తెలుగువారు వలస వచ్చిన వాళ్లు కాదు
ABN , Publish Date - Nov 13 , 2024 | 05:45 AM
తెలుగువారు తమిళనాడుకు వలసవచ్చిన వారు కాదని, రాష్ట్రాభివృద్ధిలో వారి క్రియాశీలకమైన భాగస్వామ్యం ఉందని మద్రాసు హైకోర్టు వ్యాఖ్యానించింది. చెన్నపట్నంలో తెలుగువారి ప్రాబల్యం ఎక్కువగా ఉందని, అలాంటి వారిని ఎలా

తమిళనాడు అభివృద్ధిలో వారిది క్రియాశీలక పాత్ర
నటి కస్తూరి వ్యాఖ్యలపై మద్రాస్ హైకోర్టు
చెన్నై, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): తెలుగువారు తమిళనాడుకు వలసవచ్చిన వారు కాదని, రాష్ట్రాభివృద్ధిలో వారి క్రియాశీలకమైన భాగస్వామ్యం ఉందని మద్రాసు హైకోర్టు వ్యాఖ్యానించింది. చెన్నపట్నంలో తెలుగువారి ప్రాబల్యం ఎక్కువగా ఉందని, అలాంటి వారిని ఎలా వేరుచేసి చూడగలమని న్యాయమూర్తి జస్టిస్ ఆనంద్ వెంకటేశ్ నేతృత్వంలోని మద్రాస్ హైకోర్టు మదురై ధర్మాసనం ప్రశ్నించింది. ఇటీవల ఓ సభలో నటి కస్తూరి తెలుగువారినుద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై పలు తెలుగు సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలు వ్యక్తం చేయగా, చెన్నై, మదురై, సేలం తదితర ప్రాంతాల్లో పోలీసులు కస్తూరిపై ఆరు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆమెను అదుపులోకి తీసుకునేందుకు రెండు ప్రత్యేక బృందాలు కూడా ఏర్పాటయ్యాయి. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోరుతూ కస్తూరి మదురై బెంచ్‌లో పిటిషన్ దాఖలు చేయగా దానిపై మంగళవారం విచారణ జరిగింది. కస్తూరి తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ కస్తూరి తన వ్యాఖ్యలపై క్షమాపణ తెలిపారని, అయినా రాజకీయ దురుద్దేశంతో కేసులు నమోదు చేశారని చెప్పారు. ధర్మాసనం తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.