Share News

Prime Minister Narendra Modi : మాకు 370 సీట్లు

ABN , Publish Date - Feb 06 , 2024 | 03:44 AM

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 370 సీట్లను కచ్చితంగా గెలుస్తుందని, ఎన్‌డీఏ కూటమి 400కు పైగా సీట్లను సాధిస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ధీమా వ్యక్తం చేశారు. తన మూడో దఫా ప్రభుత్వంలో భారతదేశానికి వచ్చే వెయ్యేళ్లకు అవసరమైన పునాది వేసేలా చాలా పెద్ద

Prime Minister Narendra Modi : మాకు 370 సీట్లు

బీజేపీ సొంతంగా గెలుస్తుంది.. ఎన్‌డీఏకు 400 దాటుతాయ్‌

100 రోజుల్లో నా మూడోదఫా షురూ

ఈసారి వెయ్యేళ్లు గుర్తుండేలా పాలన

3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌

దేశానికి బలమైన ప్రతిపక్షం అవసరం

కాంగ్రెస్‌ ఆ పనిచేయదు, ఇతరుల్ని

చేయనివ్వదు.. ఆ పార్టీకి ఇక తాళమే

దశాబ్దాలు అధికారంలో ఉంది..

అంతేకాలం ప్రతిపక్షంలో ఉంటుంది

ఓబీసీలు లేరంటారేంటి?.. నేనే ఓబీసీని

లోక్‌సభలో ప్రధాని నరేంద్రమోదీ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 370 సీట్లను కచ్చితంగా గెలుస్తుందని, ఎన్‌డీఏ కూటమి 400కు పైగా సీట్లను సాధిస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ధీమా వ్యక్తం చేశారు. తన మూడో దఫా ప్రభుత్వంలో భారతదేశానికి వచ్చే వెయ్యేళ్లకు అవసరమైన పునాది వేసేలా చాలా పెద్ద నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. తన మూడో దఫా పాలన ఎంతో దూరంలో లేదని, 100-125 రోజుల్లో ప్రారంభమవుతుందన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు సమాధానమిస్తూ మోదీ సోమవారం లోక్‌సభలో మాట్లాడారు. దాదాపు 100 నిమిషాలపాటు కొనసాగిన ఆయన ప్రసంగంలో విపక్షాలను ముఖ్యంగా కాంగ్రె్‌సను దునుమాడారు. దేశంలో ప్రతిపక్షాల దుస్థితికి కాంగ్రెస్‌ పార్టీనే కారణమని, కాంగ్రెస్‌ దుకాణానికి తాళం వేసే పరిస్థితి వచ్చిందన్నారు. ఇండియా కూటమి గాడి తప్పిందని, ఆ కూటమి పక్షాల మధ్య ఐక్యత లేదని.. వారిపై వారికే విశ్వాసం లేనప్పుడు ప్రజలకు వారి మీద విశ్వాసం ఎలా ఉంటుందని ప్రధాని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతల ప్రసంగాలు విన్నప్పుడల్లా వారు చాలా కాలం ప్రతిపక్షంలోనే ఉంటారన్న తన విశ్వాసం మరింత బలపడిందని ఎద్దేవా చేశారు. పార్లమెంటు చివరి సమావేశాల్లో సైతం విపక్షాలు ఎటువంటి నిర్మాణాత్మక సూచనలు ఇవ్వలేకపోయాయన్నారు. వారిని ప్రజలు కూడా అదే రకంగా ఆశీర్వదిస్తారని తెలిపారు. దశాబ్దాలపాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్‌.. ఇకపై దశాబ్దాల పాటు ప్రతిపక్షంలో ఉండాలని నిశ్చయించుకున్నట్లుందని ఎద్దేవా చేశారు.

