Share News

రక్తదానంతో బలహీనపడతామా..?

ABN , Publish Date - May 07 , 2024 | 01:19 AM

తలసీమియా... ఒక అరుదైన రక్తపు వ్యాధి. దీని బారిన పడినవారికి తరచూ రక్తాన్ని మార్చాల్సి వస్తుంది. ఈ వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన పెంచటానికి ఏటా మే 8న ప్రపంచ తలసీమియా దినోత్సవం నిర్వహిస్తున్నారు.

రక్తదానంతో బలహీనపడతామా..?

అపోహ వాస్తవం

లసీమియా... ఒక అరుదైన రక్తపు వ్యాధి. దీని బారిన పడినవారికి తరచూ రక్తాన్ని మార్చాల్సి వస్తుంది. ఈ వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన పెంచటానికి ఏటా మే 8న ప్రపంచ తలసీమియా దినోత్సవం నిర్వహిస్తున్నారు. తలసీమియా రోగులకు రక్తం అత్యవసరం. కానీ ఇప్పటికీ ఈ విషయంలో కొన్ని ప్రాంతాల్లో కొరత ఉంది. ఈ నేపథ్యంలో రక్తదానం గురించి ప్రజల్లో ఉన్న అపోహలు ఏమిటో... వాస్తవాలేమిటో చూద్దాం.

అపోహ: రక్తదానంవల్ల బలహీనపడిపోతాం

వాస్తవం: ఒకటి రెండు రోజుల్లో కొత్త రక్తకణాలు పుడతాయి. వాస్తవానికి కొత్త రక్తకణాలు మనకు మంచే చేస్తాయి.

అపోహ: అవసరమైతే ఎక్కువ రక్తం కూడా తీసుకొంటారు.

వాస్తవం: 350 నుంచి 450 మిల్లీలీటర్ల రక్తాన్ని మాత్రమే తీసుకొంటారు. ఒకసారి అంతకన్నా ఎక్కువ రక్తాన్ని తీయరు.

అపోహ: ఏడాదికి ఒకసారే రక్తదానం చేయాలి

వాస్తవం: ప్రభుత్వ విధివిధానాల ఆధారంగా... 18-60 ఏళ్ల మధ్య ఉన్న ఆరోగ్యకరమైన పురుషుడు ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చు. రక్తదానం అలవాటు ఉన్నవారు 65 ఏళ్ల దాకా చేయవచ్చు. ఇదే విధంగా 18-60 ఏళ్ల మధ్య ఉన్న మహిళలు నాలుగు నెలలకు ఒకసారి చేయవచ్చు. గర్భిణులు, పాలిచ్చే తల్లులు రక్త దానం చేయకూడదు.

అపోహ: శాఖాహారులు రక్త దానం చేస్తే బలహీనపడిపోతారు

వాస్తవం: మాంసాహారులు, శాఖాహారులు అనే తేడా లేకుండా ఎవరైనా రక్త దానం చేయవచ్చు. అయితే రక్త దానం చేసేవారికి హిమోగ్లోబిన్‌ శాతం 12.5 జీఎం కన్నా ఎక్కువ ఉండాలి. అంతే కాదు... 45 కేజీల కన్నా ఎక్కువ బరువు ఉన్నవారు మాత్రమే రక్త దానం చేయాలి.

అపోహ: టాటూలు వేసుకున్నవారు రక్త దానం చేయకూడదు

వాస్తవం: టాటూలు వేయించుకున్న ఏడాది తర్వాత రక్త దానం చేయవచ్చు.

అపోహ: అరుదైన బ్లడ్‌ గ్రూపులు ఉన్నవారు రక్త దానం చేస్తే సరిపోతుంది

వాస్తవం: అన్ని బ్లడ్‌ గ్రూపులవారూ చేసే దానం ఎంతో అవసరం. కొన్ని అరుదైన బ్లడ్‌ గ్రూపులవారు చేసే దానాలకు ఎక్కువ ప్రచారం వస్తుంది. కానీ అన్ని బ్లడ్‌ గ్రూపులవారి రక్తం చాలా అవసరం.

అపోహ: బీపీ ఉన్నవారు రక్త దానం చేయకూడదు

వాస్తవం: రక్తదానం చేసే సమయంలో 140-90 కన్నా ఎక్కువ బ్లడ్‌ ప్రెషర్‌ ఉండకూడదు. బ్లడ్‌ ప్రెషర్‌ మందులు వేసుకొనేవారు కూడా రక్త దానం చేయవచ్చు.

అపోహ: మధుమేహులు రక్త దానం చేయకూడదు

వాస్తవం: ఇన్సులిన్‌ తీసుకొనేవారు రక్త దానం చేయకూడదు. మధుమేహం కోసం మందులు వాడుతూ, మధుమేహం అదుపులో ఉన్నవారు రక్త దానం చేయవచ్చు.

Updated Date - May 07 , 2024 | 01:19 AM