదిట. ఆ మర్నాడు ఉదయం మద్రాసు చూడటానికి బయటకు వెళ్దామని ఎన్టీఆర్‌ను శేషేంద్ర అడిగాడట. ‘‘నేను కారుకు అప్లై చేశాను. వచ్చే నెల వస్తుంది.

కారులో కాకుండా మామూలుగా బయటకు వెళ్తే అందరూ చుట్టుముడతారు. కారు వచ్చిన తర్వాత వెళ్దాం.. నువ్వు మద్రాసు వస్తూనే ఉంటావుగా’’ అని ఎన్టీఆర్‌ సున్నితంగా తిరస్కరించారట. శేషేంద్ర మాటలు విన్న తర్వాత వారిద్దరి మధ్య ఉన్న స్నేహం అర్థమయింది.


అలాంటి మరో జ్ఞాపకం ఇప్పుడు తమాషాగా అనిపిస్తుంది. ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి వచ్చిన కొత్తల్లో... ఒక రోజు ఉదయం రామకృష్ణ థియేటర్‌ నుంచి ఆయన సెక్రటరీ ఫోన్‌ చేశారు. ‘‘ఎన్టీఆర్‌ మద్రాసు నుంచి వస్తున్నారు. ఉదయం 8 గంటలకు మీ ఇంటికివస్తానన్నారు. మీకు ఓకేనా కాదా అని కనుక్కోమన్నారు’’ అన్నారు. ఉదయం 8 గంటలకు ప్యాలెస్‌లో పనివాళ్లు ఎవరూ ఉండరు. అంతే కాకుండా నేను తయారుగా ఉండటం కూడా కష్టమే. అందువల్ల అంత ఉదయం అయితే కలవటం వీలుపడదని చెప్పా. దాంతో ఆ విజిట్‌ క్యాన్సిల్‌ అయిపోయింది.

ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్లీ ఒక రోజు ఆయన సెక్రటరీ ఫోన్‌ చేసి... ‘‘సార్‌ ఉదయం 8 గంటలకు వస్తామన్నారు. మీకు వీలవుతుందేమో కనుక్కోమన్నారు’’ అని చెప్పారు. శేషేంద్ర స్నేహితుడు... పైగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి... ఆయన వస్తానంటే ఎలా వద్దనగలను? సరేనని చెప్పాను. ఆ రోజు ఎన్టీఆర్‌ జ్ఞాన్‌బాగ్‌కు వచ్చి కొద్ది సమయం గడిపి వెళ్లారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నేను ఆంధ్రప్రదేశ్‌ హిందీ అకాడమీకి చైర్‌పర్సన్‌గా ఉండేదాన్ని. ఆ సమయంలో ఆయనను అధికారికంగా కలిసేదాన్ని.

‘చండశాసనుడు’ చిత్రాన్ని తమిళంలో తీయాలని ఎన్టీఆర్‌ నిర్ణయించుకున్నారు. ఒక రోజు ఉదయం ఆయన శేషేంద్రకు ఫోన్‌ చేసి... ‘‘జ్ఞాన్‌బాగ్‌ ప్యాలెస్‌ షూటింగ్‌కు కావాలి. మా అబ్బాయిలు ఈ రోజు సాయంత్రం మీ దగ్గరకు వచ్చి మాట్లాడతారు’’ అని చెప్పారు. ఆ రోజు సాయంత్ర ఎన్టీఆర్‌ కుమారులు వచ్చారు. చాలా గౌరవంగా మాట్లాడారు. వాళ్లను చూస్తే నాకు చాలా ముచ్చటేసింది. నేను ఆ సినిమా షూటింగ్‌కు ఒప్పుకున్నా కానీ కొన్ని కండిషన్లు పెట్టా. నటీనటులు తప్ప వేరే క్రూ ఎవరు ఇంట్లో తిరగకూడదనేది మొదటి కండిషన్‌. ప్యాలెస్‌లో ఫర్నిచర్‌ను నా అనుమతి లేకుండా కదపకూడదనేది రెండో కండిషన్‌. ఈ రెండింటికీ ఒప్పుకున్నారు. ముహర్తం రోజు శేషేంద్ర ఆఫీసుకు వెళ్లిపోయాడు.


