Share News

Supreme Court : శ్రీకృష్ణ జన్మభూమి సర్వేపై సుప్రీం స్టే

ABN , Publish Date - Jan 17 , 2024 | 04:03 AM

మథురలో శ్రీకృష్ణ జన్మభూమిని ఆనుకొని ఉన్న షాహీ ఈద్గా మసీదు కాంప్లెక్స్‌లో శాస్త్రీయ సర్వే జరపాలంటూ అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు మంగళవారం స్టే విధించింది. కోర్టు కమిషనర్‌ ..

 Supreme Court  : శ్రీకృష్ణ జన్మభూమి సర్వేపై సుప్రీం స్టే

అలహాబాద్‌ హైకోర్టు ఆదేశాల నిలుపుదల

కోర్టు కమిషనర్‌ నియామకం వద్దని ఆదేశం

అభ్యంతరాలపై 23లోగా సమాధానం

ఇవ్వాలని హిందూ పక్షాలకు సూచన

న్యూఢిల్లీ, జనవరి 16: మథురలో శ్రీకృష్ణ జన్మభూమిని ఆనుకొని ఉన్న షాహీ ఈద్గా మసీదు కాంప్లెక్స్‌లో శాస్త్రీయ సర్వే జరపాలంటూ అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు మంగళవారం స్టే విధించింది. కోర్టు కమిషనర్‌ పర్యవేక్షణలో సర్వే జరిపించేందుకు అంగీకారం తెలుపుతూ గత నెల 14న అలహాబాద్‌ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. మందిరాన్ని కూలగొట్టి మసీదు నిర్మించారంటూ హిందూ పక్షం చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. ఆ విషయాన్ని తేల్చేందుకు న్యాయస్థానం పర్యవేక్షణలో కోర్టు కమిషనర్‌ ద్వారా సర్వే జరిపించేందుకు అమోదం తెలిపింది. ఆ సర్వేను మరో ముగ్గురు న్యాయవాదుల బృందం పరిశీలిస్తుందని కూడా తెలిపింది. కట్టడానికి ఎలాంటి హాని జరగకుండా సర్వే జరపాలని స్పష్టం చేసింది. దీనిని సవాలు చేస్తూ ముస్లిం పక్షం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాల ధర్మాసనం..సర్వే నిర్వహించకుండా స్టే విధించింది. అయితే ఇదే అంశంపై హైకోర్టులో దాఖలైన ఇతర కేసులు కొనసాగుతాయని స్పష్టం చేసింది. హిందూ పక్షం దాఖలు చేసిన పిటిషన్‌ విచారణార్హతను సవాలు చేస్తూ ముస్లిం పక్షం వేసిన కేసుపైనా ముందుకు వెళ్లవచ్చని తెలిపింది. కోర్టు కమిషనర్‌ను నియమించాలంటూ హిందూ పక్షం దాఖలు చేసిన పిటిషన్‌లో అస్పష్టత ఉందని, ఆ కారణంగానే స్టే విధిస్తున్నట్టు తెలిపింది. తొలుత మసీదు నిర్వహణ కమిటీ తరఫున తస్నీం అహ్మది వాదనలు వినిపిస్తూ ప్రార్థనా స్థలాల చట్టం-1991కి వ్యతిరేకంగా దాఖలైన హిందూ పిటిషన్‌ మీద అలహాబాద్‌ హైకోర్టు అలాంటి ఆదేశాలు ఇచ్చి ఉండాల్సింది కాదన్నారు.

క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లోని ఆర్డ్డర్‌ 7 రూల్‌ 11 ప్రకారం ఆ వ్యాజ్యానికి విచారణార్హత లేదంటూ దాఖలైన మరో పిటిషన్‌ హైకోర్టులోనే పెండింగ్‌లో ఉందని, అలాంటప్పుడు కూడా సర్వే జరపాలంటూ ఆదేశాలు ఇవ్వలేదని చెప్పారు. కృష్ణుడు జన్మించిన కారాగారాన్ని కూలగొట్టి మసీదు నిర్మించారన్నది ఊహాగానమేనని, అందుకు ఎలాంటి కనీస ఆధారాలు చూపలేదని ముస్లిం పక్షం తన పిటిషన్‌లో తెలిపింది. వాదనలు విన్న ధర్మాసనం..ఈ అంశంలో లీగల్‌ సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపింది. వాటిని పరిశీలించాల్సి ఉందని పేర్కొంది. అందువల్ల కమిషనర్‌ నియామకంపై స్టే విధిస్తున్నట్టు తెలిపింది. ఇందుకు హిందూ పక్షం న్యాయవాది దివాన్‌ అభ్యంతరం చెప్పారు. సర్వేపై విధివిఽధానాలు రూపొందించేందుకు హైకోర్టుకు అనుమతి ఇవ్వాలని కోరారు. దాంతో దీనిపై అభిప్రాయాలు చెప్పాలంటూ హిందూ పక్షానికి నోటీసులు పంపిస్తామని ధర్మాసనం తెలిపింది. ఈనెల 23లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఈ వివాదానికి సంబంధించి అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన మరో ఆదేశాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యం కూడా సుప్రీంకోర్టు వద్ద పెండింగ్‌లో ఉంది. మందిర్‌-మసీదు సమస్యపై మథుర హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలు కాగా వాటన్నింటినీ తనకు బదిలీ చేసుకుంటూ గతేడాది మే 26న అలహాబాద్‌ హైకోర్టు ఆదేశాలిచ్చింది. దాన్ని సవాలు చేస్తూ మసీదు నిర్వహణ కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

జ్ఞాన్‌వాపీ నీటి కొలను శుభ్రతకు సుప్రీంకోర్టు అనుమతి

వారాణసిలోని జ్ఞాన్‌వాపీ మసీదు ఆవరణలో ఉన్న వజూఖానా (నీళ్ల తొట్టె) పరిశుభ్రతకు మంగళవారం సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. జిల్లా కలెక్టర్‌ పర్యవేక్షణలోనే ఈ కార్యక్రమం జరగాలని స్పష్టం చేసింది. యూపీ ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ మాధవీ దివాన్‌ వాదనలు వినిపిస్తూ కొలనులో చనిపోయిన చేపలు ఉన్నాయని, అందువల్ల దాన్ని శుభ్రం చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ఇలాంటి విజ్ఞప్తి చేస్తూ మసీదును నిర్వహిస్తున్న కమిటీ కూడా వారణాసి కోర్టులో పిటిషన్‌ వేసిందని గుర్తు చేసింది. మందిరాన్ని కూలగొట్టి మసీదును నిర్మించారా, లేదా అని తెలుసుకోవడా నికి జ్ఞాన్‌వాపీలో శాస్త్రీయ సర్వే జరపాలని గతేడాది జులై 21న వారణాసి జిల్లా కోర్టు ఆదేశించింది. వజూఖానాలో ‘శివలింగం’లాంటి వస్తువు దొరకడంతో ఆ నీటితొట్టెను మినహాయించి మిగిలిన ప్రాంతంలో సర్వే జరపాలంది. అప్పటి నుంచి దాన్ని శుభ్రపరచకపోవడంతో కోర్టు అనుమతి తీసుకోవాల్సి వచ్చింది.

Updated Date - Jan 17 , 2024 | 04:03 AM