Share News

ఈ సారి ‘గాలి మోటార్ల’ హవా!

ABN , Publish Date - Mar 18 , 2024 | 03:36 AM

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలు తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రచారాన్ని హోరెత్తించేందుకు సన్నద్ధమవుతున్నాయి.

ఈ సారి ‘గాలి మోటార్ల’ హవా!

లోక్‌సభ ఎన్నికల్లో ప్రైవేటు విమానాలు, హెలికాప్టర్లకు భారీ డిమాండ్‌

2019తో పోలిస్తే 40% పెరిగే అవకాశం

చార్టర్డ్‌ విమానాలకు గంటకు రూ.5.25 లక్షలు!

హెలికాప్టర్ల అద్దె గంటకు రూ.1.5 లక్షలు

గరిష్ఠంగా రూ.3.5 లక్షలు కూడా..!

న్యూఢిల్లీ, మార్చి 17: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలు తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రచారాన్ని హోరెత్తించేందుకు సన్నద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో ప్రైవేటు విమానాలు, హెలికాప్టర్లకు డిమాండ్‌ భారీగా పెరగనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈ సారి చార్టర్డ్‌ విమానాలు, హెలికాప్టర్లకు డిమాండ్‌ 40 శాతం ఎక్కువగా ఉండొచ్చని చెబుతున్నారు. విమానాలతో పోలిస్తే హెలికాప్టర్లకు అత్యధిక డిమాండ్‌ ఉంటుందంటున్నారు. తక్కువ సమయంలో, మారుమూల ప్రాంతాలకు సైతం వెళ్లగలిగే సౌలభ్యం ఉన్నందున రాజకీయ పార్టీలు హెలికాప్టర్ల వైపే ఎక్కువగా మొగ్గుచూపుతాయని పేర్కొంటున్నారు. అతి త్వరలో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ రానున్న నేపథ్యంలో కొందరు రాజకీయ పార్టీల నేతలు ఇప్పటి నుంచే చార్టర్డ్‌ విమానాలు, హెలికాప్టర్లను అద్దెకు తీసుకుంటారని చెబుతున్నారు. విమానాలు, హెలికాప్టర్లకు గంటల చొప్పున అద్దె వసూలు చేస్తారు. చార్టర్డ్‌ విమానాలకు గంటకు రూ.4.5 నుంచి రూ.5.25 లక్షల వరకు అద్దె ఉంటుందని; హెలికాప్టర్లకు గంటకు రూ.1.5 లక్షల వరకు ఉంటుందని పరిశ్రమ నిపుణులు వెల్లడించారు. హెలికాప్టర్లకు డిమాండ్‌ విపరీతంగా ఉన్న సమయంలో అద్దె గంటకు రూ.3.5 లక్షల వరకూ వసూలు చేస్తారని తెలిపారు.

బీజేపీ 250 కోట్లు.. కాంగ్రెస్‌ 126 కోట్లు!

గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో ప్రైవేటు విమానాలు, హెలికాప్టర్లకు 30-40 శాతం డిమాండ్‌ ఎక్కువగా ఉంటుందని బిజినెస్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ఎండీ ఆర్‌.కె.బాలి చెప్పారు. అధికారిక లెక్కల ప్రకారం 2023 డిసెంబరు నాటికి దేశంలో 112 నాన్‌ షెడ్యూల్డ్‌ ఆపరేటర్స్‌ (ఎన్‌ఎ్‌సవోపీ) ఉన్నారన్నారు. వీరిలో 40-50 శాతం ఆపరేటర్లు కేవలం ఒక్క విమానమే నడుపుతుంటారని తెలిపారు. ఎన్‌ఎ్‌సవోపీలకు విమానాలు, హెలికాప్టర్లు కలిపి మొత్తం 450 వరకు ఉంటాయని అన్నారు. డీజీసీఏ వద్దనున్న సమాచారం మేరకు ఈ ఆపరేటర్ల దగ్గర ఫాల్కన్‌ 2000, బాంబార్డియర్‌ గ్లోబల్‌ 5000, ట్విన్‌ అట్టర్‌ డీహెచ్‌సీ-6-300, హాకర్‌ బీచ్‌క్రా్‌ఫ్ట, గల్ఫ్‌స్ట్రీమ్‌ జీ-200, సెస్నా సైటేషన్‌ 560 ఎక్స్‌ఎల్‌, తదితర విమానాలు, హెలికాప్టర్లు ఉన్నట్లు వివరించారు. వీటిలో 10 సీట్లలోపు సామర్థ్యం ఉన్నవే ఎక్కువని తెలిపారు. రాజకీయ నాయకులు ఎక్కువగా చిన్న పట్టణాలకు కూడా వెళ్తుంటారని, ఆ సమయంలో హెలికాప్టర్లనే ఎక్కువగా అద్దెకు తీసుకుంటారని చెప్పారు. కొందరు నేతలు గంపగుత్తగా (ముందే కొన్ని గంటల పాటు) హెలికాప్టర్లను అద్దెకు తీసుకుంటారన్నారు. కాగా, 2019-20 సంవత్సరానికి గాను విమానం/హెలికాప్టర్ల ప్రయాణాలకు రూ.250 కోట్లు వెచ్చించినట్లు బీజేపీ వార్షిక ఆడిట్‌ గణాంకాల్లో వెల్లడించింది. ఇదేసమయంలో కాంగ్రెస్‌ పార్టీ ఖర్చు రూ.126 కోట్లుగా పేర్కొంది. రాబోయే లోక్‌సభ ఎన్నికల ఖర్చు రూ.1.20 లక్షల కోట్ల వరకు ఉంటుందని సీనియర్‌ ఎన్నికల విశ్లేషకుడు ఎన్‌.భాస్కరరావు తెలిపారు.

Updated Date - Mar 18 , 2024 | 03:37 AM