Share News

కోర్టుకైతే వెంటనే చెప్పలేం..కేంద్రం అడిగితే ఆగమేఘాలపై ఇచ్చేస్తాం!

ABN , Publish Date - Mar 14 , 2024 | 05:40 AM

ఎన్నికల బాండ్ల వివరాలు మార్చి 6లోగా ఈసీకి సమర్పించాలని ఫిబ్రవరి 15న సుప్రీంకోర్టు ఆదేశిస్తే..‘అదంతా చాలా శ్రమతో కూడుకున్న పని. దాతలు, గ్రహీతల వివరాలు సరిపోల్చి చూడడానికి కొన్ని నెలల సమయం పడుతుంది.

కోర్టుకైతే వెంటనే చెప్పలేం..కేంద్రం అడిగితే  ఆగమేఘాలపై ఇచ్చేస్తాం!

ఎన్నికల బాండ్ల వివరాలపై ఎస్‌బీఐ ధోరణి ఇదే

గతంలో కేంద్ర ప్రభుత్వం అడిగిన 48 గంటల్లో సమర్పణ

ఆధారాలతో సహా ‘రిపోర్టర్స్‌ కలెక్టివ్‌’ సంచలన వ్యాసం

న్యూఢిల్లీ, మార్చి 13: ఎన్నికల బాండ్ల వివరాలు మార్చి 6లోగా ఈసీకి సమర్పించాలని ఫిబ్రవరి 15న సుప్రీంకోర్టు ఆదేశిస్తే..‘అదంతా చాలా శ్రమతో కూడుకున్న పని. దాతలు, గ్రహీతల వివరాలు సరిపోల్చి చూడడానికి కొన్ని నెలల సమయం పడుతుంది. అంచేత గడువును జూన్‌ 30 దాకా పొడిగించండి’ అని కోరిన ఎస్‌బీఐ.. గతంలో అవే వివరాలను కేం ద్రం కోరితే ఆగమేఘాలపై ఇచ్చింది తెలుసా? నిబంధనల ప్రకారం జారీ చేసిన ఎన్నికల బాండ్‌ను 15 రోజుల్లోగా పార్టీలు నగదుగా మార్చుకోకపోతే ఆ మొత్తం పీఎం జాతీయ సహాయనిధికి జమకావాల్సి ఉండగా.. ఒక సందర్భంలో ఎక్స్‌పైరీ తేదీ తర్వాత కూడా ఒక పార్టీ ఆ బాండ్లను నగదుగా మార్చుకోవడానికి సహకరించిందని తెలుసా? ఎస్‌బీఐ కోర్టుకు చెబుతున్నవన్నీ వట్టి సాకులేనని.. తల్చుకుంటే అతి తక్కువ సమయంలోనే అడిగిన వివరాలను సమర్పించగలదని తెలుసా? దీనికి సంబంధించి లోకేశ్‌ బాత్రా అనే సామాజిక కార్యకర్త సేకరించిన అనేక ఆధారాలతో ‘ద రిపోర్టర్స్‌ కలెక్టివ్‌’ వెబ్‌సైట్‌ తన బ్లాగులో ఒక సంచలన వ్యాసాన్ని ప్రచురించింది. ఎస్‌బీఐ నిజస్వరూపాన్ని బయటపెట్టింది. 2019, 2020సంవత్సరాల్లో జారీ అయిన ఎన్నికల బాండ్ల గడువు ముగిసిన 48 గంటల్లోపు వాటి వివరాలను దేశంలోని అన్ని బ్రాంచ్‌ల నుంచి సేకరించి కేంద్ర ఆర్థిక శాఖకు సమర్పించిందని అందులో పేర్కొంది. ఇలా బాండ్ల షెల్ఫ్‌ లైఫ్‌ ముగిసిన ప్రతిసారీ కేంద్రానికి వాటి పూర్తి సమాచారాన్ని (దాత, గ్రహీత, బాండ్ల విలువ తదితర వివరాలు) అందజేసిందని వెల్లడించింది. 2020 వరకూ ఎస్‌బీఐ అలా ఇచ్చిన సంగతి నిజమేనని తమ విచారణలో తేలినట్టు తెలిపింది. రిపోర్టర్స్‌ కలెక్టివ్‌ వ్యాసం ప్రకారం.. జారీ అయ్యే ప్రతి బాండుకు ఆడిట్‌ ట్రయల్‌ను ఎస్‌బీఐ నిర్వహించేది. అంటే.. ఆ బాండ్లను కొన్నదెవరు? నగదుగా మార్చుకున్న పార్టీ ఏది? తదితర వివరాలు. ప్రతి బాండుపై ఉండే సీరియల్‌ నంబర్‌తో ఎస్‌బీఐ వాటి పరిస్థితిని ట్రాక్‌ చేసే ది. 2018లో కేంద్రం ఈ స్కీమ్‌ను ప్రవేశపెట్టినప్పుడే.. ఇలా సీరియల్‌ నంబర్‌ ఉండాలని ఎస్‌బీఐ పట్టుబట్టింది. దీంతో ట్రాకింగ్‌ సులువవుతుంది. వాస్తవం ఇలా ఉండగా.. ఎస్‌బీఐ సుప్రీంకోర్టులో ఇందుకు భిన్నమైన వాదన వినిపించింది.

