Share News

తమిళనాట త్రిముఖ పోరు

ABN , Publish Date - Apr 04 , 2024 | 04:10 AM

ఎన్నికల వ్యూహరచనలో ఎప్పుడూ ముందుండే అన్నాడీఎంకే ఈసారి కాస్త డీలా పడినట్లు కనిపిస్తోంది. పొత్తులు, సీట్ల సర్దుబాటు కాస్త ఆలస్యంగా ముగించిన ఆ పార్టీ అధినేత ఎడప్పాడి పళనిస్వామి.

తమిళనాట త్రిముఖ పోరు

(చెన్నై-ఆంధ్రజ్యోతి)

లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాట త్రిముఖ పోటీ నెలకొంది. డీఎంకే నేతృత్వంలోని ఇండియా కూటమి, విపక్ష అన్నాడీఎంకే కూటమి, బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి పోరుకు సిద్ధమయ్యాయి. గత ఎన్నికల్లో రాష్ట్రంలోని 39 స్థానాలకు గాను 38 సీట్లు సొంతం చేసుకున్న డీఎంకే కూటమి ఈసారి కూడా అదే ప్రాభవాన్ని చాటేందుకు ఉవ్విళ్లూరుతోంది. ముందుగానే పొత్తులు ఖరారు కావడం, పాత స్నేహితులే ఈసారీ జట్టులో నిలవడం, సంప్రదాయ ఓటు బ్యాంకు తదితరాలు కూటమికి బలంగా మారాయి. దీనికితోడు స్టాలిన్‌ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు తమకు విజయం సాధించిపెడతాయని ఆ కూటమి నేతలు గట్టిగా భావిస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో మొత్తం 39 స్థానాలు సాధించుకుంటామని ఆ కూటమి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

స్పీడు పెంచిన పళనిస్వామి

ఎన్నికల వ్యూహరచనలో ఎప్పుడూ ముందుండే అన్నాడీఎంకే ఈసారి కాస్త డీలా పడినట్లు కనిపిస్తోంది. పొత్తులు, సీట్ల సర్దుబాటు కాస్త ఆలస్యంగా ముగించిన ఆ పార్టీ అధినేత ఎడప్పాడి పళనిస్వామి.. వెంటనే వేగం పుంజుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తమకున్న సంప్రదాయ ఓటుబ్యాంకు ఈసారి అండగా నిలుస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. దీనికితోడు దివంగత నటుడు విజయకాంత్‌ స్థాపించిన డీఎండీకేతో పొత్తు అన్నాడీఎంకేకు ప్లస్‌గా మారే సూచనలు కనిపిస్తున్నాయి. దీనికితోడు పళనిస్వామికి చెందిన దేవర్‌ సామాజిక వర్గం అన్నాడీఎంకేకు అండగా ఉంది. ఈ ఎన్నికల్లో కనీసం 10-12 స్థానాలు సాధించుకుంటామని, అదే జరిగితే 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటుచేయడం ఖాయమని సీనియర్లు పేర్కొంటున్నారు. స్టాలిన్‌ కేబినెట్‌లోని కొందరు మంత్రులు అవినీతి కేసుల్లో ఇరుక్కుపోవడం, ప్రభుత్వానికీ అవినీతి మకిలి అంటుతున్నట్లు జరుగుతున్న ప్రచారం తమకు ఓట్లు సాధించిపెడతాయని భావిస్తున్నారు.

ఓట్ల శాతం పెంచుకోవడమే లక్ష్యంగా...

వన్నియార్లలో గణనీయ ఓటు బ్యాంకు కలిగిన పీఎంకేను జత చేర్చుకుని, జోష్‌లో కనిపిస్తున్న బీజేపీ.. ఈసారి ఎన్నో కొన్ని స్థానాలు సంపాదించుకోవడంతో పాటు ఓట్ల శాతం పెంచుకోవాలని పట్టుదలగా ఉంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై, మాజీ అధ్యక్షుడు డాక్టర్‌ ఎల్‌.మురుగన్‌ (కేంద్ర మంత్రి), డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ (మాజీ గవర్నర్‌), పొన్‌ రాధాకృష్ణన్‌ (కేంద్ర మాజీ మంత్రి) తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. డీఎంకే ప్రభుత్వం హిందూ ఆలయాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని, అవినీతి బురదలో కూరుకుపోయిందని విస్తృతంగా చేపట్టిన తమ ప్రచారం ఓట్లు సంపాదించిపెడుతుందని కమలనాథులు బలంగా నమ్ముతున్నారు. దీనికితోడు తమిళ సంస్కృతి సంప్రదాయాలు, భాషను ప్రధాని మోదీ ప్రతిసారీ విపరీతంగా పొగుడుతుండటం, తరచుగా రాష్ట్ర పర్యటనలకు వస్తుండటం తమకు ఓటు శాతం పెంచుతుందని విశ్వసిస్తున్నారు. ప్రముఖ నటుడు శరత్‌కుమార్‌ దంపతులు తమ పార్టీని బీజేపీలో విలీనం చేయడం, అన్నాడీఎంకే ఓట్లను గణనీయంగా చీల్చగలిగిన మాజీ సీఎం ఒ.పన్నీర్‌సెల్వం, శశికళ సమీప బంధువు, అమ్మా మక్కల్‌ మున్నేట్ర కళగం అధినేత టీటీవీ దినకరన్‌ వంటివారు తమ కూటమిలో చేరడంతో ఈసారి తమ ఓటు బ్యాంకు పెరుగుతుందని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. కాగా.. ఒకప్పుడు జయలలిత మాటున అన్నాడీఎంకేను శాసించి, ఆనక పార్టీ నుంచి బహిష్కృతురాలై, జైలుపాలై.. ఏకాకిగా మిగిలిన చిన్నమ్మ శశికళ.. ఈ ఎన్నికల్లో ఏం చేయబోతున్నారన్నది ఆసక్తిగా మారింది. చిన్నమ్మ నుంచి ఎలాంటి సంకేతాలు వెలువడకపోవడంతో ఆమె అనుచర గణం డైలమాలో పడ్డారు.

Updated Date - Apr 04 , 2024 | 04:21 AM