Share News

Yogi Adithyanath: సీఎం యోగి బెంగాల్‌కు వస్తే.. సీనియర్ నేత స్ట్రాంగ్ వార్నింగ్

ABN , Publish Date - Feb 10 , 2024 | 06:39 PM

జ్ఞానవాపి మసీదుపై వారణాసి కోర్టు ఇచ్చిన తీర్పు ఎంత వివాదాస్పదమైందో అందరికీ తెలిసిందే. ఈ మసీదు కింద ఆలయ శిథిలాలు ఉన్నాయని పురావస్తు శాఖ సర్వే ఆధారంగా.. సెల్లార్‌లో హిందువులు పూజలు నిర్వహించుకోవచ్చని కోర్టు ఇచ్చిన అనుమతిపై ముస్లిం నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Yogi Adithyanath: సీఎం యోగి బెంగాల్‌కు వస్తే.. సీనియర్ నేత స్ట్రాంగ్ వార్నింగ్

జ్ఞానవాపి మసీదుపై వారణాసి కోర్టు ఇచ్చిన తీర్పు ఎంత వివాదాస్పదమైందో అందరికీ తెలిసిందే. ఈ మసీదు కింద ఆలయ శిథిలాలు ఉన్నాయని పురావస్తు శాఖ సర్వే ఆధారంగా.. సెల్లార్‌లో హిందువులు పూజలు నిర్వహించుకోవచ్చని కోర్టు ఇచ్చిన అనుమతిపై ముస్లిం నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా తృణమూల్ కాంగ్రెస్ (TMC) నాయకుడు సిద్ధిఖుల్లా చౌదరి తారాస్థాయిలో మండిపడ్డారు. జ్ఞానవాపి మసీదును హిందువులు వెంటనే ఖాళీ చేయాలని కోరిన ఆయన.. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ఓ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సీఎం యోగి బెంగాల్‌కు వస్తే.. తాము అతడ్ని చుట్టుముట్టేస్తామని హెచ్చరించారు.


మసీదులో నిర్వహిస్తున్న పూజలపై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తూ కోల్‌కతాలో జమియాత్ ఉలేమా-ఎ-హింద్ ఓ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో హాజరైన సిద్ధిఖుల్లా చౌదరి మాట్లాడుతూ.. జ్ఞానవాపి మసీదు పూజలు నిర్వహించుకోవచ్చని అనుమతిచ్చిన సీఎం యోగికి ఏమైనా తెలివి ఉందా? అని ప్రశ్నించారు. ఒకవేళ అతను బెంగాల్‌కి వస్తే మాత్రం.. ఇక్కడి నుంచి తిరిగి వెనక్కు పంపించమని హెచ్చరించారు. హిందువులు బలవంతంగా మసీదులో పూజలు చేయడం ప్రారంభించారని, వాళ్లు వెంటనే మసీదుని ఖాళీ చేయాలని కోరారు. తాము ప్రార్థనలు చేసేందుకు ఏ ఆలయానికీ వెళ్లమని, అలాంటప్పుడు హిందువులు ఎందుకు మసీదుకి వస్తున్నారని నిలదీశారు. ఎవరైనా ఈ మసీదుని దేవాలయంగా మార్చాలని చూస్తే తాము ఊరికే ఉండమని హెచ్చరికలు జారీ చేశారు. ఈ జ్ఞానవాపి మసీదు గత 800 సంవత్సరాల నుంచి ఉందని, అలాంటి దాన్ని ఎలా కూల్చివేస్తారని ప్రశ్నించారు.

ఈ విధంగా సిద్ధిఖుల్లా చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ తీవ్రంగా స్పందించారు. టిఎంసి అధినేత్రి, ముఖ్యమంత్రి అయిన మమతా బెనర్జీ నాయకత్వంలో పశ్చిమ బెంగాల్ ఒక నిర్దిష్ట వర్గానికి రక్షణ కవచంలా మారిందని ఆరోపించారు. రోహింగ్యాలకు వాళ్లు రెడ్ కార్పెట్ పరుస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. యోగి ఆదిత్యనాథ్ ఓ సనాతుడని, అలాంటి వ్యక్తిని బెదిరించడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. బెంగాల్‌కు వెళ్లకుండా యోగిని అడ్డుకునే ధైర్యం ఎవరికీ లేదన్నారు.

Updated Date - Feb 10 , 2024 | 06:39 PM