బాండ్లను కొన్నవారి వివరాలు ఒకచోట, గ్రహీతల వివరాలు వేరొకచోట ఉంటాయని.. దేశంలోని అన్ని ఎస్‌బీఐ బ్రాంచ్‌ల్లో అమ్ముడైన బాండ్లు, గ్రహీతల వివరాలు సీల్డ్‌ కవర్లలో ముంబైలోని ప్రధాన కార్యాలయానికి వస్తాయని.. విరాళాలు ఇచ్చినవారి వివరాలను గోప్యంగా ఉంచేందుకు ఆ వివరాలనూ విడివిడిగా ఉంచుతామని.. కాబట్టి ఆ రెంటింటినీ జోడించి ఇవ్వడానికి సమయం పడుతుందన్నది ఎస్‌బీఐ వాదన. కానీ..‘నో యువర్‌ కస్టమర్‌ (కేవైసీ)’ ద్వారా, పైకి కనిపించని సీరియల్‌ నంబర్ల ద్వారా ఎన్నికల బాండ్లను కొన్నవారి వివరాలను ఎస్‌బీఐ సేకరించగలదని, వాటిని వారు ఏ పార్టీకిచ్చారో తెలుసుకోగలదని కేంద్ర ఆర్థిక శాఖే తన అంతర్గత పత్రాల్లో ఒకదాంట్లో పేర్కొనడంగమనార్హం. ఈ బాండ్ల విధానం ఎంత పారదర్శకమో సుప్రీంకోర్టుకు తెలియజేసేందుకు తన వాదనల్లో ఇదే విషయాన్ని తెలిపింది. కాగా ఎన్నికల బాండ్లకు సంబంధించి ఎస్‌బీఐ కేంద్రంతో ఎంత కలిసికట్టుగా పనిచేయగలదో ‘రిపోర్టర్స్‌ కలెక్టివ్‌’ తన వ్యాసంలో వివరించింది. 2018లో ఒక పార్టీ ఎస్‌బీఐ న్యూఢిల్లీ శాఖను సంప్రదించి, తమ వద్ద గడువుతేదీ ముగిసిన బాండ్లు కొన్ని ఉన్నాయని, వాటిని నగదుగా మార్చుకోవడానికి అవకాశ మివ్వాలని కోరింది. ఆ బ్రాంచ్‌ అధికారులు ముంబైలోని ‘ట్రాన్సాక్షన్‌ బ్యాంకింగ్‌ యూనిట్‌’ను సంప్రదించగా ఆ విభాగం ఆ బాండ్లు ఎవరు కొన్నా రు? ఏ పార్టీకిచ్చారు తదితర వివరాలన్నింటినీ క్షణా ల్లో సేకరించి..ఆ సమాచారాన్ని కేంద్ర ఆర్థిక శాఖ అధికారుల ముందు పెట్టారు. అప్పుడు ఎస్‌బీఐ కార్పొరేట్‌ ఆఫీసు రంగంలోకి దిగి.. ఏంచేయాలో చెప్పాలని సలహా అడిగింది. తక్షణమే స్పందించిన కేంద్ర ఆర్థిక శాఖ.. ఆ బాండ్లను నగదుగా మార్చుకునేందుకు సద రు రాజకీయ పార్టీని అనుమతించాలని సూచించింది. దీంతో ఎస్‌బీఐ కార్పొరేట్‌ ఆఫీసు మెరుపువేగంతో స్పందించి.. గడువు ముగిసిపోయిన బాండ్లను మా ర్చుకునే అవకాశాన్ని సదరుపార్టీకి కల్పించాలని ఢిల్లీ బ్రాంచ్‌కు ఆదేశాలిచ్చింది. ఈ ప్రక్రియ 24 గంటల్లో జరిగిందంటే ఎస్‌బీఐ, కేంద్రం ఎంత సమన్వయంతో పనిచేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. నాడు ఆ బాండ్లను సొమ్ము చేసుకోవడానికి వచ్చిన పార్టీ ఏదో ఎస్‌బీఐ రికార్డుల్లో, కేంద్ర ఆర్థికశాఖ రికార్డుల్లోనూ లేదు. ఒక్కొక్కటీ రూ.కోటి విలువైన 10బాండ్లను ఎవరు ఎప్పుడు కొన్నారో, వాటిని సొమ్ము చేసుకున్న పార్టీ ఏదో ఎస్‌బీఐకి, కేంద్ర ఆర్థిక శాఖకు తెలుసు.

వెంటనే ఇవ్వగలదు..

ఎన్నికల బాండ్ల వివరాలివ్వడానికి ఎస్‌బీఐకి నెలల తరబడి సమయం అక్కర్లేదని, వెంటనే ఇవ్వగలదని.. 2017, 2018లో ఈ పథకం అమ ల్లో కీలకంగా వ్యవహరించిన విశ్రాంత అధికారి సుభాష్‌ చంద్రగార్గ్‌ తెలిపారు. సీనియర్‌ జర్నలిస్ట్‌ బర్ఖాదత్‌కు చెందిన ‘మోజోస్టోరీ’ యూ ట్యూబ్‌ చానల్‌కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. దాంట్లో ఆయన సుప్రీంకోర్టు అడిగిన సమాచారాన్ని ఇవ్వడానికి ఏ పరిస్థితుల్లో అయినా ఎస్‌బీఐకి అంత సమయం పట్టదని తేల్చిచెప్పారు.

Updated Date - Mar 14 , 2024 | 08:03 AM