Share News

మంత్రిని తొలగించే అధికారం గవర్నర్‌కు లేదు

ABN , Publish Date - Jan 06 , 2024 | 04:35 AM

ముఖ్యమంత్రి సిఫారసు లేకుండా ఏ మంత్రినీ తొలగించే అధికారం గవర్నర్‌కు లేదంటూ మద్రాసు హైకోర్టు వెలువరించిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది.

మంత్రిని తొలగించే అధికారం గవర్నర్‌కు లేదు

స్పష్టం చేసిన సుప్రీంకోర్టు

చెన్నై, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి సిఫారసు లేకుండా ఏ మంత్రినీ తొలగించే అధికారం గవర్నర్‌కు లేదంటూ మద్రాసు హైకోర్టు వెలువరించిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. తమిళనాడులో అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో సెంథిల్‌బాలాజీ రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కొందరికి ఆ శాఖలో ఉద్యోగాలు ఇప్తిస్తానంటూ లక్షలాది రూపాయలు వసూలు చేసి మోసగించారనే నేరారోపణలపై ఈడీ ఆయనపై కేసు నమోదు చేసి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో సెంథిల్‌బాలాజీ తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరి ఓపెన్‌హార్ట్‌ సర్జరీ చేసుకుని కోలుకున్న తర్వాత పుళల్‌ సెంట్రల్‌ జైలుకు తరలించారు. సెంథిల్‌బాలాజీ అనారోగ్య కారణాల దృష్ట్యా ఆయన్ని శాఖ లేని మంత్రిగా కొనసాగిస్తూ గతేడాది జూన్‌ 16న ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. అదే రోజున సెంథిల్‌బాలాజీని శాఖ లేని మంత్రిగా కొనసాగించేందుకు వీలులేదంటూ రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి డిస్మిస్‌ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే కొద్దిసేపటికే మళ్లీ ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకున్నారు. ఈ పరిస్థితుల్లో సెంథిల్‌బాలాజీని శాఖ లేని మంత్రిగా కొనసాగిస్తూ ప్రభుత్వం వెలువరించిన ఉత్తర్వులను, గవర్నర్‌ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ న్యాయవాది ఎంఎల్‌ రవి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు శాఖ లేని మంత్రిగా సెంథిల్‌బాలాజీని కొనసాగించాలా వద్దా అనే విషయంపై తుది నిర్ణయం ముఖ్యమంత్రిదేనని స్పష్టం చేసింది. దీనిపై సుప్రీంకోర్టులో అప్పీలు పిటిషన్‌ దాఖలైంది. ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. సీఎం అనుమతి, సిఫారసు లేకుండా ఏ మంత్రినీ రాష్ట్ర గవర్నర్‌ తొలగించే ఆస్కారమే లేదని, ఆ అధికారం వారికి లేదని స్పష్టం చేసింది.

Updated Date - Jan 06 , 2024 | 06:32 AM