Share News

Cool Drinks : కూల్‌డ్రింకే కదా అని తాగితే..!

ABN , Publish Date - May 07 , 2024 | 01:35 AM

వేసవి ఎండలు మండిపోతున్నాయి. ఐదు నిమిషాలు బయటకు వెళ్లి వస్తే చాలు... చల్లగా ఏదైనా తాగాలనిపిస్తోంది. వెంటనే మన కళ్ల ముందు కదిలేవి... ఇంపైన రంగుల్లో... నురగలు కక్కే కూల్‌డ్రింక్స్‌.

Cool Drinks : కూల్‌డ్రింకే కదా అని తాగితే..!

వేసవి ఎండలు మండిపోతున్నాయి. ఐదు నిమిషాలు బయటకు వెళ్లి వస్తే చాలు... చల్లగా ఏదైనా తాగాలనిపిస్తోంది. వెంటనే మన కళ్ల ముందు కదిలేవి... ఇంపైన రంగుల్లో... నురగలు కక్కే కూల్‌డ్రింక్స్‌. అయితే వీటిని తాగటంవల్ల అనేక రకాల సమస్యలు వస్తాయంటున్నార వైద్యులు. వేసవిలో తప్పనిసరైతే మజ్జిగ, పండ్ల రసాలు, నిమ్మకాయ, కొబ్బరి నీళ్లు వంటివి తీసుకోవాలని... వీలైనంతవరకు కూల్‌డ్రింక్స్‌ జోలికి వెళ్లవద్దని చెబుతున్నారు. అసలు కూల్‌డ్రింక్స్‌వల్ల కలిగే అనర్థాలేమిటో చూద్దాం...

గుండె జబ్బులు...

కూల్‌డ్రింక్స్‌కు తీపిని ఇచ్చే ఫ్రక్టోజ్‌వల్ల మనకు అనేక ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. వీటిలో మొదటిది- మెటబాలిక్‌ డిజార్డర్‌. అంటే మన శరీరం శక్తిని ఖర్చు చేసే క్రమంలో మార్పులు వస్తాయి. దీనివల్ల రక్తపోటు పెరుగుతుంది. ఎక్కువ కాలంపాటు రక్తపోటును నియంత్రించకపోతే గుండె జబ్బులు వస్తాయి. కొన్నిసార్లు దీనికి అనుబంధంగా కాలేయ సమస్యలు కూడా తలెత్తవచ్చు.

వ్యసనంగా మారి...

తీపి తిన్నప్పుడు మెదడులో డోపమైన్‌ అనే హార్మోన్‌ విడుదలవుతుంది. ఈ హార్మోన్‌వల్ల మనకు ఎక్కువగా తీపి తినాలనిపిస్తుంది. కూల్‌డ్రింక్స్‌ తాగితే ఈ డోపమైన్‌ ఎక్కువగా విడుదలవుతుంది. ఇది అలవాటుగా మారితే ఎప్పుడైనా ఒత్తిడి ఎక్కువగా ఉంటే కూల్‌డ్రింక్‌ను తాగాలనిపిస్తుంది. ఇది ఒక వ్యసనంగా మారుతుంది.

కాలేయంలో కొవ్వు...

మనకు శక్తి రావాలంటే గ్లూకోజ్‌ తప్పనిసరి. శరీరంలోకి ప్రవేశించే గ్లూకోజ్‌ను కణాలు శక్తిగా మార్చుకుంటాయి. కానీ కూల్‌డ్రింక్స్‌లో చక్కెర రూపంలో ఉండే ఫ్రక్టోజ్‌ను కణాలు శక్తిగా మార్చుకోలేవు. దీంతో ఈ ఫ్రక్టోజ్‌ బాధ్యత కాలేయంపై పడుతుంది.

అవసరానికి మించి ఫ్రక్టోజ్‌ శరీరంలోకి చేరుతూ ఉంటే... అదంతా కాలేయంలో చేరి కొవ్వుగా మారుతుంది. ఇలా పెరిగిన కొవ్వులో కొంత శాతం ట్రైగ్లిజరైట్స్‌గా రక్తంలోకి ప్రవేశిస్తుంది. మిగిలినది కాలేయంలోనే ఉండిపోతుంది.

ఇలా కొవ్వు పట్టిన కాలేయాన్ని నాన్‌ఆల్కాహాలిక్‌ ఫ్యాటీ లివర్‌ అంటారు. ఆల్కాహాల్‌ తాగటంవల్ల కాలేయానికి ఎంత ప్రమాదమో... కూల్‌డ్రింక్స్‌ను ఎక్కువ కాలం తాగినా కూడా అంతే ప్రమాదం.

ఉబ్బసం...

