Today's laws are for tomorrow : నేటి చట్టాలు రేపటి కోసం
ABN , Publish Date - Jan 29 , 2024 | 03:34 AM
‘‘ప్రస్తుత కాలానికి అనుగుణంగా చట్టాలను ఆధునికీకరిస్తున్నాం. నేడు మారుతున్న ఈ చట్టాలు రేపటి భారత దేశాన్ని మరింత బలోపేతం చేస్తాయి’’ అని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు.
ప్రస్తుత కాలానికి అనుగుణంగా చట్టాలను ఆధునికీకరిస్తున్నాం
సుప్రీంకోర్టు వజ్రోత్సవ వేడుకల్లో మోదీ
న్యూఢిల్లీ, జనవరి 28: ‘‘ప్రస్తుత కాలానికి అనుగుణంగా చట్టాలను ఆధునికీకరిస్తున్నాం. నేడు మారుతున్న ఈ చట్టాలు రేపటి భారత దేశాన్ని మరింత బలోపేతం చేస్తాయి’’ అని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. న్యూఢిల్లీలో ఆదివారం జరిగిన సుప్రీంకోర్టు వజ్రోత్సవ(75వ వార్షికోత్సవం) వేడుకలను ఆదివారం ఆయన ప్రారంభించారు. అదేవిధంగా డిజిటల్ సుప్రీంకోర్టు రిపోర్ట్స్(డీజీ ఎస్సీఆర్), డిజిటల్ కోర్ట్స్ 2.0, సుప్రీంకోర్టు నూతన వెబ్‌సైట్‌లను ప్రధాని ప్రారంభించారు. అనంతరం మోదీ మాట్లాడుతూ.. ఇటీవల తీసుకువచ్చిన మూడు కొత్త నేర న్యాయ చట్టాలతో దేశ న్యాయ, పోలీసింగ్, విచారణ వ్యవస్థలు సరికొత్త యుగంలోకి ప్రవేశిస్తాయని తెలిపారు. వందల ఏళ్లనాటి చట్టాల నుంచి కొత్త చట్టాలకు మారుతున్న క్రమంలో ఈ ప్రక్రియ సజావుగా ఉండేలా చూసుకోవడం అత్యంత ముఖ్యమని సూచించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు సామర్థ్యం పెంపుదల, చట్టాలపై అవగాహనకు సంబంధించిన శిక్షణను ప్రారంభించినట్టు చెప్పారు. ఈ విషయంలో సుప్రీం కోర్టు కూడా ముందుకు రావాలని, న్యాయవ్యవస్థలోని అన్ని విభాగాల సామర్థ్యాలను పెంచేందుకు సహకరించాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు. విశ్వసనీయమైన న్యాయవ్యవస్థను ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తూ అనేక నిర్ణయాలు తీసుకుంటోందని వెల్లడించారు.
‘జన్ విశ్వాస్’ బిల్లు ఈ రూపంలో వచ్చిందేనని, దీనివల్ల న్యాయవ్యవస్థపై పడుతున్న అనవసరపు భారాన్ని తగ్గిపోతుందని చెప్పారు. ‘‘మధ్యవర్తిత్వ చట్టంతో న్యాయస్థానాలపై భారం తగ్గుతుంది. ప్రత్యామ్నాయ వివాద పరిష్కార యంత్రాంగాన్ని మెరుగుపరుస్తుంది’’ అని ప్రధాని తెలిపారు. సుప్రీంకోర్టు భవనాల విస్తరణ, మౌలిక సదుపాయాలకు సంబంధించి రూ.800 కోట్ల పనులకు గత వారమే ప్రభుత్వం ఆమోదం తెలిపిన విషయాన్ని ప్రధాని గుర్తు చేశారు. అయితే, కొత్త పార్లమెంటు భవనంపై పిటిషన్లు వేసినట్టుగా.. సుప్రీంకోర్టు మౌలిక సదుపాయాల కల్పనను సవాల్ చేస్తూ ఎవరూ పిటిషన్ వేయరని భావిస్తున్నట్టు వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు నిర్ణయాలు డిజిటల్ రూపంలో అందుబాటులోకి రావడం, తీర్పులు స్థానిక భాషల్లో అనువదించే ఏర్పాటు చేయడం పట్ల ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు. ఈ తరహా ఏర్పాట్లు దేశవ్యాప్తంగా ఇతర కోర్టుల్లోనూ ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, ఇతర న్యాయమూర్తులు, కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రాం మేఘ్వాల్ తదితరులు పాల్గొన్నారు.
డిజిటల్ సుప్రీంకోర్టు సీజేఐ
సుప్రీంకోర్టు తీర్పులు ఇక నుంచి డిజిటల్ నివేదికల రూపంలో ప్రజలకు ఉచితంగా అందుబాటులోకి రానున్నాయని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు. సుప్రీంకోర్టు వజ్రోత్సవ వేడుకల్లో మాట్లాడుతూ.. ‘‘ఇదొక మహత్తరమైన రోజు. రాజ్యాంగం ద్వారా ప్రజలు వారికి వారే ఏర్పాటు చేసుకున్న కోర్టు ఇది. పౌరుల పరస్పర గౌరవానికి రాజ్యాంగం పెద్దపీట వేసింది’’ అని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. భవిష్యత్తు గురించి చెబుతూ.. దేశం మొత్తానికి సంబంధించిన రియల్ టైమ్ జ్యుడీషియల్ డేటాను పర్యవేక్షించేందుకు వీలుగా సాంకేతికతతో కూడిన ‘వార్ రూమ్’ను ప్రారంభించనున్నట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా అన్ని కోర్టుల్లోనూ కీలకమైన పదవుల్లో మహిళలను నియమించినట్టు తెలిపారు.