నేను ముహర్తం షాట్‌ చూడటానికి కిందకు వెళ్లా. జ్ఞాన్‌బాగ్‌ వెనుక ఒక పాలరాతి ఫ్లాట్‌ఫాం ఉంటుంది. దానిపై నిలబడి చూస్తే... దూరంగా హెర్క్యులెస్‌ తదితర పాలరాతి విగ్రహాలు కనిపిస్తాయి. ఆ విగ్రహాలు కనబడకుండా ఒక లావుపాటి వ్యక్తి ఆ ఫ్లాట్‌ఫాం మీద నిలబడి ఉన్నాడు. ఆయన ఎవరో నాకు అర్థం కాలేదు. అక్కడున్న వారిని ‘ఆయన ఎవరు’ అని అడిగా! ‘ఆ మాత్రం తెలియదా?’ అన్నట్లు అతను నా వైపు చూసి ‘‘శివాజీ గణేషన్‌’’ అన్నాడు. ఆ తర్వాత షూటింగ్‌ సజావుగా సాగిపోయింది.

ఇలా షూటింగ్‌ అవుతున్న సమయంలో ఒక రోజు ఎన్టీఆర్‌... మమ్మల్ని, శివాజీ గణేషన్‌ కుటుంబాన్ని డిన్నర్‌కు పిలిచారు. డిన్నర్‌లో అందరూ మాట్లాడుకున్నాం. మేము వచ్చేస్తుంటే ఎన్టీఆర్‌ శేషేంద్రపై చేయి వేసి... ‘‘ఈమెకు మన స్నేహం గురించి చెప్పావా’’ అని అడిగారు. శేషేంద్ర నవ్వి... ‘చెప్పా’ అన్నాడు. ఆ తర్వాత కాలంలో ఎన్టీఆర్‌ను చాలాసార్లు కలవటం జరిగింది.

‘చండశాసనుడు’ షూటింగ్‌ పూర్తయిన తర్వాత మా అందరినీ ప్రివ్యూకు పిలిచారు. ఆ రోజు హైదరాబాద్‌ పాత నగరంలో కర్ఫ్యూ పెట్టారు. నేను వెళ్లాలా వద్దా అని సంకోచిస్తుంటే... ఎన్టీఆర్‌ పోలీసులను పంపించారు. వారితో కలిపి ప్రివ్యూ థియేటర్‌కు వెళ్లాం. అక్కడ మగవాళ్లు, ఆడవాళ్లు వేర్వేరుగా కూర్చున్నారు.

నేను ఎన్టీఆర్‌ కుమార్తెలతో కూర్చున్నా. ఎన్టీఆర్‌తో శేషేంద్ర కూర్చున్నాడు. సినిమా అంతా పూర్తయిన తర్వాత ఎన్టీఆర్‌... ‘‘సినిమా ఎలా ఉంది? కథ ఎవరు రాసి ఉంటారు?’’ అని అడిగారు.‘‘నువ్వే రాసి ఉంటావు’’ అని శేషేంద్ర సమాధానమిచ్చి వచ్చేశాడు.


ఒక రోజు సాయంత్రం టీవీ చూస్తుంటే... శేషేంద్రకు ‘కేంద్ర సాహిత్య అకాడమీ’ అవార్డు వచ్చిందనే వార్త కనిపించింది. నాకు చాలా ఆశ్చర్యమేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని కులరాజకీయాలవల్ల అవార్డుల విషయంలో శేషేంద్రకు తగిన న్యాయం జరగలేదని నేను భావించేదాన్ని. ఆ వార్త చూసి శేషేంద్రకు విపరీతమైన కోపం వచ్చింది. ‘‘సాహిత్య అకాడమీకి ఫోన్‌ చేసి అవార్డు తీసుకోనని చెప్పు’’ అని అరవటం మొదలుపెట్టాడు.

శేషేంద్రకు అవార్డు రావాలని కోరుకొనేవాళ్లలో నేను ప్రథమురాలిని. అలాంటప్పుడు వద్దని ఎలా చెబుతా? అందువల్ల ఫోన్‌ ఎంగేజ్‌ వస్తోందని చెప్పటం మొదలుపెట్టా. ఈలోపులో ‘బీబీసీ’ వాళ్ల నుంచి శేషేంద్ర స్పందన కోసం ఫోన్‌ వచ్చింది. తప్పనిసరి పరిస్థితుల్లో... ‘‘ఆనందంగా ఉంది’’ అన్నాడు. ఆ మర్నాడు ఉదయం పత్రికల్లో... ‘‘శేషేంద్రకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు. ఎన్టీఆర్‌ అభినందనలు’’ అనే వార్తలు వచ్చాయి. ఆ తర్వాత అవార్డును తిరస్కరించటం గురించి శేషేంద్ర మాట్లాడలేదు

-రాజ కుమారి ఇంధరా దేవి ధనరాజ్ గిరి

Updated Date - May 26 , 2024 | 03:20 AM