Share News

8 నెలల గరిష్ఠానికి నిరుద్యోగిత రేటు

ABN , Publish Date - Jul 05 , 2024 | 01:11 AM

దేశంలో నిరుద్యోగ రేటు జూన్‌లో 9.2 శాతానికి చేరిందని.. ఇది 8 నెలల గరిష్ఠమని సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఐఈ) వెల్లడించింది. 2024 మేలో 7 శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు..

8 నెలల గరిష్ఠానికి నిరుద్యోగిత రేటు

మేలో 7% నుంచి జూన్‌లో 9.2 శాతానికి!

2023 జూన్‌ నాటికి ఈ రేటు 8.5 శాతమే

పట్టణాలతో పోలిస్తే గ్రామీణప్రాంతాల్లో పురుషులతో పోలిస్తే మహిళల్లో అధికం

సీఎంఐఈ హౌస్‌హోల్డ్‌ సర్వేలో వెల్లడి

న్యూఢిల్లీ, జూలై 4: దేశంలో నిరుద్యోగ రేటు జూన్‌లో 9.2 శాతానికి చేరిందని.. ఇది 8 నెలల గరిష్ఠమని సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఐఈ) వెల్లడించింది. 2024 మేలో 7 శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు.. నెలలోనే 2.2 శాతం మేర పెరగడం గమనార్హం. ‘కన్స్యూమర్‌ పిరమిడ్స్‌ హౌస్‌హోల్డ్‌’ సర్వే ఆధారంగా సీఎంఐఈ ఈ వివరాలను విడుదల చేసింది. దాని ప్రకారం..

గత ఏడాది ఇదే సమయానికి.. అంటే 2023 జూన్‌ నాటికి దేశంలో నిరుద్యోగ రేటు 8.5 శాతంగా ఉంది.

నిరుడు జూన్‌లో 15.1 శాతంగా ఉన్న మహిళా నిరుద్యోగ రేటు.. ఈ ఏడాది మరింత పెరిగి 18.5 శాతానికి చేరింది. జాతీయ నిరుద్యోగరేటుకు ఇది దాదాపు రెట్టింపు కావడం గమనార్హం.

పురుషుల్లో నిరుద్యోగరేటు గత ఏడాది జూన్‌లో 7.7ు ఉండగా.. ఈ ఏడాది అది7.8 శాతంగా ఉంది.

ఎప్పటిలాగానే ఈసారి కూడా.. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు అధికంగా ఉంది. మే నెలలో గ్రామీణ ప్రాంతాల్లో 6.3 శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు.. జూన్‌నాటికి 9.3 శాతానికి చేరింది. 2023లో ఇది 8.8 శాతమే. గ్రామీణ ప్రాంతాల్లో పురుషుల్లో మే నాటికి 5.4 శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు జూన్‌కి 8.2 శాతానికి, మహిళల్లో నిరుద్యోగ రేటు 12 శాతం నుంచి 17.1 శాతానికి పెరగడం గమనార్హం.

పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు స్వల్పంగా మాత్రమే (మేలో 8.6ు నుంచి జూన్‌లో 8.9 శాతానికి) పెరిగింది. పట్టణ మహిళల్లో నిరుద్యోగ రేటు మాత్రం 18.53 శాతం నుంచి 21.36 శాతానికి పెరిగింది.

Updated Date - Jul 05 , 2024 | 06:35 AM