Share News

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ నివారణకు టీకాలు!

ABN , Publish Date - Feb 02 , 2024 | 04:45 AM

దేశ ప్రజల ఆరోగ్య సంరక్షణకు సంబంధించి కేంద్ర బడ్జెట్‌లో కొన్ని కీలక ప్రకటనలు చేశారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న ఆస్పత్రులు, మౌలిక సదుపాయాలను వినియోగించుకొని మరిన్ని వైద్య కళాశాలలను ఏర్పాటు చేయాలని కేంద్ర

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ నివారణకు టీకాలు!

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: దేశ ప్రజల ఆరోగ్య సంరక్షణకు సంబంధించి కేంద్ర బడ్జెట్‌లో కొన్ని కీలక ప్రకటనలు చేశారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న ఆస్పత్రులు, మౌలిక సదుపాయాలను వినియోగించుకొని మరిన్ని వైద్య కళాశాలలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని పరిశీలించేందుకు కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. 9-14 ఏళ్ల బాలికల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ నివారణకు టీకాలు వేసే కార్యక్రమాన్ని ప్రోత్సహించనున్నట్లు వెల్లడించారు. ‘‘వైద్యులుగా ప్రజలకు సేవ చేయాలని చాలామంది యువత ఆశ పడుతున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో మరిన్ని వైద్య కళాశాలలను ఏర్పాటు చేస్తాం. ఈ అంశాన్ని పరిశీలించి, అవసరమైన సిఫారసులు చేసేందుకు కమిటీని నియమిస్తాం’’ అని నిర్మల చెప్పారు. పిల్లల్లో రోగ నిరోధక శక్తిని పెంచడానికి తీసుకొచ్చిన ‘మిషన్‌ ఇంద్ర ధనుస్సు’ నిర్వహణకు కొత్తగా ఏర్పాటు చేసిన ‘యు-విన్‌’ వేదికను దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తామన్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమాన్ని దేశంలోని రెండు జిల్లాల్లో పైలట్‌ ప్రాజెక్టు కింద అమలు చేస్తున్నారు. యు-విన్‌ పోర్టల్‌ను కొ-విన్‌ పోర్టల్‌కు అనుసంధానం చేస్తారు. యు-విన్‌ పోర్టల్‌ ద్వారా వ్యాక్సినేషన్‌ స్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఇక మాతా, శిశు ఆరోగ్య సంరక్షణ పథకాలను పక్కాగా అమలు చేసేందుకు సమగ్ర కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు నిర్మల తెలిపారు. సాక్షమ్‌ అంగన్‌వాడీ పథకం కింద అంగన్‌వాడీ కేంద్రాలను ఆధునికీకరిస్తామని.. చిన్నారుల ఎదుగుదల కోసం పోషకాహార పంపిణీని మెరుగ్గా అందించేందుకు ‘పోషణ్‌ 2.0’ కార్యక్రమాన్ని విస్తృతంగా అమలు చేస్తామని వివరించారు.

Updated Date - Feb 02 , 2024 | 04:45 AM