Share News

కేరళలో కుస్తీ.. బయట దోస్తీ

ABN , Publish Date - Feb 28 , 2024 | 05:19 AM

కాంగ్రెస్‌, వామపక్షాల బంధంపై ప్రధాని మోదీ మండిపడ్డారు. కేరళలో శత్రువుల్లా కుస్తీలు పడుతున్నాయని.

కేరళలో కుస్తీ.. బయట దోస్తీ

కాంగ్రె్‌స-లెఫ్ట్‌ తీరుపై మోదీ ఆగ్రహం

చెన్నై-ఆంధ్రజ్యోతి/తిరువనంతపురం, ఫిబ్రవరి 27: కాంగ్రెస్‌, వామపక్షాల బంధంపై ప్రధాని మోదీ మండిపడ్డారు. కేరళలో శత్రువుల్లా కుస్తీలు పడుతున్నాయని.. మిగతా రాష్ట్రాల్లో మాత్రం బాయ్‌ఫ్రెండ్స్‌లా కౌగలించుకుంటున్నాయని ఎద్దేవాచేశారు. మంగళవారం ఉదయం తిరువనంతపురంలో, సాయంత్రం తిరుప్పూరు జిల్లా మాదాపురం బహిరంగసభల్లో మోదీ ప్రసంగించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో గెలిచేది లేదని ఇండియా కూటమికి అర్థమైందన్నారు. ‘కేరళలోని లెఫ్ట్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం ఫాసిస్టు సర్కారని కాంగ్రెస్‌ విమర్శిస్తోంది. కాంగ్రెస్‌ కార్యకర్తలపై కమ్యూనిస్టులు లాఠీచార్జి చేయిస్తున్నారు. కానీ ఇండియా కూటమి సమావేశాల్లో వీరంత కలిసి కూర్చుని సమోసాలు, బిస్కెట్లు తింటారు. వీళ్ల మోసాలకు కేరళ ప్రజలు తగు విధంగా బుద్ధి చెబుతారు’ అని వ్యాఖానించారు. దేశం కంటే ఒక్క కుటుంబ ప్రయోజనాలే కాంగ్రె్‌సకు ముఖ్యమని, ఇప్పుడు కమ్యూనిస్టులు కూడా ఇదే పాటిస్తున్నారని అన్నారు. వయనాడ్‌లో యువరాజు (రాహుల్‌గాంధీ) పోటీచేయొద్దంటూ కాంగ్రె్‌సకు వారు సలహా ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. తమిళనా డులో దివంగత ఎంజీఆర్‌ కుటుంబ రాజకీయాలను ప్రోత్సహించలేదని.. డీఎంకే కుటుంబ రాజకీయాలు ఆయనకు అవమానమని పేర్కొన్నారు. ‘అమ్మ’ జయలలిత తన యావజ్జీవితాన్ని ప్రజాసంక్షేమానికి అంకితం చేశారని కొనియాడారు. ఉత్తరాదిన తమ పప్పులు ఉడకవని గ్రహించిన ‘ఇండియా’ కూటమి నేతలు తమిళనాడును కొల్లగొట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని, ఆ దోపిడీగాళ్ల దుకాణానికి తాళం వేయడమే తన కర్తవ్యమని పేర్కొన్నారు.

Updated Date - Feb 28 , 2024 | 07:05 AM