Share News

Navya: అలకనంద సంగమ సీమలు పంచ ప్రయాగలు

ABN , Publish Date - Jun 06 , 2024 | 11:50 PM

ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని చార్‌ధామ్‌ యాత్రకు ఏడాదిలో సుమారు ఆరు నెలలు మాత్రమే అవకాశం ఉంటుంది. ఈ యాత్రలో భక్తులు తప్పనిసరిగా సందర్శించి, పవిత్రస్నానాలు ఆచరించే ప్రదేశాలు...

Navya: అలకనంద సంగమ సీమలు  పంచ ప్రయాగలు

ఆలయ దర్శనం

త్తరాఖండ్‌ రాష్ట్రంలోని చార్‌ధామ్‌ యాత్రకు ఏడాదిలో సుమారు ఆరు నెలలు మాత్రమే అవకాశం ఉంటుంది. ఈ యాత్రలో భక్తులు తప్పనిసరిగా సందర్శించి, పవిత్రస్నానాలు ఆచరించే ప్రదేశాలు... పంచ ప్రయాగలు. ‘ప్రయాగ’ అంటే ‘సంగమం’ అని అర్థం. అలకనందలో అయిదు నదులు కలిసి... పవిత్ర గంగానదిగా రూపుదిద్దుకుంటాయి. ఈ పంచ సంగమ స్థలాల్లో చేసే స్నానం మోక్షప్రదాయకమనీ, ఆత్మను శుద్ధి చేస్తుందనీ అనాది విశ్వాసం. పంచ ప్రయాగలు... ఋషీకేశ్‌ నుంచి బదరీనాథ్‌ వెళ్ళే మార్గంలో ఉన్నాయి. వాటి విశిష్టత గురించి తెలుసుకుందాం.

దేవప్రయాగ: దేవప్రయాగ ఉత్తరాఖండ్‌లోని టెహ్రీ-గర్వాల్‌ జిల్లాలోని ఒక పట్టణం. ‘దేవ ప్రయాగ’ అంటే ‘దేవతలు కలిసే’ లేదా ‘దివ్యత్వం సంగమించే ప్రదేశం’ అని అర్థం. కుబేరుని పట్టణంగా పురాణాలు వర్ణించిన అలకాపురి నుంచి ప్రవహించే అలకనంద... గంగోత్రి నుంచి వచ్చే భాగీరథి నదులు ఇక్కడ సంగమిస్తాయి. శ్రీరాముడు అశ్వమేథ యాగం చేసి ప్రదేశం ఇదేననే విశ్వాసం ఉంది. దానికి ప్రతీకగా ఇక్కడ నెలకొన్న రఘునాథ ఆలయాన్ని భక్తులు పెద్ద సంఖ్యలో సందర్శిస్తారు.

ఎక్కడుంది?: ఋషీకేశ్‌ నుంచి 72 కిలోమీటర్ల దూరంలో

Untitled-5 copy.jpg 5.jpg

రుద్రప్రయాగ: ఇది మందాకినీ, అలకనంద నదుల సంగమ స్థలి. రుద్రప్రయాగ జిల్లాకు కేంద్రం. పురాణాల ప్రకారం... నారదుడికి మహా శివుడు సంగీతాన్ని నేర్పిన చోటు. అలాగే శివుడు రుద్రవీణానాదాన్ని పలికించిన చోటు. రుద్ర మూర్తిగా కనిపించిన శివుణ్ణి నారదుడు పూజించగా... అతని కోరిక మేరకు శివుడు ఇక్కడ వెలిశాడట. రుద్రప్రయాగలో రుద్రనాథ మందిరం, చాముండా దేవి ఆలయంతో సహా పలు మందిరాలు ఉన్నాయి. ఇది బదరీనాథ్‌, కేదార్‌నాథ్‌ యాత్రికులకు కూడలి.

