Share News

వ్యాక్సిన్‌తో ప్రమాదమేంలేదు

ABN , Publish Date - May 07 , 2024 | 01:08 AM

కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ను వేయించుకున్నవారికి దుష్ప్రభావాలు తప్పవా? ప్రస్తుతం అనేకమందిలో ఉన్న అనుమానమిది.

వ్యాక్సిన్‌తో  ప్రమాదమేంలేదు

కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ను వేయించుకున్నవారికి దుష్ప్రభావాలు తప్పవా? ప్రస్తుతం అనేకమందిలో ఉన్న అనుమానమిది. గత వారం కొవిషీల్డ్‌ తయారీ సంస్థ ఆస్ట్రాజెనెకా... తమ వ్యాక్సిన్‌ తీసుకోవడంవల్ల కలిగే దుష్ప్రభావాలపై ఒక ప్రకటన విడుదల చేసింది. దీంతో అనేకమందిలో రకరకాల అనుమానాలు ప్రారంభమయ్యాయి. అయితే దుష్ప్రభావాల విషయంలో ఎలాంటి భయాలూ పెట్టుకోవాల్సిన అవసరం లేదంటున్నారు ‘ఏషియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీ’ (ఏఐజీ) ఇన్‌ఫెక్షస్‌ డిసీజెస్‌ నిపుణురాలు

డాక్టర్‌ హరిప్రియా రెడ్డి.

లాంగ్‌ కొవిడ్‌ మాత్రమే సమస్య...

ఏ వ్యాక్సిన్‌నైనా వేసేముందు దానివల్ల లాభాలేమిటి? నష్టాలేమిటి అనే విషయాన్ని గమనిస్తారు. నష్టం కన్నా లాభం ఎక్కువ ఉందని అనిపిస్తేనే దానిని అనుమతిస్తారు. ఉదాహరణకు కొవిషీల్డ్‌ను ఉపయోగించిన 10 లక్షల మందిలో ఒకరికి ఇబ్బంది కలిగిందనుకుందాం.

అది సమస్య కాదు. కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ను వందల కోట్ల మంది వేయించుకున్నారు. అందువల్ల కొందరికి కొన్ని సమస్యలు ఏర్పడి ఉండచ్చు. ఇక్కడ ఇంకో విషయాన్ని చెప్పుకోవాలి.

ఒక వంద మందికి కొవిడ్‌ వస్తే... వారిలో పది మందిలో మాత్రమే తీవ్రత చాలా ఎక్కువగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. ఈ పది మందిలోనూ ముగ్గురికి తరచూ జ్వరం రావటం, జ్ఞాపకశక్తి తగ్గటం, నిద్రలేమి, కొందరిలో సంతానలేమి మొదలైన సమస్యలు రెండేళ్ల పాటు కొనసాగుతూనే ఉన్నాయి.

దీనినే లాంగ్‌ కొవిడ్‌ అంటున్నాం. దీనివల్ల ప్రాణాలకు ప్రమాదం ఉండదు. కానీ లక్షణాలు మాత్రం చికాకు పెడుతూ ఉంటాయి.


కచ్చితంగా చెప్పలేం...

మళ్లీ కొవిడ్‌ వస్తే..? చాలామంది ఈ ప్రశ్న అడుగుతున్నారు. కానీ నా ఉద్దేశంలో మళ్లీ అంత తీవ్రతతో కొవిడ్‌ రాదు. ఒకవేళ వచ్చినా అందరిలోనూ యాంటీబాడీలు ఉత్పత్తి అయ్యాయి కాబట్టి దానివల్ల కలిగే ఫలితాలు అంత తీవ్రంగా ఉండవు. ఇక కొందరు... కొవిడ్‌వల్ల జన్యుపరంగా ఏవైనా మార్పులు వచ్చే అవకాశం ఉందా? అని అడుగుతున్నారు. ఇప్పటిదాకా

ఈ విషయంపై కొన్ని పరిశోధనలు జరిగాయి. కానీ జన్యువుల్లో మార్పులు జరిగాయనటానికి కచ్చితమైన ఆధారాలేవీ లేవు.

  • జలుబు... దగ్గు వస్తే...

కొవిడ్‌ వచ్చి తగ్గినవారు కొన్ని ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరముంది. ముఖ్యంగా జలుబు, దగ్గు వంటి లక్షణాలు ఉన్నప్పుడు కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాలి. వెంటనే మందులు వాడటం మొదలుపెట్టాలి. ఇదే విధంగా మధుమేహం, రక్తపోటు ఉన్నవారు కూడా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఏదైనా సమస్య ఏర్పడితే తగ్గటం చాలా కష్టమవుతుంది.

Updated Date - May 07 , 2024 | 06:23 AM