the Kavadi Yatra route : కావడి యాత్ర మార్గంలో పేర్లపై యోగిది తొందరపాటు నిర్ణయం
ABN , Publish Date - Jul 22 , 2024 | 04:06 AM
ఉత్తరప్రదేశ్‌లో కావడి యాత్ర సాగే మార్గంలో అన్ని తినుబండారాల దుకాణాలపై వాటి యజమానుల పేర్లు తప్పనిసరిగా ప్రదర్శించాలని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు కూడా తప్పుబడుతున్నాయి. ఈ నిర్ణయాన్ని ఇప్పటికే
బీజేపీ మిత్రపక్షమైన ఆర్‌ఎల్‌డీ పార్టీ అధినేత జయంత్ చౌధరి ఆక్షేపణ
ఇప్పటికే జేడీయూ, ఎల్జేపీ అభ్యంతరం
ముజఫర్‌నగర్(యూపీ), జూలై 21: ఉత్తరప్రదేశ్‌లో కావడి యాత్ర సాగే మార్గంలో అన్ని తినుబండారాల దుకాణాలపై వాటి యజమానుల పేర్లు తప్పనిసరిగా ప్రదర్శించాలని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు కూడా తప్పుబడుతున్నాయి. ఈ నిర్ణయాన్ని ఇప్పటికే జేడీయూ, ఎల్‌జేపీ వ్యతిరేకించగా.. తాజాగా ఆర్‌ఎల్‌డీ అధినేత, కేంద్ర మంత్రి జయంత్ చౌధరి కూడా గళం కలిపారు. కావడి యాత్ర ఏ మతానికో, కులానికో సంబంధించింది కాదని ఆదివారమిక్కడ తెలిపారు. రాష్ట్రప్రభుత్వం ఏ మాత్రం ఆలోచించకుండా నిర్ణయం తీసుకున్నట్లు కనబడుతోందన్నారు. సోమవారం యాత్ర మొదలవుతోందని.. ఇంకా సమయం మించి పోలేదని చెప్పారు. రాష్ట్రప్రభుత్వం వెనక్కి తగ్గే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. అయితే యోగా గురువు రాందేవ్ బాబా ఈ నిర్ణయాన్ని గట్టిగా సమర్థించారు. ‘తానెవరో చెప్పడానికి రాందేవ్ బాబాకు ఎలాంటి సమస్యా లేదు. మరి రెహమాన్‌కు ఇబ్బందేంటి? ఎవరూ పేరు దాచుకోవలసిన అవసరం లేదు. తమ పేర్లను ప్రదర్శించి గర్వపడాలి’ అని పేర్కొన్నారు. ఓవైపు కావడి యాత్ర వివాదం కొనసాగుతుండగా.. మధ్యప్రదేశ్‌లో ప్రాచీన నగరమైన ఉజ్జయినిలో కూడా షాపుల యజమానులు తమ పేర్లు, మొబైల్ నంబర్లతో కూడిన నేమ్‌ప్లేట్లు ప్రదర్శించాలని నగర మేయర్ ముకేశ్ టట్వాల్ ఆదేశించారు. దీనిని మొదటిసారి ఉల్లంఘించినవారికి రూ.2 వేలు, మళ్లీ చేస్తే రూ.5 వేల జరిమానా విధిస్తామని హెచ్చరించారు.