పార్లర్‌కు వెళుతున్నారా?
ABN , Publish Date - Dec 29 , 2024 | 10:20 AM
పెడిక్యూర్ కోసం బ్యూటీ పార్లర్‌ల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. ఫేస్‌మాస్క్ కోసం బోలెడు డబ్బులు వెచ్చించాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే, తీరిక సమయాల్లోనే... సౌందర్యపోషణ పనిని సులభతరం చేసేందుకు కొన్ని బ్యూటీ గ్యాడ్జెట్స్ ఉన్నాయి. వాటి విశేషాలే ఇవి...

పెడిక్యూర్ కోసం బ్యూటీ పార్లర్‌ల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. ఫేస్‌మాస్క్ కోసం బోలెడు డబ్బులు వెచ్చించాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే, తీరిక సమయాల్లోనే... సౌందర్యపోషణ పనిని సులభతరం చేసేందుకు కొన్ని బ్యూటీ గ్యాడ్జెట్స్ ఉన్నాయి. వాటి విశేషాలే ఇవి...
నెయిల్‌పాలిష్... హుష్‌కాకి...
నెయిల్‌పాలిష్ వేసుకోవడం సులువే కానీ, దాన్ని తొలిగించడంలోనే ఉంటుంది అసలు చిక్కంతా. అందుకోసం ‘నెయిల్‌పాలిష్ రిమూవర్ క్లిప్స్’ చక్కగా సహాయ పడతాయి. కాటన్ ప్యాడ్ తీసుకొని, రెండు చుక్కల నెయిల్‌పాలిష్ రిమూవర్ వేసి, దానిని గోళ్లపై ఉంచి ఈ క్లిప్స్ పెడితే సరి. పది నిమిషాల తర్వాత వీటిని తొలగించి కాటన్ ప్యాడ్‌తో నెయిల్‌పాలిష్‌ను ఒక్కసారి రుద్దితే చాలు... చిటికెలో శుభ్రం అవుతుంది. ఈ గ్యాడ్జెట్ ఉంటే దుస్తుల మ్యాచింగ్‌కి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు నెయిల్‌పాలిష్‌ను మార్చుకోవచ్చు.
నిమిషాల్లో ఫేస్‌మాస్క్
‘ఫేస్‌మాస్క్ మేకర్’ ఉంటే.. పార్లర్ కోసం పైసా ఖర్చుపెట్టాల్సిన పనిలేదు. ఇంట్లోనే కావాల్సిన మాస్కులను సులువుగా తయారుచేసుకోవచ్చు. ఎన్ని నీళ్లు పోయాలి, ఏయే పదార్థాలు ఎంతెంత మోతాదులో కలపాలి.. లాంటి సూచనలను వాయిస్ మోడ్‌లో ఇస్తుంటుందీ మేకర్. కావాల్సిన విధంగా కూరగాయలు, పండ్లు, విటమిన్ టాబ్లెట్స్, తగినంత నీరు ఇందులో వేసుకొని, బటన్‌ని నొక్కితే సరి. రెండు నిమిషాల్లో పేస్ట్ రెడీ అయిపోతుంది. ఆపై మరొక్కసారి అదే బటన్ నొక్కితే పేస్ట్ అంతా కిందనున్న మాస్క్ ప్లేట్‌లోకి జారుతుంది. అప్పుడు మాస్క్‌ని సులువుగా ముఖంపై పరుచుకోవచ్చు. సెల్ప్ క్లీనింగ్ మోడ్ ఆన్ చేస్తే పది సెకన్లలో మెషీన్ శుభ్రమైపోతుంది.
మస్కారా.. మరింత సులువుగా...
మస్కారా అప్లై చేసుకునే క్రమంలో పక్కలకు అంటుకోవడం చాలామందికి అనుభవమే. అలాగని అదేపనిగా చెరిపేసి వేసుకుంటే ఎబ్బెట్టుగా కనిపిస్తుంది. ఈ సమస్య లేకుండా మస్కారాను చక్కగా, సులువుగా తీర్చిదిద్దుకోవడానికి ‘స్టెన్సిల్స్’ ఉన్నాయి. వీటిని కళ్ల కింద, రెప్పల పైన అమర్చుకొని మస్కారాను పెట్టుకోవచ్చు. వీటిని ఉపయోగించడం వల్ల ఏవీ కూడా కళ్లలోకి వెళ్లకుండా, పక్కలకు అంటుకోకుండా జాగ్రత్తపడొచ్చు.
ఫేస్ స్టీమర్
‘ఫేషియల్ స్టీమర్’తో ఆవిరి పడితే క్షణాల్లో ముఖం ప్రకాశవంతంగా మారుతుంది. ముఖంపై ముడతలు, మచ్చలు, పిగ్మెంటేషన్ వంటి సమస్యలు తగ్గుతాయి. 360 డిగ్రీలలో తిరిగే రొటేటబుల్ స్ర్పేయర్ నాజిల్‌తో కూడిన ఈ స్టీమర్‌ను అవసరానికి తగ్గట్టుగా దాని పొడవు పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. వీలుని బట్టి కూర్చుని లేదా పడుకుని కూడా డీప్ క్లీనింగ్ చేసుకోవచ్చు. ఎక్కడికైనా సులభంగా తీసుకుని వెళ్లొచ్చు.
పాదాల మెరుపు
ఇకపై పెడిక్యూర్ కోసం పార్లర్ చుట్టూ తిరగాల్సిన పనిలేదు. ఎంచక్కా ఈ ‘ఎలక్ట్రిక్ కాలస్ రిమూవర్’ సహాయంతో నిమిషాల్లో పాదాలు మెరిసిపోతాయి. మల్టీఫంక్షనల్ పెడిక్యూర్ కిట్ ఇది. డెడ్ స్కిన్ రిమూవల్ హెడ్, నెయిల్ బఫర్ హెడ్, పాలిషింగ్ హెడ్.. అనే మూడు రోలర్ హెడ్స్‌తో ఉంటుంది. పవర్ బటన్ నొక్కితే పైన అమర్చిన హెడ్ గుండ్రంగా తిరుగుతూ పనిచేస్తుంది. ఇది మృతకణాలను తొలగించి పాదాలను మృదువుగా మార్చడమే కాకుండా బ్యాక్టీరియా పెరుగదలనూ నిరోధిస్తుంది. దీనిలో లోస్పీడ్, హైస్పీడ్ అనే రెండు ఆప్షన్స్ ఉంటాయి.