Indore and Surat : అత్యంత పరిశుభ్ర నగరాలు ఇండోర్, సూరత్
ABN , Publish Date - Jan 12 , 2024 | 05:49 AM
దేశంలోనే అత్యంత్య పరిశుభ్ర నగరాలుగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్, గుజరాత్‌లోని సూరత్ నిలిచాయి. ఏడేళ్లుగా క్లీన్ సిటీగా అవార్డు దక్కించుకుంటున్న ఇండోర్ ఈ ఏడాది కూడా సూరత్‌తో కలిసి సంయుక్తంగా ఆ బహుమతి అందుకుంది.

జీహెచ్‌ఎంసీకి 9వ ర్యాంకు
ఢిల్లీలో స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల ప్రదానోత్సవం
న్యూఢిల్లీ, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): దేశంలోనే అత్యంత్య పరిశుభ్ర నగరాలుగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్, గుజరాత్‌లోని సూరత్ నిలిచాయి. ఏడేళ్లుగా క్లీన్ సిటీగా అవార్డు దక్కించుకుంటున్న ఇండోర్ ఈ ఏడాది కూడా సూరత్‌తో కలిసి సంయుక్తంగా ఆ బహుమతి అందుకుంది. కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని భారత్ మండపంలో గురువారం స్వచ్ఛ సర్వేక్షణ్- 2023 అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. నవీ ముంబై అత్యంత్య పరిశుభ్రత నగరాల జాబితాలో మూడోస్థానంలో నిలిచింది. లక్షలోపు జనాభా ఉన్న పట్టణాల కేటగిరిలో సస్వాద్, పటాన్, లోనావాలా వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. పరిశుభ్రమైన గంగా పట్టణాల్లో వారణాసి, ప్రయాగ్ రాజ్ ప్రథమ, ద్వితీయ అవార్డులు గెలుచుకున్నాయి. ఉత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాలలో మహారాష్ట్ర మొదటిస్థానంలో నిలిచింది. మధ్యప్రదేశ్, ఛత్తీ్‌సగఢ్ తర్వాతి స్థానాలలో నిలిచాయి. లక్ష జనాభా పైబడిన నగరాల కేటగిరీలో గ్రేటర్ హైదరాబాద్ 9వ ర్యాంకును సాధించింది. కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి హరీదీప్ సింగ్ పురీ చేతుల మీదుగా జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, శానిటేషన్ అడిషనల్ కమిషనర్ ఉపేందర్‌రెడ్డి ఈ అవార్డును అందుకున్నారు. ఈ పోటీల్లో తెలంగాణ రాష్ట్రం మొత్తం నాలుగు అవార్డులను దక్కించుకుంది. గుండ్లపోచంపల్లి (లక్ష కంటే తక్కువ జానాభా), నిజాంపేట (25-50 వేల జనాభా), సిద్దిపేట (50 వేలు-లక్ష జనాభా) పరిశుభ్రమైన పట్టణాల జాబితాలో నిలిచాయి. జీహెచ్‌ఎంసీకి అవార్డు రావడం పట్ల హైదరాబాద్ ఇంచార్జీ మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు.