Share News

The speed is 1,509 kilometers per hour : చప్పుడు చేయని సూపర్‌ సానిక్‌!

ABN , Publish Date - Jan 12 , 2024 | 05:51 AM

కాలం గడుస్తున్న కొద్దీ మానవ సమాజం వేగం పెరుగుతోంది. గగనతల ప్రయాణాన్నే తీసుకుంటే.. హెలికాప్టర్లు వచ్చాయి.. వాటిని మించిన విమానాలు వచ్చాయి..

The speed is 1,509 kilometers per hour : చప్పుడు చేయని సూపర్‌ సానిక్‌!

శబ్దాన్ని నియంత్రించే డిజైన్‌.. 75 డెసిబిల్స్‌కు పరిమితం

వేగం గంటకు 1,509 కిలోమీటర్లు

రేపు వేకువజామున 2.30కి టెస్ట్‌ రైడ్‌

నాసా వెబ్‌సైట్‌లో ప్రత్యక్ష ప్రసారం

(సెంట్రల్‌ డెస్క్‌) : కాలం గడుస్తున్న కొద్దీ మానవ సమాజం వేగం పెరుగుతోంది. గగనతల ప్రయాణాన్నే తీసుకుంటే.. హెలికాప్టర్లు వచ్చాయి.. వాటిని మించిన విమానాలు వచ్చాయి.. వాటిని తలదన్నే విధంగా ధ్వనిని మించిన వేగంతో దూసుకెళ్లే సూపర్‌ సానిక్‌లు కూడా వచ్చేశాయి. సూపర్‌ సానిక్‌లు వేగంలో రికార్డులు సృష్టించాయిగానీ.. విపరీతమైన చప్పుడుతో కొత్త సమస్యనూ తీసుకొచ్చాయి. అవి ప్రయాణించే మార్గంలో భూమ్మీద ఉన్న జనం వాటి మోత భరించలేకపోవటంతోపాటు ఇళ్లు, భవనాల కిటికీల అద్దాలు కూడా పగిలిపోయే పరిస్థితి తలెత్తింది. దీంతో సూపర్‌ సానిక్‌లు తాత్కాలికంగా రిటైరయ్యాయి. ప్రస్తుతం వాటిని తిరిగి రంగంలోకి తీసుకురావటానికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) సంకల్పించింది. శబ్దం సమస్యను పరిష్కరించే కొత్త విమానాన్ని సిద్ధం చేసింది. దాని పేరు ఎక్స్‌-59. ఈ కొత్తతరం సూపర్‌ సానిక్‌ను యావత్‌ ప్రపంచం సాక్షిగా శుక్రవారం సాయంత్రం 4 గంటలకు (భారతీయ కాలమానం ప్రకారం శనివారం తెల్లవారు జామున 2.30 గంటలకు) ప్రయోగాత్మకంగా నడపనుంది. ఇది విజయవంతమైతే విమానయాన రంగంలో మరో కొత్త అధ్యాయం మొదలవుతుంది.

2016లో ప్రాజెక్టు ప్రారంభం

2016లో ‘క్వైట్‌ సూపర్‌ సానిక్‌ టెక్నాలజీ’ (క్వెస్ట్‌ - ఖఠ్ఛఖిఖిఖీ) పేరుతో పెద్దగా చప్పుడు చేయని సూపర్‌ సానిక్‌ విమానాన్ని తయారుచేసే ప్రాజెక్టుకు నాసా శ్రీకారం చుట్టింది. దానిని రూపొందించే కాంట్రాక్టును అమెరికా కంపెనీ లాఖీడ్‌ మార్టిన్‌ కంపెనీకి 2018లో అప్పగించింది. ఈ కాంట్రాక్టు విలువ 24.75 కోట్ల డాలర్లు (రూ. 2,056 కోట్లు) చాలా రహస్యంగా ‘స్కంక్‌ వర్క్స్‌ డివిజన్‌’లో విమానం తయారీ పనులు ప్రారంభమయ్యాయి. ప్రతీ దశలో నాసాలోని పలు విభాగాలు అనేక పరీక్షలు జరిపాయి. మార్పులు చేర్పులు జరిగాయి. ఎక్స్‌-59గా నామకరణం చేసిన ఈ సూపర్‌ సానిక్‌ విమానం.. ఇంతకుముందటి సూపర్‌ సానిక్‌ విమానాల కన్నా సైజులో చిన్నది. దీని పొడవు 95 అడుగులు కాగా, వెడల్పు 30 అడుగులు. బరువు 14,700 కిలోలు. దీంట్లో జనరల్‌ ఎలక్ట్రిక్‌ కంపెనీకి చెందిన ఎఫ్‌4-14 ఇంజిన్‌ను అమర్చారు. విమానం వేగం గంటకు 1,509 కిలోమీటర్లు. సాధారణ సూపర్‌ సానిక్‌ విమానాల నుంచి వెలువడే శబ్దం (సానిక్‌ బూమ్‌) 110 డెసిబిల్స్‌ కాగా, ఎక్స్‌-59 నుంచి 75 డెసిబిల్స్‌ కన్నా పెద్ద శబ్దం రాదని నాసా ప్రకటించింది. శబ్దాన్ని తగ్గించటం కోసమే ప్రత్యేకంగా తయారైన ఎక్స్‌-59 ఆకారం కూడా సాధారణ విమానాలకు భిన్నంగా ఉంటుంది. ఎక్స్‌-59 ముందుభాగం సన్నగా తీగలాగా ఉంటుంది. విమానం పొడవులో దాదాపు సగం ఈ భాగమే. విమానం ముందుభాగంలో పుట్టే షాక్‌వేవ్స్‌, వెనక భాగంలో పుట్టే షాక్‌వేవ్స్‌తో కలిసిపోకుండా ఈ ఏర్పాటు చేశారు.

