Share News

Bilkis Bano Case: బిల్కిస్ బానో కేసు దోషులకు ఎదురుదెబ్బ.. సమయం ఇచ్చేదిలేదన్న సుప్రీంకోర్టు

ABN , Publish Date - Jan 19 , 2024 | 05:03 PM

తమకు లొంగిపోవడానికి మరింత సమయం కావాలంటూ పిటిషన్లు వేసిన బిల్కిస్ బానో కేసు దోషులకు సుప్రీంకోర్టు షాకిచ్చింది. వారి పిటిషన్లను తిరస్కరిస్తూ.. ఆదివారం నాటికి వాళ్లంతా జైలు అధికారుల ముందు లొంగిపోవాలని ఆదేశించింది. జస్టిస్ బీవీ నాగరత్న నేతృత్వంలోని బెంచ్ ఈ మేరకు శుక్రవారం తీర్పునిచ్చింది.

Bilkis Bano Case: బిల్కిస్ బానో కేసు దోషులకు ఎదురుదెబ్బ.. సమయం ఇచ్చేదిలేదన్న సుప్రీంకోర్టు

తమకు లొంగిపోవడానికి మరింత సమయం కావాలంటూ పిటిషన్లు వేసిన బిల్కిస్ బానో కేసు దోషులకు సుప్రీంకోర్టు షాకిచ్చింది. వారి పిటిషన్లను తిరస్కరిస్తూ.. ఆదివారం నాటికి వాళ్లంతా జైలు అధికారుల ముందు లొంగిపోవాలని ఆదేశించింది. జస్టిస్ బీవీ నాగరత్న నేతృత్వంలోని బెంచ్ ఈ మేరకు శుక్రవారం తీర్పునిచ్చింది. ఫ్యామిలీ వెడ్డింగ్స్‌కు హాజరు కావడం దగ్గర నుంచి పంట కాలం వరకు.. తమకు కొన్ని కుటుంబ బాధ్యతలున్నాయని, కాబట్టి లొంగపోయేందుకు సమయం ఇవ్వాలని కోరుతూ దోషులు వేసిన పిటిషన్లు విచారణకు అర్హత లేనివని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. ఆదివారంలోపు లొంగిపోవాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారు.


కాగా.. 2002లో గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్‌ బానో కుటుంబానికి చెందిన ఏడుగురిని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఆ ఏడుగురిలో ఆమె మూడేళ్ల కుమార్తె కూడా ఉంది. అలాగే.. ఆ సమయంలో ఐదు నెలల గర్భిణిగా ఉన్న బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో మొత్తం 11 మంది దుండుగులు దోషులుగా తేలారు. వాళ్లు 15 ఏళ్లపాటు జైలుజీవితం గడిపారు. అయితే.. 2022లో ఈ దోషులకు గుజరాత్‌ ప్రభుత్వం రెమిషన్‌ మంజూరు చేసింది. దీంతో.. అదే ఏడాదిలో ఆగస్టు 15వ తేదీన వాళ్లు జైలు నుంచి విడుదల అయ్యారు. వీరి విడుదలని సవాల్ చేస్తూ.. సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. జనవరి 8వ తేదీన వారి విడుదల చెల్లదని, రెండు వారాల్లోగా లొంగిపోవాలని ఆదేశించింది. తాజాగా గడువు కావాలంటూ దోషులు వేసిన పిటిషన్‌ని తిరస్కరిస్తూ.. పైవిధంగా తీర్పునిచ్చింది.

ఇదిలావుండగా.. 2022 ఆగస్టు 15వ తేదీన దోషులు జైలు నుంచి విడుదల అయినప్పుడు, వాళ్లేదో ఈ దేశానికి గొప్ప పని చేసినట్లు ఓ వర్గం వారు ఘనస్వాగతం పలికారు. అంతేకాదు.. బీజేపీ ఎంపీతో పాటు ఓ ఎమ్మెల్యేతో వేదిక వీళ్లు వేదిక కూడా పంచుకున్నారు. అంతకుముందు.. ఈ రేపిస్టులు, హంతకులను గుజరాత్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్యానెల్ ‘సంస్కారీ బ్రాహ్మణులు’గా ప్రకటించడం మరింత సిగ్గుచేటు.

Updated Date - Jan 19 , 2024 | 05:03 PM