తమిళ సినీ నిర్మాత
ABN , Publish Date - Mar 10 , 2024 | 04:11 AM
మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులో తమిళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాత జాఫర్ సాధిక్‌ను నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) అరెస్టు చేసింది.
జాఫర్ సాదిక్ అరెస్టు రూ.2 వేల కోట్ల డ్రగ్స్ స్మగ్లింగ్ ఆరోపణలు
జాఫర్.. డీఎంకే మాజీ నాయకుడు
చెన్నై, మార్చి 9 (ఆంరధజ్యోతి): మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులో తమిళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాత జాఫర్ సాధిక్‌ను నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) అరెస్టు చేసింది. ఈ విషయాన్ని ఎన్‌సీబీ జాయింట్ డైరెక్టర్ జనరల్ ఙ్ఞానేశ్వర్ సింగ్ శనివారం ఢిల్లీలో మీడియాకు వెల్లడించారు. భారత్ నుంచి ఆస్ర్టేలియా, న్యూజిలాండ్ దేశాలకు రూ.2 వేల కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను స్మగ్లింగ్ చేసినట్టు జాఫర్‌పై ఆరోపణలున్నాయి. డీఎంకే మాజీ నాయకుడైన జాఫర్ గతనెల 15వ తేదీ నుంచి పరారీలో ఉన్నాడని జ్ఞానేశ్వర్ సింగ్ చెప్పారు. తిరువనంతపురం, ముంబై, పుణె, హైదరాబాద్‌ల మీదుగా జైపూర్‌కు పారిపోయాడన్నారు. భారత్-ఆస్ర్టేలియా-న్యూజిలాండ్ మాదకద్రవ్యాల స్మగ్లింగ్ నెట్‌వర్క్‌లో అతనే కీలక సూత్రధారి అని చెప్పారు. కొబ్బరికాయలు, డ్రైఫ్రూట్స్ ముసుగులో 45 పార్సిళ్లలో మొత్తం 3,500 కిలోల సూడోపెడ్రిన్‌ను ఆస్ర్టేలియాకు పంపించాడన్నారు. ఇదే కేసులో గత నెల 25వ తేదీన ముగ్గురిని అరెస్టు చేసినట్టు చెప్పారు. కాగా, అధికార పార్టీ డీఎంకే తమిళనాడును భారతదేశ మాదకద్రవ్యాల రాజధానిగా మార్చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై మండిపడ్డారు. డీఎంకే నేతల ఇళ్లు, ఆఫీసుల్లో ఎన్‌సీబీ సోదాలు చేస్తోందని చెప్పారు.