Share News

Ayodhya : అయోధ్యలో సుందరకాండ

ABN , Publish Date - Jan 17 , 2024 | 04:07 AM

అయోధ్యలోని రామమందిరంలో ప్రతిష్ఠించనున్న బాల రాముడి విగ్రహంపై సస్పెన్స్‌ వీడింది. మైసూరు శిల్పి అరుణ్‌ యోగిరాజ్‌ చెక్కిన విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్ఠించడానికి ఎంపిక

Ayodhya : అయోధ్యలో సుందరకాండ

మైసూరు బాల రాముడికే పట్టాభిషేకం..

అయోధ్య గర్భగుడి కోసం ఎంపిక చేసిన ట్రస్ట్‌

ఆలయంలో ప్రతిష్ఠాపన

క్రతువులు ప్రారంభం

బెంగళూరు, జనవరి 16(ఆంధ్రజ్యోతి): అయోధ్యలోని రామమందిరంలో ప్రతిష్ఠించనున్న బాల రాముడి విగ్రహంపై సస్పెన్స్‌ వీడింది. మైసూరు శిల్పి అరుణ్‌ యోగిరాజ్‌ చెక్కిన విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్ఠించడానికి ఎంపిక చేసినట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రకటించింది. గత 70ఏళ్లుగా అయోధ్య రామమందిరంలో పూజలందుకుంటున్న రామ్‌లల్లా విగ్రహంతో పాటు ఈ నూతన విగ్రహం కూడా కొలువుదీరనుంది. ఐదేళ్ల బాలుడిగా, నిలబడిన భంగిమలో 150కిలోలకు పైగా బరువున్న కొత్త విగ్రహాన్ని గర్భగుడిలోని ఆసనంపై ఉంచుతామని ట్రస్ట్‌ ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ తెలిపారు. ఈ విషయం తెలియగానే యోగిరాజ్‌ ఉద్వేగానికి లోనయ్యారు. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ క్రతువులు ప్రారంభమయ్యాయి. ఈ నెల 22న రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి సంబంధించిన పూజా కార్యక్రమాలను మంగళవారం నుంచే ఆలయ ప్రాంగణంలో మొదలుపెట్టినట్లు ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్‌ తెలిపారు. ఈ క్రతువులు 21వ తేదీ వరకూ కొనసాగుతాయన్నారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం తొలిరోజు 16న ప్రాయశ్చిత్త పూజ, సరయూ నది ఒడ్డున దశవిధ స్నానం, గోపూజ, విష్ణుపూజ నిర్వహించారు. 22న మధ్యాహ్నం 12.20గంటలకు రామమందిరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం మొదలవుతుందన్నారు. రామమందిరం ప్రతిష్ఠా కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఆలయ ప్రాంగణంలో భారతదేశ శాస్త్రీయ మంగళ వాయిద్యాలను వాయించనున్నట్లు ఆలయ ట్రస్ట్‌ తెలిపింది. 22న ఆలయంలో వాయిద్య ప్రదర్శన కోసం దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సంగీత విద్వాసులను ఎంపిక చేసినట్లు ట్రస్ట్‌ ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ తెలిపారు. వీరు భారతీయ సంప్రదాయానికి చెందిన వివిధ రకాల వాయిద్యాలను వాయిస్తారని వివరించారు. వాటిలో ఘటం (ఏపీ), మృదంగం, నాదస్వరం(తమిళనాడు), వీణ(కర్ణాటక), తంబురా (ఛత్తీ్‌సగఢ్‌), షెహనాయ్‌(ఢిల్లీ) ఉంటాయన్నారు.

అంతా శాస్త్రం ప్రకారమే

అయోధ్యలో ఆలయ నిర్మాణం పూర్తి కాకుండానే ప్రాణ ప్రతిష్ఠ నిర్వహించడం సరికాదంటూ పలువురు పీఠాధిపతులు ఇప్పటికే అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయితే ఈ కార్యక్రమం శాస్త్రాలకు అనుగుణంగానే ఉందని కొందరు మఠాధిపతులు మద్దతు పలుకుతున్నారు. గుజరాత్‌లోని సోమనాథ్‌ ఆలయంలో ప్రాణ ప్రతిష్ఠ జరిగే సమయానికి దాని నిర్మాణం కూడా పూర్తికాలేదని గుర్తుచేస్తున్నారు. దూధేశ్వర్‌ మందిరానికి చెందిన మహంత్‌ నారాయణ్‌ గిరి మాట్లాడుతూ... సోమనాథ్‌ ఆలయంలో పవిత్ర కలశం, ధ్వజస్తంభాన్ని ప్రాణ ప్రతిష్ఠ పూర్తయిన 14 ఏళ్ల తర్వాత ఏర్పాటు చేశారని తెలిపారు.

2dhoopam.jpg

ఢిల్లీలో సుందరకాండ పారాయణం: ఆప్‌

అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠతో రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీకి కౌంటర్‌ ఇచ్చేందుకు ఆప్‌ ప్రయత్నిస్తోంది. ఢిల్లీలో మంగళవారాల్లో ‘సుందరకాండ’ పారాయణాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ‘‘అందరి శాంతి, సంతోషం కోసం ఆప్‌ ఆధ్వర్యంలో ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ‘సుందరకాండ’ పారాయణాన్ని ఏర్పాటు చేస్తున్నాం. మీ సౌకర్యాన్ని బట్టి మీకు సమీపంలో నిర్వహించే పారాయణ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆహ్వానిస్తున్నాను’ అని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ‘ఎక్స్‌’ వేదికగా ఢిల్లీ ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం నిర్వహించిన సుందరకాండ పారాయణ కార్యక్రమాల్లో కేజ్రీవాల్‌తో పాటు పలువురు ఆప్‌ నాయకులు పాల్గొన్నారు. దీనిపై మజ్లిస్‌ చీఫ్‌ అసదుద్దీన్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆప్‌ కూడా బీజేపీ, ఆరెస్సెస్‌ల ఎజెండాను అనుసరిస్తోందని వ్యాఖ్యానించారు.

అయోధ్యలో వెలిగిన 108 అడుగుల అగరుబత్తి

అయోధ్య రాముడికి గుజరాత్‌ నుంచి భక్తులు వడోదర నుంచి కానుకగా పంపిన 108 అడుగుల అగరుబత్తీని మంగళవారం వెలిగించారు. భారీ జనసందోహం ‘జై శ్రీరామ్‌’ నినాదాలు చేస్తుండగా శ్రీరామజన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ మహంత్‌ నృత్యగోపాల్‌ దాస్‌ దీన్ని వెలిగించారు. 108 అడుగుల పొడవు.. మూడున్నర అడుగుల వెడల్పుతో 3,610 కేజీల బరువున్న ఈ బాహుబలి అగరుబత్తీ ధూపం నుంచి వచ్చే సువాసన సుమారు 50కిలోమీటర్ల వరకూ వ్యాపిస్తుందని నిర్వాహకులు తెలిపారు.

Updated Date - Jan 17 , 2024 | 04:07 AM