Share News

ఎన్నికల బాండ్లపై ఆ వివరాలు చెప్పలేం!

ABN , Publish Date - Apr 03 , 2024 | 03:18 AM

ఎన్నికల బాండ్ల విక్రయాలు, వాటిని నగదుగా మార్చుకోవడానికి సంబంధించిన ప్రామాణిక కార్యాచరణ విధానాన్ని (ఎస్‌వోపీ) వెల్లడించబోమని ఎస్‌బీఐ స్పష్టం చేసింది.

ఎన్నికల బాండ్లపై ఆ వివరాలు చెప్పలేం!

ఆర్టీఐ దరఖాస్తుదారుకు ఎస్‌బీఐ జవాబు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 2: ఎన్నికల బాండ్ల విక్రయాలు, వాటిని నగదుగా మార్చుకోవడానికి సంబంధించిన ప్రామాణిక కార్యాచరణ విధానాన్ని (ఎస్‌వోపీ) వెల్లడించబోమని ఎస్‌బీఐ స్పష్టం చేసింది. ఎన్నికల బాండ్ల పథకాన్ని సుప్రీంకోర్టు రద్దు చేయడంతో ఈ పథకం కింద రాజకీయ పార్టీలకు వచ్చిన వివరాలను ఎన్నికల సంఘం బహిర్గతం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బాండ్ల విక్రయాలకు సంబంధించిన ఎస్‌వోపీని వెల్లడించాలంటూ సామాజిక కార్యకర్త అంజలి భరద్వాజ్‌ ఆర్టీఐ చట్టం కింద దరఖాస్తు చేశారు. ఎన్నికల బాండ్ల విక్రయాలు, వాటిని నగదుగా మార్చుకోవడం కోసం తమ అధీకృత శాఖలకు ఎస్‌బీఐ జారీ చేసిన ఎస్‌వోపీ వివరాలను తెలియజేయాలని కోరారు. అయితే, ఎస్‌వోపీ వివరాలను వెల్లడించేందుకు ఎస్‌బీఐ నిరాకరించింది. ‘‘అది మా అంతర్గత మార్గదర్శకాల కిందకు వస్తుంది. వాణిజ్య, వ్యాపార రహస్యాలు, మేధోపరమైన సంపదకు సంబంధించిన సమాచారాన్ని వెల్లడించకుండా చట్టంలో మినహాయింపులు ఉన్నా యి’’ అని బ్యాంకు స్పష్టం చేసింది. దీనిపై అంజలి స్పందిస్తూ.. ‘‘ఎన్నికల బాండ్లను రాజ్యాంగ విరుద్ధమని చెప్పిన సుప్రీంకోర్టు.. వాటికి సంబంధించిన అన్ని వివరాలను బయటపెట్టాలని ఆదేశించింది. అయినప్పటికీ ఎస్‌బీఐ నిరాకరిస్తోంది’’ అని ఆరోపించారు.

Updated Date - Apr 03 , 2024 | 06:52 AM