చట్టబద్ధమైన తల్లి ఎవరు?
ABN , Publish Date - Aug 14 , 2024 | 05:18 AM
అండ/వీర్య దాతకు.. పుట్టే బిడ్డపై ఎలాంటి చట్టపరమైన హక్కులూ ఉండవని, ఆ బిడ్డకు తాము బయలాజికల్ పేరెంట్స్ అని చెప్పుకోజాలరని బాంబే హైకోర్టు తేల్చిచెప్పింది. మహారాష్ట్రకు చెందిన ఒక మహిళ (42) పెళ్లయి చాలాకాలమైనా బిడ్డలు లేకపోవడంతో.. అద్దె గర్భం ద్వారా పిల్లలను పొందాలని భావించింది. తన చెల్లి అండం, తన భర్త వీర్యంతో
అండం ఇచ్చిందొకరు.. కడుపున మోసిందొకరు
సరగసీ ఖర్చును భరించిన మహిళ మరొకరు
అండ/వీర్య దాతకు.. బిడ్డపై చట్టపరమైన
హక్కులు ఉండవని తేల్చిన బాంబే హైకోర్టు
ముంబయి, ఆగస్టు 13: అండ/వీర్య దాతకు.. పుట్టే బిడ్డపై ఎలాంటి చట్టపరమైన హక్కులూ ఉండవని, ఆ బిడ్డకు తాము బయలాజికల్ పేరెంట్స్ అని చెప్పుకోజాలరని బాంబే హైకోర్టు తేల్చిచెప్పింది. మహారాష్ట్రకు చెందిన ఒక మహిళ (42) పెళ్లయి చాలాకాలమైనా బిడ్డలు లేకపోవడంతో.. అద్దె గర్భం ద్వారా పిల్లలను పొందాలని భావించింది. తన చెల్లి అండం, తన భర్త వీర్యంతో సరగసీ విధానంలో 2019 ఆగస్టులో ఇద్దరు కవల ఆడపిల్లలను పొందింది. అయితే.. అదే ఏడాది ఏప్రిల్‌లోనే ఆమె చెల్లెలు భర్త, కుమార్తె రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. 2021 మార్చిలో.. భర్త ఆమెకు విడాకులిచ్చి ఆమె చెల్లెలితో, ఇద్దరు కవలలతో కలిసి వేరే ఫ్లాట్‌లో నివసించడం ప్రారంభించాడు. రెండేళ్లపాటు మాతృత్వ మాధుర్యాన్ని అనుభవించిన ఆ మహిళ.. ఆ పిల్లలను చూసే అవకాశం కూడా తనకు కల్పించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపాటు, కోర్టును ఆశ్రయించింది. తనకు ఉన్న ‘విజిటేషన్ రైట్స్’ (వెళ్లి పిల్లలను చూసుకునే హక్కు’)ను కాపాడాలని కోరింది. కింది కోర్టు ఆమె వినతిని తిరస్కరించగా.. ఆమె బాంబే హైకోర్టులో అప్పీలు చేసింది. అయితే.. ‘అండ దానం’ చేసినందున తానే అసలైన (బయలాజికల్) తల్లినని ఆమె చెల్లెలు కోర్టులో వాదించింది. ఆమె భర్త కూడా ఆమెనే బలపరిచాడు. అయితే.. అండం ఆమెదే అయినా, ఆమె స్వచ్ఛంద దాత అని.. ఆ బిడ్డలను కడుపున మోసింది ఆమె కాదు కాబట్టి చట్ట ప్రకారం ఆమెను తల్లిగా పరిగణించకూడదని పిటిషనర్ తరఫు లాయర్ వాదించారు. వాదనలు విన్న జస్టిస్ జాదవ్.. మంగళవారం తీర్పునిచ్చారు. సరగసీ ద్వారా ఆ పిల్లలు పుట్టింది 2018లో కాబట్టి.. 2021 నాటి సరగసీ (నియంత్రణ) చట్టం ఈ కేసులో వర్తించదని.. 2005లో భారత వైద్య పరిశోధన మండలి మార్గదర్శకాలు వర్తిస్తాయని పేర్కొన్నారు. వాటి ప్రకారం ‘వీర్యదాత’గానీ, ‘అండదాత’గానీ ఎన్నటికీ శిశువులపై చట్టపరమైన హక్కును ప్రకటించుకోలేరని తేల్చిచెప్పారు. అండం ఇచ్చిన తల్లి ‘జెనెటిక్ మదర్’ మాత్రమే అవుతుందని స్పష్టం చేశారు. ప్రతి వారాంతంలో మూడు గంటల పాటు పిల్లలతో గడిపేందుకు ఆ తల్లికి (పిటిషన్ వేసిన మహిళకు) అవకాశం ఇవ్వాలని ఆదేశించారు.