Share News

ఉత్తరాఖండ్‌ అసెంబ్లీలో యూసీసీ బిల్లు

ABN , Publish Date - Feb 07 , 2024 | 04:09 AM

ఉత్తరాఖండ్‌ రాష్ట్ర ప్రభుత్వం పౌరులందరికీ యూనిఫామ్‌ సివిల్‌ కోడ్‌(యూసీసీ) బిల్లును ఆ రాష్ట్ర అసెంబ్లీలో మంగళవారం ప్రవేశ పెట్టింది. స్వతంత్ర భారత దేశంలో

ఉత్తరాఖండ్‌ అసెంబ్లీలో యూసీసీ బిల్లు

ప్రవేశ పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. స్వతంత్ర భారతంలో తొలిసారి.. గిరిజనులకు మినహాయింపు

డెహ్రాడూన్‌, ఫిబ్రవరి 6 : ఉత్తరాఖండ్‌ రాష్ట్ర ప్రభుత్వం పౌరులందరికీ యూనిఫామ్‌ సివిల్‌ కోడ్‌(యూసీసీ) బిల్లును ఆ రాష్ట్ర అసెంబ్లీలో మంగళవారం ప్రవేశ పెట్టింది. స్వతంత్ర భారత దేశంలో తొలిసారిగా ఓ రాష్ట్ర ప్రభుత్వం యూసీసీని అమల్లోకి తేనుంది. రాష్ట్రంలోని గిరిజనులను ఈ బిల్లు నుంచి పూర్తిగా మినహాయించారు. అలాగే సహజీవనానికి గుర్తింపు ఇచ్చి నమోదు చేసేందుకు నిర్ణయించారు. వీరికి జన్మించిన పిల్లల్ని సక్రమ సంతానంగానే గుర్తిస్తారు. ఒకవేళ ఇద్దరూ విడిపోతే మహిళకు పురుషుడు మనోవర్తి చెల్లించాల్సి ఉంటుంది. మతంతో సంబంధం లేకుండా వివాహం, విడాకులు, భూమి, ఆస్తి, వారసత్వ హక్కులపై పౌరులందరికీ ఒకే చట్టం అని ఈ బిల్లు పేర్కొంటోంది. బహు భార్యత్వాన్ని ఈ ప్రతిపాదిత బిల్లు నిషేధిస్తుంది. ఉత్తరాఖండ్‌ అసెంబ్లీలో ఆ రాష్ట్ర సీఎం పుష్కర్‌సింగ్‌ ధామి స్వయంగా ఈ బిల్లును ప్రవేశపెట్టగా అధికార పక్ష సభ్యులు భారత్‌ మాతా కి జై అని నినదిస్తూ మద్దతు పలికారు. అయితే బిల్లును ఆమోదించకుండా ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి. దాన్ని అధ్యయనం చేసేందుకు మరింత సమయం కావాలని కోరాయి. ఉత్తరాఖండ్‌ రాష్ట్రమంతటికీ... అలాగే ఆ రాష్ట్రం నుంచి వెళ్లినవారికీఈ బిల్లు వర్తిస్తుంది. సహజీవనం చేసేవారు 18 ఏళ్లలోపు వారై ఉండకూడదు. సహజీవనం చేస్తున్నవారు నెలలోగా ఆమేరకు రిజిస్ట్రార్‌కు స్టేట్‌మెంట్‌ సమర్పించకపోతే నెల రోజుల జైలుశిక్ష లేదా రూ.10వేల జరిమానా లేదా రెండూ విధించవచ్చు.

Updated Date - Feb 07 , 2024 | 04:09 AM