Amit Shah : ఉగ్రవాదులను అణచివేయండి
ABN , Publish Date - Jun 17 , 2024 | 06:12 AM
ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపా లని, జమ్మూ ప్రాంతంలో పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా భద్రతా బలగాలను ఆదేశించారు. ఉగ్రవాద ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో పట్టు సాధించే విధానం ద్వారా కశ్మీర్ లోయలో ఉగ్రవాదులను విజయవంతంగా

పక్కా ప్రణాళికతో ముందుకెళ్లండి
భద్రతా బలగాలకు అమిత్ షా ఆదేశం
జమ్మూకశ్మీర్‌లో భద్రతా పరిస్థితులపై సమీక్ష జరిపిన కేంద్ర హోం మంత్రి
న్యూఢిల్లీ, జూన్ 16: ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపా లని, జమ్మూ ప్రాంతంలో పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా భద్రతా బలగాలను ఆదేశించారు. ఉగ్రవాద ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో పట్టు సాధించే విధానం ద్వారా కశ్మీర్ లోయలో ఉగ్రవాదులను విజయవంతంగా అణచివేశారని.. అదే పద్ధతిని జమ్మూలోనూ అమలు చేయాలని సూచించారు. నవీన పద్ధతు లను అనుసరించి ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు నరేంద్ర మోదీ సర్కారు చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పారు. జమ్మూకశ్మీర్‌లో భద్రతా పరిస్థితులపై ఆదివారం అమిత్ షా ఢిల్లీలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో ఈ మేరకు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోభాల్, జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, సైన్యాధిపతి జనరల్ మనోజ్ పాండే తదితరులు పాల్గొన్నారు. కశ్మీరులో అవలంబించిన స్థానికంగా పైచేయి సాధించడం, జీరో టెర్రర్ ప్లాన్‌లను జమ్మూలోనూ అనుసరించాలని అమిత్ షా భద్రతా సంస్థలను ఆదేశించారు. అలాగే ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్న అమర్‌నాథ్ యాత్ర ఏర్పాట్లపైనా సమీక్షించారు. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల అణచివేతకు ముమ్మర కార్యాచరణ సిద్ధం చేసినట్లు అధికారులు అమిత్ షాకు వివరించారు. కాగా, ఉగ్రవాదులకు మద్దతు తెలిపేవారి ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని కేంద్రం నిర్ణయించినట్లు సమాచారం. అలాగే వారిపై పలు తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయనున్నట్లు తెలిసింది. ఉగ్రవాదుల మద్దతుదారుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వరాదనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా, ఈ నెల 21న ప్రధాని మోదీ జమ్మూకశ్మీర్‌లో పర్యటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.