Share News

అసలు కుంభకోణం ఈడీదే!

ABN , Publish Date - Mar 29 , 2024 | 05:45 AM

రాజకీయాల్లో ఆమ్‌ఆద్మీ పార్టీని లేకుండా చేయాలనే కుట్రతోనే తనను అరెస్టు చేశారని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆరోపించారు. మద్యం విధానం కేసులో వంద కోట్లు చేతులు మారాయన్న ఈడీ ఆరోపణ కూడా అబద్ధమన్నారు. నిజమైతే వంద కోట్లు

అసలు కుంభకోణం ఈడీదే!

బీజేపీ కోసం బలవంతపు వసూళ్ల రాకెట్‌

శరత్‌ రూ.55 కోట్లతో బెయిలు కొన్నాడు

బీజేపీకి బాండ్లు ముట్టాకే బెయిలొచ్చింది

రాజకీయ కుట్రతోనే నన్ను అరెస్టు చేశారు

నలుగురు చెబితే సీఎంను అరెస్టు చేస్తారా?

నన్ను ఇరికించి ఆప్‌ను లేకుండా చేద్దామని ప్లాన్‌

ఈడీ కోర్టులో కేజ్రీవాల్‌ స్వయంగా వాదనలు

ఏప్రిల్‌ 1 వరకూ ఈడీ కస్టడీలోనే సీఎం

జైలు నుంచి పాలనను అడ్డుకోలేమన్న హైకోర్టు

కేజ్రీవాల్‌పై రాష్ట్రపతే తేల్చుకోవాలని స్పష్టీకరణ

కోర్టు ఆదేశాల ప్రకారం జైల్లో వసతుల్లేవ్‌!

ములాఖత్‌లో భర్త దృష్టికి తీసుకొచ్చిన కవిత

న్యూఢిల్లీ, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): రాజకీయాల్లో ఆమ్‌ఆద్మీ పార్టీని లేకుండా చేయాలనే కుట్రతోనే తనను అరెస్టు చేశారని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆరోపించారు. మద్యం విధానం కేసులో వంద కోట్లు చేతులు మారాయన్న ఈడీ ఆరోపణ కూడా అబద్ధమన్నారు. నిజమైతే వంద కోట్లు ఏమయ్యాయో, ఎక్కడున్నాయో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న శరత్‌ చంద్రారెడ్డి బీజేపీకి రూ.55 కోట్లు విరాళంగా ఇచ్చి బెయిల్‌ను కొనుక్కున్నాడని ఆరోపించారు. ఈ దందాకు సంబంధించి తన దగ్గర పూర్తి ఆధారాలున్నాయని ప్రకటించారు. అసలు మనీ ట్రయల్‌ జరిగిందే బీజేపీ, శరత్‌ మధ్య అని చెప్పారు. ఈడీ జోక్యం తర్వాతే కుంభకోణం మొదలైందని వ్యాఖ్యానించారు. బీజేపీ తరఫున ఈడీ బలవంతపు వసూళ్ల రాకెట్‌ను నడుపుతోందని ఆరోపించారు. అరెస్టు తర్వాతే శరత్‌ బీజేపీకి రూ.55 కోట్లు చెల్లించాడన్నారు. ఆ తర్వాతే ఆయనకు బెయిలు ఇచ్చారని ఆరోపించారు. ఈడీకి నచ్చినం త కాలం తనను రిమాండ్‌లో ఉంచుకోవచ్చని కేజ్రీవాల్‌ వ్యాఖ్యానించారు. విచారణకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ఎలాంటి ఆధారాలు లేకున్నా తనను ఇరికించడమే లక్ష్యంగా ఈడీ పని చేస్తోందని ఆరోపించారు. మద్యం కుంభకోణంలో అరెస్టయిన కేజ్రీవాల్‌ను ఈడీ గురువారం ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో హాజరుపరిచింది. మరో వారం రోజుల కస్టడీకి అనుమతించాలని కోరింది. సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా విచారణ నిర్వహించారు. కేజ్రీవాల్‌కు స్వయంగా వాదనలు వినిపించడానికి అవకాశం ఇవ్వాలని ఆయన తరఫున సీనియర్‌ అడ్వొకేట్‌ రమేశ్‌ గుప్తా కోరారు. న్యాయమూర్తి అంగీకరించారు. కేజ్రీవాల్‌కు ఐదు నిమిషాలు అవకాశం ఇచ్చారు. దాంతో కేజ్రీవాల్‌ స్వయంగా హిందీలో వాదనలు వినిపించారు. ఈడీపై పలు కీలక ఆరోపణలు చేశారు. ఈడీ ఫైల్‌లో ఉన్న లక్ష పేజీలు తమకు అనుకూలంగా ఉన్నా రికార్డుల్లోకి తేవడం లేదన్నారు.

