బీజేపీలో టికెట్ల చిచ్చు
ABN , Publish Date - Mar 04 , 2024 | 04:44 AM
బీజేపీలో టికెట్ల చిచ్చు రేగింది. రానున్న లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ప్రకటించిన తొలి జాబితాలో టికెట్ దక్కని పలువురు నాయకులు అలక బూనారు.
టికెట్ ఇవ్వకపోవడంతో కేంద్ర మాజీ మంత్రి అలక
రాజకీయాలకు హర్షవర్ధన్ గుడ్‌బై
న్యూఢిల్లీ, మార్చి 3: బీజేపీలో టికెట్ల చిచ్చు రేగింది. రానున్న లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ప్రకటించిన తొలి జాబితాలో టికెట్ దక్కని పలువురు నాయకులు అలక బూనారు. ప్రధానంగా కేంద్ర ఆరోగ్యశాఖ మాజీ మంత్రి, ఢిల్లీకి చెందిన డాక్టర్ హర్షవర్ధన్ తీవ్రంగా నొచ్చుకున్నారు. ఈ క్రమంలో ఆయన ఏకంగా రాజకీయాలనే వదిలేస్తున్నట్టు ప్రకటించారు. 69 ఏళ్ల హర్షవర్ధన్.. ఢిల్లీలోని చాందినీ చౌక్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీజేపీ తొలి జాబితాలో ఈ సీటును వేరే వారికి కేటాయించడంతో ఆదివారం ఆయన స్పందిస్తూ రాజకీయాల నుంచి తాను విరమించుకుంటున్నట్టు తెలిపారు. గత 30 ఏళ్లకు పైగా తాను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నానని, మొత్తం ఏడు ఎన్నికల్లో(5 సార్లు అసెంబ్లీ, 2 సార్లు లోక్‌సభ) పోటీ చేసి, ప్రతిసారీ భారీ మెజారిటీతో విజయం దక్కించుకున్నట్టు పేర్కొన్నారు. అంతిమంగా తన వైద్య వృత్తి వైపు అడుగులు వేయాలని నిర్ణయించుకున్నట్టు పేర్కొన్నారు. రాజకీయాల్లో తనను ప్రోత్సహించిన ప్రధాని నరేంద్ర మోదీ, సహకరించిన కార్యకర్తలకు హర్షవర్ధన్ ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ తొలి జాబితాలో ఢిల్లీకి చెందిన నలుగురు సిటింగ్ ఎంపీలను పక్కన పెట్టింది. వీరిలో హర్షవర్ధన్‌తోపాటు పర్వేశ్ వర్మ, రమేశ్‌బిధురి, మీనాక్షి లేఖి ఉన్నారు.
పోటీ చేయను: పవన్ సింగ్
టికెట్ ఇచ్చినా పోటీ చేయబోనని పశ్చిమ బెంగాల్‌కు చెందిన బీజేపీ నేత, ప్రముఖ భోజ్‌పురి గాయకుడు, నటుడు పవన్‌సింగ్ వెల్లడించారు. బీజేపీ ప్రకటించిన తొలి జాబితాలో బెంగాల్‌లోని అసన్‌సోల్ నియోజకవర్గం అభ్యర్థిగా పవన్ సింగ్‌ను ప్రకటించారు. అయితే, పవన్ తాను పోటీ చేయబోనని తేల్చి చెప్పారు. కొన్ని కారణాల రీత్యా నేను పోటీ చేయదలుచుకోలేద ని పవన్ సింగ్ ‘ఎక్స్’లో వెల్లడించారు. కాగా, పవన్ నిర్ణయంపై అధికార పార్టీ టీఎంసీ నేతలు ఎద్దేవా చేశారు. ‘‘పోటీకి ముందే చేతులెత్తాశారు’’ అని వ్యాఖ్యలు చేశారు.
బీజేపీకి మోదీ రూ. 2వేల విరాళం
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ విరాళాలకు బీజేపీ పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీకి ‘పార్టీ ఫండ్’గా రూ.2 వేలు విరాళంగా ఇచ్చారు. ఈ విషయాన్ని ఆయన ఆదివారం ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. పౌరులందరూ నమో యాప్ ద్వారా తమకు తోచినంత చందా ఇవ్వాలని, ‘దేశ నిర్మాణం కోసం విరాళం’ (డొనేషన్ ఫర్ నేషన్ బిల్డింగ్)లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరారు. ‘‘వికసిత భారత్ కోసం మన ప్రయత్నాలను బలోపేతం చేయాలి. ఇందుకు ప్రతి పౌరుడు నమో యాప్ ద్వారా విరాళం ఇవ్వాలని కోరుతున్నా’’ అని మోదీ ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు.