Share News

‘జంపింగ్‌’ బలం! బీజేడీ మాజీ నేతలకు బీజేపీ టికెట్లు

ABN , Publish Date - Apr 07 , 2024 | 03:15 AM

ఒడిసాలో పాలక బిజూ జనతాదళ్‌ (బీజేడీ) నుంచి వచ్చి చేరిన నేతలనే బీజేపీ నమ్ముకుంది.

‘జంపింగ్‌’ బలం! బీజేడీ మాజీ నేతలకు బీజేపీ టికెట్లు

ఒడిశాలో అధిక ఎంపీ స్థానాలపై కన్ను

24 ఏళ్లుగా సీఎం పదవిలో నవీన్‌

ఆయనకు తొలిసారి గట్టి పోటీ

ఒడిసాలో పాలక బిజూ జనతాదళ్‌ (బీజేడీ) నుంచి వచ్చి చేరిన నేతలనే బీజేపీ నమ్ముకుంది. లోక్‌సభకు, ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఏకకాలంలో జరుగుతున్న ఎన్నికల్లో వారికే పెద్దపీట వేసింది. ముఖ్యంగా శాసనసభ కంటే లోక్‌సభ స్థానాలే ఎక్కువ గెలుచుకోవాలని గట్టి పట్టుదలతో ఉంది. సీఎం నవీన్‌ పట్నాయక్‌కు తొలి నుంచీ చేదోడువాదోడుగా ఉండి పార్టీ బలోపేతానికి తోడ్పడిన భర్తృహరి మెహతాబ్‌, సిద్ధాంత్‌ మొహాపాత్ర, అనుభవ్‌ మొహంతి, ఆకాశ్‌దాస్‌ నాయక్‌, అరిందమ్‌ రాయ్‌, ప్రియదర్శి మిశ్రా, దంబారు సిసా, ప్రదీప్‌ పాణిగ్రాహి, ప్రశాంత జగదేవ్‌ వంటి సీనియర్‌ నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరిలో అత్యధికులు లోక్‌సభకు పోటీచేస్తున్నారు. మరికొందరు ఎమ్మెల్యేలు, నేతలు కూడా బీజేపీలోకి క్యూకట్టి అసెంబ్లీ బరిలో దిగారు. బీజేడీ అధినేత నవీన్‌ 2000వ సంవత్సరం నుంచి 24 ఏళ్లుగా అప్రతిహతంగా సీఎంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇన్నేళ్ల తర్వాత తొలిసారి ఆయనకు గట్టి పోటీ ఎదురవుతోంది. నిన్నమొన్నటిదాకా ఆయనతో పాటు ఉండి బీజేడీని బలోపేతం చేసిన నేతలు ఇప్పుడు బీజేపీ తరఫున బరిలో దిగడమే దీనికి కారణం. నీతి నిజాయితీలకు మారుపేరుగా నిలిచిన నవీన్‌ ప్రభుత్వంపై గత నాలుగేళ్లుగా తీవ్ర అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. సంస్థాగతంగా బీజేడీ బలహీనపడుతోందన్న వాదన పార్టీ నేతల్లోనే వినిపిస్తోంది. ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్న బీజేపీలోకి పలువురు నాయకులు చేరిపోయారు. రాష్ట్రంలో 21 లోక్‌సభ స్థానాలకు గాను గత ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా 8 స్థానాల్లో గెలిచింది. అసెంబ్లీలో మాత్రం 23 సీట్లకే పరిమితమైంది. 12 ఎంపీ స్థానాలు గెలిచిన బీజేడీ.. అసెంబ్లీకి వచ్చేటప్పటికి 147 సీట్లకు గాను ఏకంగా 112 గెలుచుకుంది. ఒడిశాలో మే 13 నుంచి నాలుగు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.

పొత్తు చర్చలు విఫలం..

1998 నుంచి 2009 వరకు ఒడిసాలో బీజేడీ, బీజేపీ కలిసి నడిచాయి. 2009లో తెగతెంపులు చేసుకున్నాయి. మోదీ ప్రధాని అయ్యాక నవీన్‌ పట్నాయక్‌ ఆయనతో సన్నిహితంగా ఉంటున్నారు. పార్లమెంటులో కీలక బిల్లులకు మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలో 15 ఏళ్ల తర్వాత మళ్లీ పొత్తు పెట్టుకోవాలని భావించారు. అయితే బీజేపీ రాష్ట్ర శాఖ అంగీకరించలేదు. బీజేడీ సంస్థాగతంగా బాగా బలహీనపడిందని.. ఈ దఫా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం తథ్యమని అధిష్ఠానానికి నివేదికలు పంపారు. దీంతో పాటు, 15 లోక్‌సభ సీట్లను బీజేపీకి కేటాయించాలన్న డిమాండ్‌కు నవీన్‌ అంగీకరించకపోవడంతో పొత్తు కుదరలేదు.

- సెంట్రల్‌ డెస్క్‌.

Updated Date - Apr 07 , 2024 | 03:15 AM