సీఎం అరెస్టుకు నలుగురి మాటలు చాలా?

కేజ్రీవాల్‌ మాట్లాడుతుండగా, మధ్యలో ఈడీ న్యాయవాదులు జోక్యం చేసుకోబోగా కోర్టు అనుమతించలేదు. ఈడీ దర్యాప్తు విధానం, అరెస్టులు తదితర అంశాలపై కేజ్రీవాల్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘‘2022 ఆగస్టు 17న సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిం ది. 2022 ఆగస్టు 22న ఈసీఐఆర్‌ నమోదు చేసింది. నన్ను అరెస్టు చేశారు. కానీ ఏ కోర్టు కూడా నన్ను దోషిగా నిర్ధరించలేదు. సీబీఐ 31,000 పేజీలు, ఈడీ 25,000పేజీల సమాచారాన్ని ఈ విషయానికి సంబంధించి కోర్టు ముందు ఉంచాయి. మీరు వాటిని కలిపి చదివారా? అసలు నన్ను ఎందుకు అరెస్టు చేశారు? సిటింగ్‌ సీఎంను అరెస్టు చేయడానికి నలుగురు వ్యక్తులు చేసిన ప్రకటనలు సరిపోతాయా?’’ అని కేజ్రీవాల్‌ న్యాయస్థానాన్ని ప్రశ్నించారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసును ఈడీ తప్పుదారి పట్టిస్తోందని ఆరోపించారు. మనీష్‌ సిసోడియా సమక్షంలో తనకు మద్యం విధాన పత్రాలు ఇచ్చారని సి.అరవింద్‌ చెప్పారని ఈడీ అంటోందని కేజ్రీవాల్‌ ప్రస్తావించారు. ప్రస్తుత సీఎంను అరెస్టు చేయడానికి ఇది కారణం అవుతుందా? అని ప్రశ్నించారు. రోజూ చాలామంది ప్రజాప్రతినిధులు వస్తారని, బయటికొచ్చాక చాలామంది చాలా ప్రకటనలు చేస్తారని కేజ్రీవాల్‌ ప్రస్తావించారు. తనకు వ్యతిరేకంగా మాగుంట శ్రీనివాసులురెడ్డి ఇచ్చి న ప్రకటనను ఆధారంగా చేసుకొని సీఎంను అరెస్టు చేస్తారా?అని ప్రశ్నించారు. మద్యం పాలసీ మీద మాగుంట చాలాసార్లు మాట్లాడారని, ఈ కేసులో ఆయన తనయుడు రాఘవను అరెస్టు చేశాకే, మాట మార్చి తనకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇచ్చారని చెప్పారు. ఇవన్నీ చూస్తుంటే ఈడీ కేవలం తనను ట్రాప్‌ చేయడానికే కంకణం కట్టుకుందని అర్థం అవుతోందన్నారు. మూడు రకాల ప్రకటనలు ఇచ్చినపుడు తనకు వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యం ఒక్కటే ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవరెడ్డి తొలి ఆరు ప్రకటనలు తనకు అనుకూలంగా ఇచ్చారని, మాట మార్చి తనకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వగానే బెయిలు లభించిందని ప్రస్తావించారు. అతని వాంగ్మూలం తన అరెస్టుకు ఎలా ప్రామాణికం అవుతుందన్నారు. చివరగా అరబిందో ఫార్మా డైరెక్టర్‌ శరత్‌ చంద్రారెడ్డి ప్రకటనను తన అరెస్టుకు ప్రాతిపదికగా వాడారన్నారు. ఆయన 2022 నవంబరులో అరెస్టయితే 2023 జూన్‌లో అప్రూవర్‌గా మారారని.. శరత్‌రెడ్డి మొదటి 11 ప్రకటనల్లో తన ప్రస్తావన చేయలేదన్నారు. 12వ ప్రకటనలో కూడా తాను కేజ్రీవాల్‌ను కలిశానని, హడావుడిగా ఉన్న సీఎం ఆప్‌ సమాచార విభాగం అధిపతిగా ఉన్న విజయ్‌నాయర్‌తో టచ్‌లో ఉండాలని చెప్పారని మాత్రమే శరత్‌చంద్రారెడ్డి పేర్కొన్నారని కేజ్రీవాల్‌ గుర్తు చేశారు. శరత్‌చంద్రారెడ్డి ఈ కేసులో అరెస్టయిన తర్వాతే బీజేపీకి రూ.55కోట్ల బాండ్లు కొన్నారని, పచ్చిగా చెప్పాలంటే బెయిలు కొనుక్కున్నారని సీఎం వ్యాఖ్యానించారు. ఈడీ ముడుపుల రాకెట్‌కు ఇంతకన్నా ఆధారాలేం కావాలని ప్రశ్నించారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన సీఎంను అరెస్టు చేసేందుకు ఈ 4 ప్రకటనలు సరిపోతాయా? అని ప్రశ్నించారు.

