Share News

UPSC Topper: యూపీఎస్సీ టాపర్ ఆదిత్య శ్రీవాస్తవ ఎవరు.. అతని ఫస్ట్ రియాక్షన్ ఏంటి?

ABN , Publish Date - Apr 16 , 2024 | 07:14 PM

అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ‘సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2023’ ఫలితాలను మంగళవారం ప్రకటించింది. ఈ ఫలితాల్లో.. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేట్ అయిన ఆదిత్య శ్రీవాస్తవ టాప్ ర్యాంక్ సాధించాడు.

UPSC Topper: యూపీఎస్సీ టాపర్ ఆదిత్య శ్రీవాస్తవ ఎవరు.. అతని ఫస్ట్ రియాక్షన్ ఏంటి?

అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నిర్వహించిన ‘సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2023’ (Civil Services Examination-2023) ఫలితాలను మంగళవారం ప్రకటించింది. ఈ ఫలితాల్లో.. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేట్ అయిన ఆదిత్య శ్రీవాస్తవ (Aditya Srivastava) టాప్ ర్యాంక్ సాధించాడు. ఈ నేపథ్యంలోనే అతను ఎక్స్ వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నాడు. ‘‘ఏళ్ల తరబడి చేసిన కష్టానికి ఏదో ఒక రోజు కృషి దక్కుతుంది’’ అంటూ ఒక ట్వీట్‌లో రాసుకొచ్చాడు. మరో ట్వీట్‌లో తన కల సాకారం అయ్యిందని, ఈ ప్రయాణంలో తనకు తోడుగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానని పేర్కొన్నాడు. ఇందుకు నెటిజన్లు స్పందిస్తూ.. అతనికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

టీ20 వరల్డ్‌కప్‌లో హార్దిక్ పాండ్యాకు నో ఛాన్స్.. కారణం ఇదే?


ఎవరీ ఆదిత్య శ్రీవాస్తవ?

లక్నోకి చెందిన ఆదిత్య తన ప్రారంభ విద్యను సీఎంఎస్ అలీగంజ్‌లో పూర్తి చేశాడు. 12వ తరగతి పరీక్షల్లో 95% స్కోర్‌తో రాణించాడు. అనంతరం ఐఐటీ కాన్పూర్ నుంచి బీటెక్, ఎంటెక్ చేశాడు. తన విద్యాభ్యాసం పూర్తయ్యాక.. బెంగళూరులోని ఒక అమెరికన్ MNC కంపెనీలో చేరాడు. అందులో 15 నెలల పాటు పని చేశాడు. ఈ అనుభవం ప్రాథమిక స్థాయిలో సమాజానికి దోహదపడాలనే కోరికను రేకెత్తించడంతో.. 2020లో ఉద్యోగం మానేసి, యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌కు ప్రిపేర్ కావడం ప్రారంభించాడు. 2021లో రాసిన పరీక్షల్లో 236వ ర్యాంక్ సాధించి.. ఐపీఎస్‌కి ఎంపికయ్యాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న ఆదిత్య.. అంకితభావం, పట్టుదల, కుటుంబ సభ్యుల మద్దతుతో 2023లో అత్యున్నత స్థానానికి చేరుకున్నాడు. ఎలాంటి కోచింగ్ లేకుండానే ఈ విజయాన్ని సాధించానని.. టెస్ట్ సిరీస్, మాక్ ఇంటర్వ్యూల ద్వారా ప్రిపేర్ అయ్యానని ఆదిత్య చెప్పుకొచ్చాడు.

టీ20 వరల్డ్‌కప్ జట్టులో దినేశ్ కార్తిక్.. ఫక్కున నవ్వేసిన పఠాన్!

ఆదిత్య శ్రీవాస్తవ తర్వాత అనిమేష్ ప్రధాన్, డోనూరు అనన్యారెడ్డి వరుసగా రెండు, మూడు ర్యాంకులు సాధించారు. PK సిద్ధార్థ్ రామ్‌కుమార్, రుహాని, సృష్టి దాబాస్, అన్మోల్ రాథోడ్, ఆశిష్ కుమార్, నౌషీన్, ఐశ్వర్యం ప్రజాపతి తదితరులు టాప్-10లో స్థానం సంపాదించుకున్నారు. ఇక ఈ ఫలితాల్లో 1016 మందిని యూపీఎస్సీ ఎంపిక చేసింది. అందులో జనరల్ కేటగిరీలో 347 మంది, ఈడబ్ల్యూఎస్ నుంచి 115, ఓబీసీ నుంచి 303, ఎస్సీ కేటగిరీలో 165, ఎస్టీ కేటగిరీలో 56 మంది చొప్పున ఎంపిక అయ్యారు.

Updated Date - Apr 16 , 2024 | 07:14 PM