ఎక్కడుంది?: ఋషీకేశ్‌ నుంచి 137 కిలోమీటర్ల దూరంలో

Untitled-6 copy.jpg

కర్ణప్రయాగ: అజేయమైన కవచాన్ని పొందడానికి శివుడి కోసం కర్ణుడు తపస్సు చేసిన చోటుగానూ, కర్ణుడి నగరంగానూ పురాణాలు పేర్కొంటున్న కర్ణప్రయాగ... ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో ఉంది. కర్ణ ప్రయాగ దగ్గర... అలకనంద, పిండారి నదులు సంగమిస్తాయి. జిమ్‌ కార్బెట్‌ నేషనల్‌ పార్క్‌, నైనిటాల్‌, అల్మోరాలకు ఇక్కడి నుంచి మార్గాలు ఉన్నాయి. కర్ణప్రయాగలో పద్ధెనిమిది రోజుల పాటు స్వామి వివేకానంద తపస్సు చేశారంటారు. ఇక్కడ ఉమాదేవి ఆలయం ఉంది.

ఎక్కడుంది?: ఋషీకేశ్‌ నుంచి 168 కిలోమీటర్ల దూరంలో ఉంది.

Untitled-7 copy.jpg

నందప్రయాగ: శ్రీకృష్ణుణ్ణి పెంచిన నందుడి ఊరు, గోపాలుడు పెరిగిన నంద గోకులం, నందుడు యజ్ఞం ఆచరించిన చోటు, కణ్వాశ్రమం ఉన్న ప్రదేశం, శకుంతలా దుష్యంతుల వివాహ స్థలి... ఇలా నంద ప్రయాగ విశిష్టతను పురాణాలు అనేక విధాలుగా వర్ణించాయి. అలకనంద, నందాకినీ నదులు సంగమించే నందప్రయాగలో పురాతనమైన గోపాల్జీ (నంద గోపాల) మందిరం ఉంది. నందాదేవీ పర్వత పాదాల దగ్గర... చమోలీ జిల్లాలో ఉన్న నందప్రయాగ సంగమంలో స్నానం సకలపాప హరం అని భక్తుల విశ్వాసం.

ఎక్కడుంది?: ఋషీకేశ్‌ నుంచి 188 కిలోమీటర్ల దూరంలో.

Untitled-7 copy.jpg

విష్ణుప్రయాగ: అలకనంద, ధౌలిగంగ నదులు ఇక్కడ సంగమిస్తాయి. చమోలీ జిల్లాలో ఉన్న విష్ణుప్రయాగ... కేదార్‌నాథ్‌కు వెళ్ళే మార్గంలోని ఆఖరి సంగమం. మహా విష్ణువు కోసం నారదుడు ఈ ప్రదేశంలో తపస్సు చేశాడని పురాణాలు చేబుతున్నాయి. ఇక్కడ మహా విష్ణువు ఆలయం, సంగమం దగ్గర విష్ణుకుండం ఉన్నాయి. ప్రకృతి సంపదకు నిలయమైన ఈ ప్రాంతం ట్రెక్కింగ్‌, హైకింగ్‌లకు కూడా ప్రసిద్ధి చెందింది. వ్యాలీ ఆఫ్‌ ఫ్లవర్స్‌, హేమకుండ్‌ లేక్‌ లాంటివి పర్యాటకులను ఆకట్టుకుంటాయి.

ఎక్కడుంది?: ఋషీకేశ్‌ నుంచి 255 కిలోమీటర్ల దూరంలో.

ఎలా వెళ్ళాలి: ఋషీకేశ్‌- బదరీనాథ్‌ల మధ్య దూరం దాదాపు 286 కిలోమీటర్లు. పంచప్రయాగలు ఆ దారిలోనే ఉన్నాయి. ఋషీకేశ్‌ నుంచి రోడ్డు మార్గంలో ప్రయాణించాల్సి ఉంటుంది. ఋషీకేశ్‌లో రైల్వేస్టేషన్‌ ఉంది. అక్కడికి విమానాశ్రయం సుమారు 35 కిలోమీటర్ల దూరంలోని డెహ్రాడూన్‌లో ఉంది.

Updated Date - Jun 06 , 2024 | 11:51 PM