Share News

బదిలీల్లో అలసత్వం సహించబోం

ABN , Publish Date - Feb 25 , 2024 | 05:41 AM

సార్వత్రిక ఎన్నికలవేళ అధికారుల బదిలీల విషయంలో రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర ఎన్నికల సంఘం నిర్దిష్ట మార్గదర్శకాలను జారీచేసింది. బదిలీ ప్రక్రియలో అలసత్వాన్ని

బదిలీల్లో అలసత్వం సహించబోం

అధికారిని తాను పనిచేసే జిల్లాకు పక్కనే, అదే నియోజకవర్గంలోని జిల్లాకు పంపొద్దు

బదిలీ మార్గదర్శకాలను పాటించాల్సిందే.. రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికలసంఘం నిర్దేశాలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24 : సార్వత్రిక ఎన్నికలవేళ అధికారుల బదిలీల విషయంలో రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర ఎన్నికల సంఘం నిర్దిష్ట మార్గదర్శకాలను జారీచేసింది. బదిలీ ప్రక్రియలో అలసత్వాన్ని సహించబోమని స్పష్టం చేసింది. పనిచేస్తున్న జిల్లాకు పక్కనే ఉన్న, అదే నియోజకవర్గం పరిధిలోని జిల్లాకు అధికారిని పంపితే.. దానిని బదిలీగా పరిగణించబోమని స్పష్టం చేసింది. ఎన్నికలకు ముందు అధికారులకు స్థానచలనం కలిగించడం ఎన్నికల నిబంధనల్లో భాగం. సొంత జిల్లాల్లో పనిచేస్తున్నవారినీ, పనిచేస్తున్న చోట మూడేళ్ల సర్వీసును పూర్తి చేసుకున్న అధికారులను తప్పనిసరిగా బదిలీ చేయాల్సి ఉంటుంది. పోటీలో ఉన్న ఏదో ఒక రాజకీయ పార్టీ లేక అభ్యర్థికి అనుకూలంగా తమ అధికారాలను అధికారులు వినియోగించకుండా ఈసీ ఈ నిబంధనను గట్టిగా అమలు చేస్తోంది. అయితే, కొన్ని చోట్ల బదిలీ ప్రక్రియను తూతూమంత్రంగా చేపడుతున్నట్టు ఈసీ తన పర్యటనల్లో గమనించింది. దీనిని ఈసీ చాలా తీవ్రంగా పరిగణించింది. బదిలీ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని రాష్ట్రాలకు గట్టిగా సూచించింది. ‘‘సమదృష్టిలో అధికారులు ఎన్నికల నిర్వహణ చేపట్టాలి. ఎవరి వల్లా ఈ ప్రక్రియ ఇబ్బందుల్లో పడకుండా మార్గదర్శకాలను మరింత బలోపేతం చేశాం. మార్గదర్శకాల్లో మేం గుర్తించిన చిన్న చిన్న లొసుగులను కూడా సరిదిద్ది సమగ్ర విధానంతో ఈసారి ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతున్నాం’’ అని శనివారం ఒక ప్రకటనలో సీఈసీ రాజీవ్‌కుమార్‌ తెలిపారు.

Updated Date - Feb 25 , 2024 | 08:03 AM