పిల్లోడిని చూస్తే భర్త గుర్తుకొస్తున్నాడని..
ABN , Publish Date - Jan 12 , 2024 | 06:02 AM
భర్తపై కోపంతో నాలుగేళ్ల కుమారుడిని చంపేసిన ‘మైండ్‌ఫుల్ ఏఐ ల్యాబ్’ స్టార్టప్ సీఈవో సుచనా సేథ్.. తన కుమారుడి ముఖం తన భర్తను పోలి ఉందని స్నేహితులు, బంధువులు, ఇతర కుటుంబసభ్యులతో అన్నట్టు దర్యాప్తులో వెల్లడైంది.

బంధువులు, స్నేహితులకు తెలిపిన బెంగళూరు సీఈవో
కోర్టు ఆదేశించినా బిడ్డను భర్త వద్దకు పంపని వైనం
దర్యాప్తులో వెలుగులోకి మరిన్ని విషయాలు
న్యూఢిల్లీ, జనవరి 11: భర్తపై కోపంతో నాలుగేళ్ల కుమారుడిని చంపేసిన ‘మైండ్‌ఫుల్ ఏఐ ల్యాబ్’ స్టార్టప్ సీఈవో సుచనా సేథ్.. తన కుమారుడి ముఖం తన భర్తను పోలి ఉందని స్నేహితులు, బంధువులు, ఇతర కుటుంబసభ్యులతో అన్నట్టు దర్యాప్తులో వెల్లడైంది. ఎప్పుడు బిడ్డ ముఖం చూసినా భర్త గుర్తుకొస్తున్నాడని ఆమె పేర్కొన్నట్టు తెలిసింది. బెంగళూరులో నివసించే సుచనా సేథ్ కుమారుడితో గోవాకు వెళ్లి, అక్కడి సర్వీసు అపార్ట్‌మెంట్‌లో బిడ్డను చంపేసి, మృతదేహాన్ని బ్యాగులో కుక్కేసి ట్యాక్సీలో కర్ణాటకకు ప్రయాణమైన విషయం తెలిసిందే. ఆమె గదిలో రక్తపు మరకలను గమనించిన సర్వీసు అపార్ట్‌మెంట్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హత్య గుట్టు రట్టయ్యింది. దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కాగా, ఆమె కుమారుడి మృతదేహానికి బెంగళూరులోని రాజాజీనగర్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. దర్యాప్తులో వెల్లడైన వివరాల మేరకు విభేదాలు రావడంతో సుచనా సేథ్, వెంకటరామన్ దంపతులు 2020లో విడాకులకు దరఖాస్తు చేశారు. ప్రతి శనివారం కుమారుడితో గడిపే అవకాశాన్ని కోర్టు వెంకటరామన్‌కు కల్పించింది. అయినప్పటికీ కుమారుడిని భర్త వద్దకు పంపడం ఆమెకు ఇష్టం లేదు. గతవారం సుచనా సేథ్‌కు వెంకటరామన్ ఫోన్ చేసి ఆదివారం కుమారుడిని బెంగళూరులోని తన ఇంటికి తీసుకురావాలని కోరగా, నిరాకరించిన ఆమె తనను నగరంలోని బహిరంగ ప్రదేశాల్లో మాత్రమే కలవాలని స్పష్టం చేశారు. దీంతో వెంకటరామన్ ఓ బహిరంగ ప్రదేశంలో రెండు గంటలకుపైగా వేచి చూసినా ఆమె రాలేదు. దీంతో ఉద్యోగ విధులకు హాజరయ్యేందుకు వెంకటరామన్ ఇండోనేసియాకు వెళ్లిపోయారు. అనంతరం తన కుమారుడిని వెంకటరామన్ కలవ కూడదని భావించిన ఆమె కుమారుడితో గోవాకు వెళ్లిపోయింది. కుమారుడిని ఊపిరి అందకుండా చేసి చంపేసినట్టు పోస్టుమార్టంలో వెల్లడైంది. అయితే, తానేమీ హత్యకు కుట్రపన్నలేదని, కుమారుడితోనే తిరిగి ఇంటికి వెళ్లాలనుకున్నానని ఆమె చెబుతుండటంతో, దరాప్తు అధికారులు ఆమెను మానసిక వైద్యుల వద్దకు తీసుకెళ్లారు. తన తల్లి మరణం తర్వాత సుచనా చాలా ఏళ్ల వరకు తండ్రితో మాట్లాడలేదని మానసిక వైద్యులు నిర్వహించిన కౌన్సెలింగ్‌లో వెల్లడైంది. ఈ కేసులో ఇప్పటి వరకు 12 మంది వాంగ్మూలాలను దర్యాప్తు అధికారులు రికార్డు చేశారు.