Share News

Story : టక్కరి దొంగ.. నక్క!

ABN , Publish Date - Jan 25 , 2024 | 11:25 PM

అనగనగా ఓ జిత్తులమారి నక్క. టక్కరి దొంగ. దాని చేష్టలు మిగతా నక్కలకంటే విచిత్రం ఉండటంతో మిగతా నక్కలన్నీ కలసి తరిమేశాయి. అది తలదాచుకోవటానికి స్థలం వెతుక్కుంటూ ఓ వెర్రి వెంగళప్ప ఇంటికి వెళ్లింది. నక్క వాలకం, నటన చూసి దానితో స్నేహం చేశాడు వెంగళప్ప.

Story : టక్కరి దొంగ.. నక్క!

అనగనగా ఓ జిత్తులమారి నక్క. టక్కరి దొంగ. దాని చేష్టలు మిగతా నక్కలకంటే విచిత్రం ఉండటంతో మిగతా నక్కలన్నీ కలసి తరిమేశాయి. అది తలదాచుకోవటానికి స్థలం వెతుక్కుంటూ ఓ వెర్రి వెంగళప్ప ఇంటికి వెళ్లింది. నక్క వాలకం, నటన చూసి దానితో స్నేహం చేశాడు వెంగళప్ప. ఇద్దరూ మంచి మిత్రులయ్యారు. ఎంతో గొప్ప స్నేహితుడు దొరికాడని వెంగళప్ప ఊహించుకున్నాడు. ఎంతో మంచి బకరా దొరికాడనుకుంది నక్క.

మరుసటి రోజు ఉదయాన్నే నక్క వచ్చి తన స్నేహితుడితో ఇలా అన్నది. నీ వృత్తి గడ్డం తీయటం, జుట్టు కత్తిరించటం. ఇంకో పని చేసుకోకపోతే ఎలా? అన్నది. నాకేం తెలుసన్నాడు వెంగళప్ప. దోసకాయ, టమోటా, ద్రాక్ష, గుమ్మడికాయ.. ఇలా పండించు. నీకు ఆహారానికి ఉంటాయి. అమ్మవచ్చు కూడా అన్నది. మరి పండ్లను రక్షించుకోవటం కష్టమే అన్నాడు. ‘నాలాంటి సావాసం దొరకటమే నీ అదృష్టం’ అన్నది. దీంతో వెంగళప్ప ఆలోచించకుండా తన భార్యను తీసుకుని పోయి.. ఇన్ని బీర, దోసకాయల విత్తనాలు చల్లాడు. అరటి, ద్రాక్ష చెట్లు నాటాడు. టమోటాలు, గుమ్మడికాయ పంట వేశాడు. నక్క కాపలా ఉంది. అయితే ఎప్పటికప్పుడు పిందెలను తినేది. పైగా ఏవీ రాకుండా కర్రపెత్తనం చేసేది.

ద్రాక్ష కాయటం మొదలెట్టాక రాత్రికి రాత్రి పాడుచేసేది. తన ఇతర నక్కలను విందుకు పిలిచి పండగ చేసుకునేది. ఇవన్నీ వెంగళప్పకు తెలీదు. ‘స్నేహితుడా.. ద్రాక్షలే కనపడలేదు’ అనేవాడు వెంగళప్ప. ఇప్పుడు వానాకాలం రాలిపోయాయి అనేది. ఆ తర్వాత చలికాలం అయితే కాయలు ఉంటాయనేది. తీరా చలికాలం వచ్చాక ఎండాకాలంలో కాయలు కాస్తాయి అనేది నక్క. నాలుగైదు ద్రాక్ష చెట్లను మాత్రం అలానే వదిలేసింది ఏమీ చేయకుండా. ఒక రోజు మళ్లీ తనతో కొట్లాడిన నక్కల గుంపును పిలిచి తన గొప్పతనం చూపించింది. ద్రాక్షనంతా ఇష్టం వచ్చినట్లు కొరికేశాయి. బైటపడేసాయి. ఆ మరుసటి ఉదయాన వెంగళప్ప తోటకెళ్లాడు. నక్క మోసం అర్థమైంది. పంటను చూసి కన్నీళ్లు కార్చాడు.

దొంగ స్నేహితుడికి బుద్ధి చెప్పాలనుకున్నాడు. పక్క ఊరిలో జుట్టు కత్తిరించటానికి వెళ్లే వెంగళప్పకు ఓ ఆలోచన వచ్చింది. తోటంతా తేరిపారచూశాడు. అక్కడ ఓ గుమ్మడికాయ కనపడింది. ఆకుల మధ్య ఆ గుమ్మడికాయ ఉన్నది. దాని పక్కన తన చేతుల్లోని కత్తులను నాటాడు. రాత్రికి నక్కబావ వచ్చింది. తోటంతా కలియదిరిగింది. గుమ్మడికాయ కనపడ్డది. ఆశతో ఎగిరి దూకింది. కత్తులు గుచ్చుకున్నాయి. ఒకటే రక్తం. తన స్నేహితుడిని విపరీతంగా తిట్టింది. శాపనార్థాలు పెట్టింది. వీడు వెర్రి వెంగళప్ప కాదని గట్టిగా అరిచింది. తోటలోనే ప్రాణం విడిచింది ఆ టక్కరి దొంగ.

Updated Date - Jan 25 , 2024 | 11:25 PM