శీతలపానీయాలు తాగే వారిలో ఉబ్బసం ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. దీనికి ఒక ప్రధానమైన కారణముంది. సాధారణంగా కూల్‌డ్రింక్స్‌లో సోడియం బెంజాయేట్‌ అనే రసాయనాన్ని ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి వాడతారు.

ఇది మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు రెండు ప్రమాదకరమైన సమస్యలు ఏర్పడతాయి. వీటిలో మొదటిది- పోటాషియం సమస్య. బెంజాయేట్‌ ఇతర ఆహారంతో కలిసినప్పుడు రకరకాల మార్పులు జరుగుతాయి. పోటాషియాన్ని శరీరం శోషించుకోదు. ఉబ్బసానికి ఇది తొలి మెట్టు. ఇదే విధంగా తరచూ కూల్‌డ్రింక్స్‌ తాగేవారి దంతాలపై ఉన్న పై పొర దెబ్బతింటుంది.


స్థూలకాయం...

కూల్‌డ్రింక్స్‌ను తరచుగా తాగేవారు స్ధూలకాయులై ఉంటారు. దీనికి కారణం శరీరంలో అవసరమైనదాని కన్నా ఎక్కువ కొవ్వు పేరుకుపోవటమే. ఈ కొవ్వును కరిగించేటంత శ్రమ చేయకపోతే, అది నడుము, పిరుదల భాగంలో పేరుకుపోతుంది. ఆ తర్వాత శరీరంలోని ఇతర భాగాలకు కూడా చేరి, స్థూలకాయం ఏర్పడుతుంది.

కీళ్ల నొప్పులు...

మన శరీరంలో యూరిక్‌యాసిడ్‌ బాగా పెరిగిపోయినప్పుడు... అది కీళ్ల మధ్యకు చేరుకుంటుంది. దీనివల్ల గౌట్‌ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి వచ్చినవారికి పాదాల్లోని బొటనవేలి కీళ్లు వాచిపోతాయి. విపరీతమైన నొప్పి కలుగుతుంది.

శరీరంలో యూరిక్‌ యాసిడ్‌ బాగా పెరగటానికి ఫ్రక్టోజ్‌ ఒక ప్రధానమైన కారణమని వైద్య పరిశోధనల్లో తేలింది. ఫ్రక్టోజ్‌ శరీరంలోకి కూల్‌డ్రింక్స్‌ ద్వారా చేరుతుంది కాబట్టి, వాటిని తాగటం మానేయటం ఉత్తమం.

ఎముకల గుల్లబారటం...

శీతలపానీయాలు ఎక్కువగా తాగినప్పుడు విసర్జించే మూత్రంలో ఫాస్పారిక్‌ యాసిడ్‌తో పాటుగా కాల్షియాన్ని కూడా జీర్ణవ్యవస్థ శరీరం బయటకు పంపేస్తుంది. సాధారణంగా ఈ కాల్షియం మన శరీరానికి ఆహారం ద్వారా లభిస్తుంది.

ఇలా లభించిన కాల్షియం శోషణ జరగకుండా మూత్రం ద్వారా బయటకు వెళిపోవటంవల్ల ఎముకలకు తగినంత కాల్షియం అందదు. ఇది దీర్ఘకాలంలో ఎముకల గుల్లతనంపై ప్రభావం చూపుతుంది. ‘ఆస్టియో పోరోసిస్‌’ వంటి వ్యాధులకు కారణమవుతుంది.

మూత్రపిండాల సమస్యలు

కూల్‌డ్రింక్స్‌లో ఫాస్పారిక్‌ యాసిడ్‌ కూడా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది. దీని పరిమాణం పెరిగితే మూత్రపిండాల్లో రాళ్లు తయారవుతాయి. కూల్‌డ్రింక్స్‌ ఎక్కువగా తాగేవారిలో మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటం మనం గమనించవచ్చు.

పునరుత్పత్తి సమస్యలు...

కూల్‌డ్రింక్స్‌ క్యాన్లలో రెసిన్‌ అనే పదార్థం ఉంటుంది. ఇది మన శరీరంలోకి ప్రవేశిస్తే అనేక రకాల సమస్యలు ఏర్పడతాయి. వీటిలో ప్రధానమైనది పునరుత్పత్తి సమస్య. అందుకే గర్భిణిలను కూల్‌డ్రింక్స్‌ తాగవద్దని వైద్యులు సలహా ఇస్తూ ఉంటారు.

మతి మరుపు...

శరీరంలో చక్కెర స్థాయి హఠాత్తుగా విపరీతంగా పెరిగిపోతే... ఆ ప్రభావం మెదడులోని న్యూరాన్లపై పడుతుంది. ఇలా ఎక్కువసార్లు జరిగితే న్యూరాన్ల పనితీరు దెబ్బతింటుంది. మతిమరుపు సమస్య ఏర్పడుతుంది.

Updated Date - May 07 , 2024 | 06:25 AM