కాంగ్రెస్ ను తుడిచిపెట్టేయండి
ABN , Publish Date - Apr 03 , 2024 | 03:00 AM
బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే దేశం అగ్నిగుండం అవుతుందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

వారికి దేశభక్తి గురించి మాట్లాడే అర్హత లేదు: ప్రధాని మోదీ
రుద్రపూర్ (ఉత్తరాఖండ్), ఏప్రిల్ 2: బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే దేశం అగ్నిగుండం అవుతుందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశాన్ని అస్థిరత, అరాచకంవైపు నెట్టిన కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో పూర్తిగా తుడిచిపెట్టేయాలని ప్రజలను కోరారు. మంగళవారం ఉత్తరాఖండ్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో మోదీ ప్రసంగించారు. ‘వారు దేశాన్ని 60ఏళ్లు పాలించారు. కేవలం పదేళ్లు అధికారానికి దూరంగా ఉండటంతో ఇప్పుడు దేశాన్ని తగులబెట్టడం గురించి మాట్లాడుతున్నారు. మీరు వారిని అలా చేయనిస్తారా? ప్రజాస్వామ్యంలో ఇలాంటి భాష వాడటం ఆమోదయోగ్యమేనా? మీరు వారిని శిక్షించలేరా?’ అని మోదీ ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు ఒక్కొక్కరిగా ఎన్నికల బరి నుంచి సాగనంపాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వాల బలహీనత దేశ విభజనకు దారితీసిందని, పాక్ జలసంధిలోని కచ్చతివు ద్వీపాన్ని శ్రీలంకకు ధారాదత్తం చేసిన ఆ పార్టీకి దేశభక్తి గురించి మాట్లాడే అర్హత లేదని మోదీ ఆక్షేపించారు. ‘అవినీతిపరులు నన్ను బెదిరిస్తున్నారు... దూషిస్తున్నారు... వీటికి నేను భయపడను. వారు నన్ను అడ్డుకోలేరు. ప్రతి ఒక్క అవినీతిపరుడిపై చర్యలు కొనసాగుతాయి. ఇలాంటివారు జైల్లో ఉండాలని మీకు అనిపించడం లేదా? మరోసారి ఎన్నికైన తర్వాత అవినీతిపై ఇంకా కఠిన చర్యలు తీసుకుంటాం’ అని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.