ముందుభాగం సన్నగా ఉండటం వల్ల అక్కడ కాక్‌పిట్‌ (పైలట్‌ కూర్చునే చోటుకు) ఏర్పాటుకు అవకాశం లేదు. విమానం మధ్యలో ఈ ఏర్పాటు చేశారు. అయితే, పైలట్‌ ఎదుట అన్ని విమానాల్లో ఉన్నట్టుగా అద్దం ఉండదు. దానికి బదులు ఒక తెర ఉంటుంది. దానిపై విమానం ఎలా వెళ్తుందో కనిపిస్తుంది. ఇందుకోసం ఎక్స్‌-59 ముందు సన్నటి భాగంలో రెండు శక్తిమంతమైన కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇవి విమానం ముందున్న పరిస్థితులను రికార్డు చేసి ప్రత్యక్షప్రసారం చేస్తుంటాయి. ఆ దృశ్యాలను తెర మీద చూస్తూ పైలట్‌ విమానాన్ని నడపాల్సి ఉంటుంది. అమెరికాలో ఇప్పటికే ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాల మీద ఎక్స్‌-59 టెస్ట్‌ రైడ్‌ జరగనుంది. దీని తర్వాత.. విమానం నుంచి వెలువడిన శబ్దం గురించి ఆయాప్రాంతాల ప్రజల అభిప్రాయాలను సేకరిస్తారు. కారు తలుపు వేస్తే ఎంత శబ్దం వస్తుందో.. అంతకు మించిన శబ్దం ఎక్స్‌-59 నుంచి రాకపోవచ్చని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రజల అభిప్రాయాలను సేకరించిన తర్వాత వాటిని, విమానయాన రంగ నియంత్రణ సంస్థలకు (రెగ్యులేటర్లకు) నాసా అందిస్తుంది. వాటిని అధ్యయనం చేసిన అనంతరం, సూపర్‌ సానిక్‌ వాణిజ్య విమానాల మీద ప్రస్తుతం ఉన్న నిషేధాన్ని కొనసాగించాలా? వద్దా? కొత్త నిబంధనలు తీసుకురావాలా? అన్నదానిపై నియంత్రణ సంస్థలు నిర్ణయం తీసుకుంటాయి.

2035 నాటికి వినియోగంలోకి..

నాసా చేపట్టే ప్రయోగం విజయవంతం అయినా కూడా ఎక్స్‌-59 విమానయాన రంగంలోకి రావటానికి మరో పదేళ్లకు పైగా పట్టే అవకాశం ఉంది. 2035 నాటికి గానీ ఇది అందుబాటులోకి రాకపోవచ్చని లాఖీడ్‌ మార్టిన్‌ స్కంక్‌ వర్క్‌ మేనేజర్‌ గతంలో చెప్పటం విశేషం. ఎందుకంటే, సూపర్‌ సానిక్‌ విమానాలతో శబ్దం ఒక్కటే సమస్య కాదు.. భారీ ఎత్తున వెలువడే కర్బన ఉద్గారాలు, పెద్ద మొత్తంలో ఖర్చయ్యే ఇంధనం కూడా సవాళ్లే. ప్రస్తుతానికి నాసా వీటి మీద దృష్టి పెట్టటం లేదు. ముఖ్యమైన సమస్య అయిన శబ్దాన్ని తగ్గించిన తర్వాత మిగిలిన వాటిని పరిష్కరించే యోచనలో ఉంది. ఎక్స్‌-59 టెస్ట్‌ రైడ్‌ను నాసా ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. నాసా యాప్‌, వెబ్‌సైట్‌, స్ట్రీమింగ్‌ సర్వీ్‌సలలో లైవ్‌ను చూడవచ్చని పేర్కొంది.

Updated Date - Jan 12 , 2024 | 05:51 AM