బలమైన ప్రతిపక్షం అవసరం

దేశానికి బలమైన, ఆరోగ్యవంతమైన ప్రతిపక్షం అవసరమని ప్రధాని మోదీ చెప్పారు. కానీ, మంచి ప్రతిపక్షంగా బాధ్యతలు నిర్వర్తించే అవకాశం కాంగ్రెస్‌ కోల్పోయిందని, ఆ పార్టీ పనిచేయదు, ఇతరులను పనిచేయనివ్వదని ఆరోపించారు. పలువురు యువనేతలతోపాటు ఎంతోమంది నాయకులు ఉన్నప్పటికీ, వారు ఎక్కడ తమను మించిపోతారో అన్న భయంతో వారికి అవకాశాలు దక్కకుండా కాంగ్రెస్‌ అడ్డుకుందని ఆరోపించారు. ఆ పార్టీ.. రాచ కుటుంబాన్ని మించి చూడదంటూ గాంధీ కుటుంబంపై విమర్శలు సంధించారు. ఒకే ఉత్పత్తిని మాటిమాటికీ మార్కెట్‌లో ప్రవేశపెడుతున్నారని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీని ఉద్దేశించి మోదీ పరోక్షంగా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ వారసత్వ రాజకీయాలతో యావత్‌ దేశం నష్టపోయిందన్నారు. కాంగ్రెస్‌ యూపీఏ పదేళ్ల హయాంలో చోటు చేసుకున్న అనేక అవకతవకలను తన తొలి దఫా ప్రభుత్వంలో అరికట్టామని, రెండో దఫాలో నూతన భారత్‌కు పునాది వేశామని మోదీ చెప్పారు. మూడో దఫాలో వచ్చే వెయ్యేళ్లకు అవసరమైన పటిష్ఠమైన పునాది వేస్తామని, అతిపెద్ద నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. ఈసారి బీజేపీ 400 సీట్లను లక్ష్యంగా పెట్టుకొందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే చేసిన వ్యాఖ్యలను మోదీ ప్రస్తావిస్తూ.. బీజేపీ 370 సీట్లను, ఎన్‌డీఏ 400కిపైగా సీట్లను గెల్చుకుంటుందన్నారు. కాంగ్రెస్‌ హయాంలో అవినీతి విచ్చలవిడిగా ఉండేదని, తన ప్రభుత్వం దానికి అడ్డుకట్ట వేసిందని తెలిపారు. కాంగ్రెస్‌ హయాంలో ఈడీ కేవలం రూ.ఐదు వేల కోట్లే స్వాధీనం చేసుకున్నదని, తమ పాలనలో రూ.లక్ష కోట్లకుపైగా స్వాధీనపరుచుకున్నామని ప్రధాని మోదీ వెల్లడించారు.

నెహ్రూపై విమర్శలు

భారతీయులు సోమరులని, తెలివితక్కువ వారని, వారికి కష్టపడే తత్వం లేదని దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ బహిరంగంగా ఎర్రకోట మీది నుంచే చెప్పారని, ఇందిరాగాంధీ కూడా ఆయన కంటే భిన్నమైన నేత ఏమీ కారని మోదీ చెప్పారు. ఇది రాచకుటుంబాల మనస్తత్వమని, నెహ్రూ చేసిన తప్పులకు కశ్మీర్‌ ప్రజలు మూల్యం చెల్లించారని దుయ్యబట్టారు. ఒక కుటుంబం నుంచి పలువురు నాయకులుగా ఆవిర్భవించటం కుటుంబ పాలన కిందికి రాదని, ఒక కుటుంబం కేంద్రంగా ఒక పార్టీ నడవటం కుటుంబ పాలన అవుతుందని మోదీ చెప్పారు. బీజేపీలో కూడా పలువురు నేతల పిల్లలు రాజకీయాల్లో ఉండటాన్ని విపక్షాల సభ్యులు ప్రశ్నించినప్పుడు సమాధానంగా ఆయన ఈ వివరణ ఇచ్చారు. ప్రతిపక్షాలు ఓబీసీల ప్రాతినిధ్యం గురించి ప్రస్తావిస్తున్నాయని పేర్కొంటూ, వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఓబీసీలు ఎంతమంది ఉన్నారని అడుగుతారేగానీ, అతిపెద్ద ఓబీసీని చూడరేమిటి? అంటూ ప్రధానినైన తానే స్వయంగా ఓబీసీనని పరోక్షంగా చెప్పుకొన్నారు. నెహ్రూ, ఇందిరలను మోదీ విమర్శించిన సమయంలో కాంగ్రెస్‌ సభ్యులు ప్రధాని ప్రసంగానికి అడ్డు తగిలారు.

4 కోట్ల ఇళ్లు నిర్మించాం

పేదల కోసం తాము నాలుగు కోట్ల ఇళ్లు కట్టించామని, ఈ పని చేయటానికి కాంగ్రెస్‌కు వందేళ్లు పట్టేదని మోదీ విమర్శించారు. కొవిడ్‌ చెలరేగినప్పటికీ ద్రవ్యోల్బణాన్ని అరికట్టగలిగిందని చెప్పారు. తన హయాంలో భారత్‌ ప్రపంచ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో 11వ స్థానం నుంచి 5వ స్థానానికి చేరుకుందని, తాను మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత, భారత్‌ మూడవ అతిపెద్ద ఆర్థికశక్తిగా మారుతుందని పేర్కొన్నారు. తన హయాంలో దేశం డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థగా మారిందని.. స్టార్ట్‌పలు, డిజిటల్‌ సంస్థలు, యునికార్న్‌లు, గిగ్‌ ఆర్థిక వ్యవస్థ.. నూతన భారతదేశంలో ఇవన్నీ కొత్త పదజాలంగా మారాయని చెప్పారు. దేశంలో మహిళలకు ఉపాధి పెరిగిందని, ఒలింపిక్స్‌ నుంచి సశస్త్రబల్‌, పార్లమెంటు వరకు మహిళా సాధికారికత వెల్లివిరుస్తోందని ప్రధాని చెప్పారు. గతంతో పోలిస్తే యువతకు ఉపాధి అవకాశాలు కూడా పెరిగాయని అన్నారు. ప్రపంచాన్ని భారతదేశం ప్రభావితం చేస్తోందని, జీ-20 అందుకు ఉదాహరణ అని పేర్కొన్నారు.

Updated Date - Feb 06 , 2024 | 03:44 AM