UGC : ఏడాదికి 2సార్లు అడ్మిషన్లు!
ABN , Publish Date - Jun 12 , 2024 | 04:22 AM
ఉన్నత విద్యా సంస్థల్లో ఏడాదికి రెండుసార్లు విద్యార్థులను చేర్చుకునేందుకు యూజీసీ అనుమతించింది. రెగ్యులర్ విధానంలో కోర్సులు సాగించే యూనివర్సిటీలు, కాలేజీలకు ఈ మేరకు అవకాశం కల్పించింది.

ఉన్నత విద్యా సంస్థల్లో రెగ్యులర్
కోర్సుల విద్యార్థులకు చక్కటి చాన్స్
వర్సిటీలు, కాలేజీలకు అనుమతి
ఈ ఏడాది నుంచే అమలు: యూజీసీ
న్యూఢిల్లీ, జూన్ 11: ఉన్నత విద్యా సంస్థల్లో ఏడాదికి రెండుసార్లు విద్యార్థులను చేర్చుకునేందుకు యూజీసీ అనుమతించింది. రెగ్యులర్ విధానంలో కోర్సులు సాగించే యూనివర్సిటీలు, కాలేజీలకు ఈ మేరకు అవకాశం కల్పించింది. జనవరి లేదా ఫిబ్రవరి, జూలై లేదా ఆగస్టు నెలల్లో విద్యార్థుల అడ్మిషన్లకు యూజీసీ విధాన నిర్ణాయక మండలి ద్వైవార్షిక విధానాన్ని ప్రతిపాదించినట్టు కమిషన్ చైర్‌పర్సన్ జగదీశ్ కుమార్ మంగళవారం తెలిపారు. ఈ నిర్ణయం 2024-25 విద్యాసంవత్సరం నుంచే అమల్లోకి వస్తుందన్నారు. మే 5న జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ప్రస్తుతం యూనివర్సిటీలు, కాలేజీలు ఏటా జూలై-ఆగస్టు మధ్య రెగ్యులర్ విధానంలో విద్యార్థులకు అడ్మిషన్ కల్పిస్తున్నాయి. అయితే.. ఈ విధానం వల్ల లక్షల మంది విద్యార్థులు ఒక ఏడాది పాటు ఆయా సంస్థలలో చేరేందుకు నిరీక్షించాల్సి వస్తోందని, దీంతో వారి అమూల్యమైన సమయం వృథా అవుతోందని జగదీశ్ కుమార్ తెలిపారు. గత ఏడాది ఆన్‌లైన్ పద్ధతిలో ఓపెన్, డిస్టెన్స్ లెర్నింగ్ విధానాలను ద్వైవార్షికంగా చేపట్టినట్టు చెప్పారు. ఇది లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కల్పించిందన్నారు.