సౌత్‌ గ్రూప్‌ హవాలాపై ఆధారాలున్నాయ్‌

కేజ్రీవాల్‌ ఆరోపణలను ఈడీ న్యాయవాది ఎస్వీ రాజు ఖండించారు. మద్యం విధానం కుంభకోణంలో స్వీకరించిన లంచాల మొత్తాలను ఆప్‌ గోవా ఎన్నికల్లో వినియోగించిందని రాజు ఆరోపించారు. సౌత్‌ గ్రూప్‌ నుంచి హవాలా రూపంలో డబ్బులు వచ్చాయని చెప్పడానికి ఈడీ దగ్గర సాక్ష్యాలున్నాయన్నారు. మద్యం కుంభకోణానికి బీజేపీకి ఎలక్టోరల్‌ బాండ్ల రూపంలో వచ్చిన రూ.55 కోట్లకు ఏసంబంధంలేదని ఈడీ న్యాయవాది చెప్పారు. సీఎం అయినంత మాత్రాన అరెస్ట్‌ చేయకూడదనిలేదని రాజు కోర్టుకు వివరించారు. సీఎంకు భిన్నమైన ప్రమాణాలులేవని, సామాన్యుల లాగానే సీఎంను అరెస్ట్‌ చేేస అధికారం ఉంద న్నారు. కేజ్రీవాల్‌ తరపు న్యాయవాది రమేశ్‌ గుప్తా స్పందిస్తూ ఎలక్టోరల్‌ బాండ్స్‌తో ఈ కేసుకు సంబంధం లేదంటే దీనిపై కూడా విచారణ జరిపేలా ఈడీకి ఆదేశాలివ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. వాదనలు విన్న స్పెషల్‌ జడ్జి కావేరి బవేజా తీర్పు రిజర్వ్‌ చేశారు. కేజ్రీవాల్‌ వాదనలను లిఖితపూర్వకంగా ఇవ్వాలని ఆదేశించారు. సాయంత్రం 4గంటల తర్వాత ఇచ్చిన ఉత్తర్వుల్లో కేజ్రీవాల్‌కు ఏప్రిల్‌1వరకు ఈడీ కస్టడీకి ఇస్తున్నట్లు వెల్లడించారు. ఆరోజు ఉదయం 11 గంటలకు తన ముందు హాజరుపరచాలని ఆదేశించారు.

