Share News

మళ్లీ యడ్డీయే దిక్కు!

ABN , Publish Date - Apr 22 , 2024 | 03:28 AM

వయసు మీరిందని పక్కన పెట్టారు.. రాష్ట్రంలో ఒక్కో ఇటుకా పేరుస్తూ బీజేపీని నిర్మించి ప్రబల శక్తిగా మార్చిన నేతను మూలనపడేశారు..

మళ్లీ యడ్డీయే దిక్కు!

పక్కనపెట్టిన వృద్ధ నేతకే బీజేపీ అందలం

వయసు మీరిందని పక్కన పెట్టారు.. రాష్ట్రంలో ఒక్కో ఇటుకా పేరుస్తూ బీజేపీని నిర్మించి ప్రబల శక్తిగా మార్చిన నేతను మూలనపడేశారు.. గత అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో ఆయనకు పాత్ర లేకుండా చేశారు. కానీ ఈ ప్రయోగం విఫలమై కర్ణాటకలో బీజేపీ భారీ పరాజయం మూటగట్టుకుంది. ఆ దెబ్బతో మళ్లీ ఇప్పుడు ఆయన్నే ముందుపెట్టి లోక్‌సభ ఎన్నికలకు వెళ్తోంది. ఆయనెవరో కాదు.. కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప(81). ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని విజయం దిశగా నడిపించే బాధ్యతను ప్రధాని మోదీ-కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఇప్పుడు ఆయన భుజాలపైనే పెట్టారు. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం, వ్యూహాల వరకు అన్నీ ఆయనకే అప్పగించారు. ఈసారి దేశవ్యాప్తంగా 400 లోక్‌సభ స్థానాలు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న మోదీ-షా.. కర్ణాటకలో గత ఎన్నికల మాదిరి 25 స్థానాలు కాకున్నా గరిష్ఠ సంఖ్యలో సీట్లు గెలుచుకోవాలంటే యడియూరప్ప సహాయం అవసరమని భావించారు. అందుకే గత సెప్టెంబరు నుంచే ఆయన్ను రంగంలోకి దించారు. మూడు దశాబ్దాల క్రితం కర్ణాటకలో కేవలం నలుగురు ఎమ్మెల్యేలతో బీజేపీకి పునాదులు వేసిన యడియూరప్ప.. తన కృషితో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. నాలుగుసార్లు సీఎం అయ్యారు. మొదటి రెండు సార్లు మెజారిటీ లేక రాజీనామా చేశారు. 2008 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం పార్టీకి సొంత మెజారిటీ సాధించి పెట్టారు. 2013 ఎన్నికల నాటికి బీజేపీ నుంచి బయటకు వచ్చేసి సొంత పార్టీ పెట్టుకున్నారు. దరిమిలా బీజేపీ ఘోరంగా ఓడిపోయింది. 2014 లోక్‌సభ ఎన్నికల ముంగిట మోదీని ప్రచార కమిటీ సారథిగా నియమించగానే.. ఆయన చేసిన మొదటి పని యడియూరప్పను తిరిగి పార్టీలోకి తీసుకురావడం. ఫలితంగా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కర్ణాటకలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆ ఏడాది మే 17న యడ్డీ మళ్లీ సీఎంగా ప్రమాణం చేశారు. కానీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ సాధించలేక ఆరు రోజులకే రాజీనామా చేశారు. హెచ్‌డీ కుమారస్వామి నేతృత్వంలో కాంగ్రె్‌స-జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. అయితే 17 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో 2019 జూలైలో కుమారస్వామి సర్కారు కూలింది. ఆ నెల 26న యడియూరప్ప తిరిగి సీఎం అయ్యారు.

వయోభారం సాకుతో

2021లో వయోభారం సాకుతో మోదీ-షా యడియూరప్పతో రాజీనామా చేయించారు. బొమ్మైను సీఎంను చేశారు. నిరుడు అసెంబ్లీ ఎన్నికల్లో జాతీయ నాయకత్వం యడియూరప్పను పూర్తిగా పక్కనపెట్టింది. అభ్యర్థుల ఎంపికలో ఆయన మాటకు విలువివ్వలేదు. సీనియర్‌ నేతలు శెట్టర్‌, లక్ష్మణ్‌ సవది, ఈశ్వరప్పలాంటి వారికి కూడా టికెట్లు నిరాకరించింది. దీంతో రాష్ట్ర బీజేపీలో సంక్షోభం చెలరేగింది. ఫలితంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది. ఆ తర్వాత యడియూరప్ప విలువ ఢిల్లీ పెద్దలకు తెలిసివచ్చింది. యడ్డీని క్రియాశీలం చేసే క్రమంలో ఆయన కుమారుడు విజయేంద్రకు నిరుడు నవంబరు 10న రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించింది. నాటి నుంచి మాజీ సీఎం అవిశ్రాంతంగా పార్టీ బలోపేతానికి కృషిచేస్తున్నారు. నిరుడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీని వీడిపోయిన వారిలో అత్యధికులను తిరిగి వెనక్కి తీసుకొచ్చారు. లింగాయత్‌లు తిరిగి పార్టీకి మద్దతిచ్చే దిశగా యడియూరప్ప ఆ వర్గానికి చెందిన నేతలకు తిరిగి టికెట్లు ఇప్పించారు. ఇంకోవైపు.. మోదీ తన రాష్ట్ర పర్యటనల్లో యడియూరప్పను ప్రశంసిస్తున్నారు. ఇటీవల శివమొగ్గ సభలో.. దక్షిణ భారతంలో బీజేపీ వేళ్లూనుకోవడానికి ఆయన నిరంతరం శ్రమిస్తున్నారని ఆకాశానికెత్తారు. దీంతో ఈ ఎన్నికల్లో సీనియర్‌ నేతలంతా యడియూరప్ప వెన్నంటే ఉంటున్నారు.

- బెంగళూరు, ఆంధ్రజ్యోతి.

Updated Date - Apr 22 , 2024 | 03:28 AM