Share News

భూకంప మృతులు 55

ABN , Publish Date - Jan 03 , 2024 | 03:57 AM

ద్వీప దేశం జపాన్‌లో భూకంపం మృతుల సంఖ్య భారీగానే ఉంది. 55 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తేలింది.

భూకంప మృతులు 55

జపాన్‌లో ఒక్క రోజులోనే 155 ప్రకంపనలు

వేలాదిమంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు

వాజిమాలోని ఒకే వీధిలో 200 ఇళ్లు దగ్ధం

ఇషికావాలో అంధకారంలో 45 వేల నివాసాలు

టోక్యో, జనవరి 2: ద్వీప దేశం జపాన్‌లో భూకంపం మృతుల సంఖ్య భారీగానే ఉంది. 55 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తేలింది. కొత్త సంవత్సరం తొలి రోజున పశ్చిమ తీర ప్రాంతంలో సంభవించిన ఈ విపత్తులో మరణాలు ఇంకా పెరిగే ప్రమాదం ఉందని అంచనా. సోమవారం ఒక్క రోజే 155 ప్రకంపనలు నమోదైనట్లు తేలింది. వీటిలో ఒకదాని తీవ్రత గరిష్ఠంగా 7.6 కాగా, మిగతావి 3 నుంచి 6 మధ్యన ఉన్నట్లు జపాన్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. మంగళవారం కూడా ఆరుసార్లు భూమి కంపించింది. వీటిలో ఒకదాని తీవ్రత 5.6గా ఉంది. భూకంప కేంద్రం ఇషికావా, మరికొన్ని ప్రభావిత ప్రాంతాల్లో 45 వేల ఇళ్లు అంధకారంలో ఉన్నాయి. వాజిమాలోని అసైచి వీధిలో ప్రకంపనల కారణంగా భారీ అగ్ని ప్రమాదం జరిగి 200 ఇళ్లు దగ్ధమయ్యాయి. కాగా, వేలాదిమందిని ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలించింది. సైన్యం పెద్దఎత్తున సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమైంది. రోడ్లు దెబ్బతినడం, తీరంలోని కీలక విమానాశ్రయం రన్‌ వేకు పగుళ్లు రావడంతో సహాయ చర్యలకు ఇబ్బంది ఎదురవుతోంది. దేశంలోని పలు జాతీయ రహదారులు సహా ప్రధాన రహదారులను ఇంకా మూసే ఉంచారు. చాలా రైల్‌, విమాన సర్వీసులను పునరుద్ధరించలేదు. ప్రభుత్వ యంత్రాంగం విపత్తు నష్టాన్ని అంచనా వేసే పనిలో ఉంది. మారుమూల నోటో ద్వీపంలో తాగేందుకు మంచినీరు కూడా లేదు. భవనాలు దగ్ధమయ్యాయి. కొన్ని కూలిపోయాయి. చేపల వేటకు వాడే బోట్లు కొట్టుకుపోయాయి. ఎగసిన అలలకు సుజు నగరంలోనూ కార్లు, పడవలు సముద్రంలోకి కొట్టుకుపోయాయి.

మరిన్ని శక్తిమంతమైన ప్రకంపనల హెచ్చరిక

రాబోయే రోజుల్లో మరిన్ని శక్తిమంతమైన ప్రకంపనలు వచ్చే ముప్పుందని.. జాగ్రత్తగా ఉండాలని జపాన్‌ ప్రభుత్వం హెచ్చరించింది. సోమవారమే రష్యా, ఉత్తర, దక్షిణ కొరియాలు సునామీ హెచ్చరికలను జారీ చేయగా.. దక్షిణ కొరియా తూర్పు తీరాన్ని 3.3 అడుగుల సునామీ అల తాకినట్లు అధికారులు చెప్పారు.

Updated Date - Jan 03 , 2024 | 03:57 AM