కేజ్రీవాల్‌ సహకరించడం లేదు

కేజ్రీవాల్‌ కన్నా ముందు ఈడీ తరపున అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ ఎస్వీ రాజు, సీనియర్‌ న్యాయవాది జోహెబ్‌ హుస్సేన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వాదనలు వినిపించారు. ఎస్వీ రాజు వాదనలు కొనసాగిస్తూ ఈడీ విచారణకు కేజ్రీవాల్‌ సహకరించడంలేదని ఆరోపించారు. ఈ కేసులో గోవాకు చెందిన పలువురికి ఈడీ సమన్లు జారీ చేసిందని చెప్పారు. ఆ వ్యక్తులతో కలిపి కేజ్రీవాల్‌ను విచారించాల్సి ఉందన్నారు. పంజాబ్‌కు చెందిన పలువురు సీనియర్‌ ఎక్సైజ్‌ అధికారులకు ఈడీ సమన్లు జారీ చేసిందని చెప్పారు. కేజ్రీవాల్‌ను 5 రోజులు విచారించి ఆయన చెప్పినవి రికార్డు చేశామని ప్రకటించారు. కేజ్రీవాల్‌ తప్పించుకునే సమాధానాలు చెబుతున్నారని కోర్టుకు నివేదించారు. కేజ్రీవాల్‌ ఉద్దేశపూర్వకంగానే దర్యాప్తునకు సహకరించడంలేదని, ఆదాయ పన్ను రిటర్న్‌ల వివరాలను ఇవ్వడం లేదని చెప్పారు. డిజిటల్‌ పరికరాల పాస్‌వర్డ్‌లను సైతం కేజ్రీవాల్‌ వెల్లడించడంలేదన్నారు.

జైలు నుంచే కేజ్రీవాల్‌ పాలన

కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టులో పెద్ద ఊరట లభించింది. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడాన్ని అడ్డుకోలేమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. కేజ్రీవాల్‌ ముఖ్యమంత్రిగా కొనసాగడానికి ఎలాంటి చట్టపర అడ్డంకులు లేవని తేల్చిచెప్పింది. మద్యం విధానం కేసులో కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్‌ చేసినందున, ఆయనను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. గురువారం ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి, జస్టిస్‌ మన్మోహన్‌, జస్టిస్‌ మన్మీత్‌ ప్రీతమ్‌ సింగ్‌ అరోరాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. కేజ్రీవాల్‌ ముఖ్యమంత్రి పదవిలో కొనసాగడం వల్ల న్యాయ ప్రక్రియకు ఆటంకం కలుగుతుందని పిటిషనర్‌ వాదించగా ధర్మాసనం తోసిపుచ్చింది. పరిపాలన పరమైన అంశాల్లో తాము జోక్యం చేసుకోలేమని, పరిపాలన విభాగం, రాష్ట్రపతి పరిశీలించాలని స్పష్టం చేసింది. ‘‘ఢిల్లీ లెఫ్ట్‌ నెంట్‌ గవర్నర్‌ పరిశీలిస్తున్నట్లు ప్రసార మాధ్యమాల్లో చూశాం. ఇది రాష్ట్రపతి ముందుకు వెళ్లాల్సిన అంశం’’ అని తేల్చిచెప్పింది. ఈ పరిస్థితి గతంలో ఎప్పుడూ ఎదురు కాలేదని, తాము రాజకీయాల్లోకి పోదలచుకోలేదని ప్రకటించింది.

Updated Date - Mar 29 , 2024 | 05:45 AM