సుప్రీం తీర్పు నిర్వీర్యానికి ఎత్తు!
ABN , Publish Date - Mar 06 , 2024 | 03:41 AM
ఎలక్టొరల్ బాండ్లకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిర్వీర్యం చేసేందుకు మోదీ ప్రభుత్వం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎ్‌సబీఐ)ని వాడుకుంటోందని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ఆరోపించారు.

ఎలక్టొరల్ బాండ్ల వివరాలిస్తే గుట్టు రట్టవుతుందని బీజేపీకి భయం.. అందుకే ఎస్‌బీఐపై ఒత్తిడి: ఖర్గే
న్యూఢిల్లీ, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): ఎలక్టొరల్ బాండ్లకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిర్వీర్యం చేసేందుకు మోదీ ప్రభుత్వం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎ్‌సబీఐ)ని వాడుకుంటోందని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ఆరోపించారు. రాజ్యాంగవిరుద్ధమైన ఈ బాండ్ల స్కీంలో ప్రధాన లబ్ధిదారు బీజేపీయేనని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలు నగదు చేసుకున్న ఎలక్టొరల్ బాండ్ల సమగ్ర వివరాలు ఈ నెల 6వ తేదీలోగా సమర్పించాలని సుప్రీంకోర్టు ఎస్‌బీఐని ఆదేశించగా.. జూన్ 30 వరకు గడువివ్వాలని బ్యాంకు సోమవారం కోర్టును ఆశ్రయించడంపై ఖర్గే మంగళవారం ‘ఎక్స్’లో తీవ్రంగా స్పందించారు. సందేహాస్పద లావాదేవీలను కప్పిపుచ్చుకోవడానికి మోదీ సర్కారు ఎస్‌బీఐని కవచంలా వాడుకుంటోందని విమర్శించారు. ‘జూన్ 15లోపు లోక్‌సభ ఎన్నికలు ముగుస్తాయి. ఆ తర్వాతే ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఎస్బీఐ కోర్టుకు అందించాలని బీజేపీ కోరుకుంటోంది. అందుకే జూన్ 30 వరకు ఎస్‌బీఐ గడువు కోరింది. హైవేలు, పోర్టులు, ఎయిర్‌పోర్టులు, పవర్ ప్లాంట్లు తదితర కాంట్రాక్టులను మోదీ అనుకూల పెట్టుబడిదారులకు కట్టబెట్టినందుకు బాండ్ల రూపంలో బీజేపీ సాగించిన అక్రమ లావాదేవీలను ప్రభుత్వం దాచిపెడుతోంది. బాండ్ల డోనర్లకు సంబంధించి 44,434 ఆటోమేటిక్ డేటా ఎంట్రీలను క్రోడీకరించి 24గంటల్లో వివరాలు ఇవ్వొచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి ఎస్‌బీఐ 4నెలలు ఎందుకు అడుగుతోంది? మోదీ సర్కారు సుప్రీం తీర్పును కాలరాయడానికి ఎస్‌బీఐని పావుగా వాడుకుంటోంది’ అని ఖర్గే విరుచుకుపడ్డారు.
బీజేపీకి రూ.6,566 కోట్ల లబ్ధి: కాంగ్రెస్
2017 నుంచి గత ఆర్థిక సంవత్సరం వరకు అన్ని పార్టీలూ మొత్తం రూ.12 వేల కోట్ల విలువ చేసే ఎలక్టొరల్ బాండ్లు అందుకోగా.. అందులో సగానికి పైగా.. రూ.6,566.11 కోట్ల విలువ చేసే బాండ్లు ఒక్క బీజేపీకే వచ్చాయని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనతే ఢిల్లీలో తెలిపారు. ‘‘2018-23 నడుమ కేంద్ర ఏజెన్సీల చర్యలు ఎదుర్కొన్న 30 కంపెనీలు ఆ పార్టీకి రూ.335 కోట్లు విరాళంగా ఇచ్చాయని మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ సమాచారం ఎవరితోనూ పంచుకోవద్దని ఎస్‌బీఐపై మోదీ సర్కారు, బీజేపీ ఒత్తిడి తెస్తున్నాయి’’ అని ఆరోపించారు. ఒక్క క్లిక్‌తో ఐదు నిమిషాల్లో చేతుల్లోకి వచ్చే సమాచారాన్ని కోర్టుకు ఇవ్వడానికి అతిపెద్ద కంప్యూటరైజ్డ్ బ్యాంకుకు 4 నెలల సమయం ఎందుకని నిలదీశారు. 23 వేల బ్రాంచ్‌లు, 48 కోట్ల బ్యాంకు ఖాతాలు, 66 వేల ఏటీఎంలు కలిగి ఉన్న ఎస్‌బీఐకి కేవలం 22,217 ఎలక్టొరల్ బాండ్ల సమాచారం ఇవ్వడానికి నాలుగు నెలలు ఎందుకని ప్రశ్నించారు.
కేంద్రానికి మేలు చేసేందుకే: ప్రశాంత్
ఎన్నికల బాండ్ల వివరాల వెల్లడితో కేంద్ర ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా... దానికి ఎన్నికలయ్యేదాకా సమయం దక్కేందుకే ఎస్‌బీఐ గడువు కోరుతోందని ప్రముఖ లాయర్ ప్రశాంత్ భూషణ్ ‘ఎక్స్’లో మంగళవారం ఆరోపించారు. తద్వారా బీజేపీకి అందిన రూ.10వేల కోట్ల విలువైన ఎన్నికల బాండ్ల వివరాలు వెంటనే బయటకు రాకుండా చూస్తుందన్నారు. ఎన్నికల బాండ్లు కొన్నవారు, వాటిని తీసుకున్న రాజకీయ పార్టీలకు సంబంధించి ఎస్‌బీఐ ఒక రహస్య సంఖ్యను నిర్వహిస్తుందని తెలిపారు.