Share News

నితీశ్‌ దారిలో మరికొన్ని పార్టీలు!

ABN , Publish Date - Feb 01 , 2024 | 03:01 AM

జేడీయూ అధినేత నితీశ్‌ కుమార్‌ దారిలో మరికొన్ని పార్టీలు మళ్లీ బీజేపీతో చేతులు కలిపేందుకు సిద్ధమవుతున్నాయి! ఈ

నితీశ్‌ దారిలో మరికొన్ని పార్టీలు!

బీజేపీ సీనియర్‌ నేత వెల్లడి..తమిళనాడు నుంచి మోదీ పోటీ?

న్యూఢిల్లీ, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): జేడీయూ అధినేత నితీశ్‌ కుమార్‌ దారిలో మరికొన్ని పార్టీలు మళ్లీ బీజేపీతో చేతులు కలిపేందుకు సిద్ధమవుతున్నాయి! ఈ మేరకు ఆయా పార్టీలతో చర్చలు జరుగుతున్నాయని బీజేపీ సీనియర్‌ నాయకుడొకరు తెలిపారు. పంజాబ్‌కు చెందిన అకాలీదళ్‌ కూడా తమతో చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నదన్న ఆయన.. కర్ణాటకలో జేడీఎస్‌ ఇప్పటికే తమతో కలిసి పోటీ చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రస్తుతం దక్షిణాదికి చెందిన ఒకటి, రెండు పార్టీలతో పొత్తుపై చర్చలు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. ఫిబ్రవరి 9న పార్లమెంట్‌ సమావేశాలు ముగిసిన తర్వాత ఏ రోజైనా ఎన్నికల షెడ్యూలు ప్రకటించవచ్చన్న సంకేతాలు అందాయని.. సాధ్యమైనంత త్వరలో ఎన్నికలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. కాగా.. దక్షిణాది రాష్ట్రాల్లో అధిక సీట్లు సాధించడంపై దృష్టి సారించిన ప్రధాని మోదీ.. సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడులోని కోయంబత్తూరు, రామనాథపురం, కన్యాకుమారి సీట్లలో ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేయవచ్చని సమాచారం. ప్రధాని మోదీ జనవరిలో తమిళనాట మూడురోజులు పర్యటించడమే కాక.. రూ.వేలాది కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు ప్రారంభించడం, ఆలయాలను సందర్శించి భారీ రోడ్‌షోలను నిర్వహించడమే ఆయన ఆ రాష్ట్రం నుంచి పోటీ చేస్తున్నారనడానికి సంకేతాలనే అభిప్రాయాలు వినపడుతున్నాయి. ఇటీవల కేంద్రం పద్మవిభూషణ్‌ ప్రకటించిన ఐదుగురిలో ఇద్దరు తమిళనాడుకు చెందినవారే కావడం, కెప్టెన్‌ విజయ్‌కాంత్‌కు మరణానంతరం పద్మభూషణ్‌ ప్రకటించడం, ఐదుగురు తమిళులకు పద్మశ్రీ ప్రకటించడం కూడా ఇందుకు నిదర్శనమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా, మోదీ దక్షిణాది నుంచి పోటీ చేయాలని భావిస్తే తెలంగాణ నుంచి పోటీ చేయాల్సిందిగా అభ్యర్థిస్తామని రాష్ట్రానికి చెందిన సీనియర్‌ నాయకుడొకరు తెలిపారు. తెలంగాణలో బీజేపీ పుంజుకుంటోందని, మోదీ పోటీ చేస్తే కాషాయ ప్రభంజనం వీస్తుందని.. ఆ ప్రభావం ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

Updated Date - Feb 01 , 2024 | 07:20 AM